close

తాజా వార్తలు

ఆ పాట నా ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది!

సీతారామశాస్త్రిలాంటి గొప్ప వ్యక్తి రాయాల్సిన పాట అది

అక్షరాలు ఆయన చెబితే వింటాయి.. పాటలు ఆయనతో మాట్లాడతాయి.. భావాలు దాగుడుమూతలు ఆడతాయి. ఆయన పల్లవి మనల్ని పలకరిస్తుంది.. ఆయన చరణం ఒళ్లు పులకరిస్తుంది.. పదాలలో పదును చూపించి.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తారు. ఆయనే ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. 

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?
రామజోగయ్య శాస్త్రి:  2004లో 

సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటారు. మీరు?
రామజోగయ్య శాస్త్రి: ఇది తాతయ్యగారి పేరు. నేను మార్చుకోలేదు. 

మీ సొంతూరు ఏది?
రామజోగయ్య శాస్త్రి: గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ల. 

మీరు తొలుత ఎక్కడ ఉద్యోగం చేశారు?
రామజోగయ్య శాస్త్రి: నేను ఇంజినీరింగ్‌ చదివా. మొదట్లో నేను బెంగళూరులో పనిచేసేవాడిని. 

తెలుగువారైన మీరు కన్నడ నేర్చుకుని, అక్కడ ఇండస్ట్రీలో పాటలు రాయడం ద్వారా కెరీర్‌ను ప్రారంభించారా?
రామజోగయ్య శాస్త్రి: అవును! రమేశ్‌ అరవింద్‌ సినిమాకు పాటలు రాశా. నేను బెంగళూరులో ఉన్న సమయంలో రవిచంద్రన్‌గారు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వేరే గాయకుల ద్వారా ఆయన పరిచయం అయ్యారు. కొన్నాళ్లు ఆయన క్యాంప్‌లో కూడా ఉన్నా. ఆయన సినిమాకు కూడా పాటలు రాశా. అయితే, అది తెలుగులో విడుదల కాలేదు. తొలుత సాయిచంద్ర అనే స్క్రీన్‌ నేమ్‌తో రాసేవాడిని. ఇక్కడకు వచ్చాక తొలి సినిమా ‘యువసేన’. 

మొదట నటుడు అవుదామని వచ్చారా?
రామజోగయ్య శాస్త్రి: అలా ఏమీ లేదు. అయితే, సింగర్‌ కావాలన్నది నా కల. చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశం. నాకు పరోక్షంగా బాల సుబ్రహ్మణ్యంగారు స్ఫూర్తి. ‘ముత్యమల్లె మెరిసిపోయే మల్లెమొగ్గ..’ నేను నేర్చుకున్న మొదటి పాట. ఎక్కడ ఫంక్షన్‌ జరిగినా ఈ పాట పాడేవాడిని. వరంగల్‌లో నేను చదువుకునేటప్పుడు బాగా పాటలు పాడేవాడిని. అక్కడ మ్యూజిక్‌ క్లబ్ ఉండేది. నార్త్‌ ఇండియన్స్‌ కూడా ఉండేవాళ్లు. వాళ్లు బాగా పాటలు పాడేవారు. వారిలో తెలుగు పాటలు పాడేవారు తక్కువ ఉండేవారు. దీంతో నేను తెలుగు పాటలు పాడేవాడిని. ఎంటెక్‌ ఖరగ్‌పూర్‌లో చేసినా, మద్రాసులో స్థిరపడి, బాలుగారు, మనోగారిలా పాటలు పాడాలని అనుకునేవాడిని. మనం అనుకున్నది ఎప్పుడూ అవ్వదు కదా! బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అలా సింగర్స్‌తో పరిచయం ఏర్పడి, అది రచనవైపు మళ్లింది. 

అప్పట్లో ఆరుద్ర, ఆత్రేయలు పాటలతో పాటు సినిమాలకు మాటలు కూడా రాసేవారు. ఇప్పుడున్న రచయితల్లో ఆ మల్టీ టాస్క్‌ ఎందుకు లేదు?
రామజోగయ్య శాస్త్రి: తెలియదు. అయితే, ఏ పని చేసినా ఇష్టం ఉండాలి. వాళ్లలో ఆ లక్షణం ఉండాలి. బుర్రా సాయిమాధవ్‌గారు మాటలు రాస్తారు. ఒకటి రెండు సినిమాల్లో పాటలు కూడా రాశారు. నేను ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నాకు దానిపై ఆసక్తి లేదు. పాటలు రాయడం మన ఉద్యోగమైనా, మనతో పాటు మన చుట్టు పక్కల రంగాల గురించి కాస్త తెలిసి ఉండాలి. 

తెలుగులో ఏ సినిమాకు తొలిసారి పాటలు రాశారు?
రామజోగయ్య శాస్త్రి: స్రవంతి రవికిషోర్‌గారి ‘యువసేన’. అందులో ‘ఓణీ వేసుకున్న పూల తీగ..’, ‘ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా’ పాటలు రాశా. ఇప్పటివరకూ ఎవరికీ తెలియని రహస్యం ఒకటి చెబుతా.  కన్నడలో ‘ఏకాంగి’ సినిమాకు డబ్బింగ్‌ పాటలు రాయడానికి కృష్ణవంశీగారు నన్ను సీతారామశాస్త్రిగారి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ‘మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది’ అని ఆయనతో అన్నా. ఆయన ‘సరే’ అన్నారు. ఆయనతో ఏడాదికి పైగా ప్రయాణం చేశా. అప్పుడు స్రవంతి రవికిషోర్‌గారు నన్ను చూశారు. అప్పుడు ఆయన చేయబోతున్న ‘యువసేన’లో ఐటమ్‌సాంగ్‌ రాసే అవకాశం ఇచ్చారు. అయితే, ‘ఐటమ్‌ సాంగ్‌ రాస్తే దానికే పరిమితం చేస్తారు. అలా కాకుండా నేను రాయాల్సిన డ్యూయట్‌ను కూడా రామజోగయ్యతో రాయించండి. అప్పుడు రెండు పాటలు రాసినట్లు అవుతుంది’ అని సీతారామశాస్త్రిగారు తాను రాయాల్సిన పాటను త్యాగం చేసిన నాకు ఇచ్చారు. ఆ తర్వాత నేను పాటల కోసం కసరత్తులు చేయడం మొదలు పెట్టా. ఒకరోజు తెల్లవారుజామున ఆయన పక్కన కూర్చొని పాటలపై సాధన చేస్తుంటే, ‘ఓణీ వేసుకున్న మల్లెతీగ..’ అంటూ పల్లవి ఆయన రాసిచ్చి, నేను రాసిన వాటిలోని పదాలతో చరణాలు పూర్తి చేశారు. నాకు కన్నీళ్లు ఆగలేదు. సాధారణంగా ‘చెట్టు నీడన చెట్టు పెరగదు’ కానీ, ఆయనలాంటి మహావృక్షం నీడలో నేను ఎదిగా. అలాంటి నాకోసం ఆయన పాట రాశారు. దాన్ని మార్చకుండా ఆ పాటతోనే నా కెరీర్‌ ప్రారంభించాలని అనుకున్నా. దాన్నొక అదృష్టంగా భావించా. ఆయన మాటల్లోని మంత్రశక్తి నా కెరీర్‌కు పునాదిలా ఉపయోగపడాలన్నది నా స్వార్థం. ఈ విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. 

ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు?
రామజోగయ్య శాస్త్రి: దాదాపు 1200 రాసి ఉంటా. అన్నీ తెలుగులోనే రాశా.

మిమ్మల్ని ఓ స్థాయిలో నిలబెట్టిన పాట ఏది?
రామజోగయ్య శాస్త్రి: ‘ఖలేజా’లోని ‘సదా శివ సన్యాసి’. నేనెప్పుడూ ఆల్‌రౌండర్‌గా ఉండాలని కోరుకుంటా. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండాలంటే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలిగిన పాటలు రాయడం తెలియాలి. పెద్ద పెద్ద పాటలు, భక్తి గీతాలు, క్లైమాక్స్‌ సాంగ్స్‌ రాయడానికి శాస్త్రిగారి లాంటి పెద్దలు ఉన్నారు. నేను కూడా అదే జోనర్‌లో ఉండిపోతే, ముందుకు వెళ్లలేం. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే కమర్షియాలిటీతో కూడిన పాటలు రాయాలనుకున్నా. అలాంటి సమయంలో శ్రీనువైట్లగారు నన్ను చేయిపట్టుకుని తీసుకెళ్లారు. అలా కమర్షియల్‌ పాటలు బాగా రాస్తానన్న ముద్ర పడింది. అలాంటి సమయంలో గురువుగారు సీతారామశాస్త్రిలాంటి వారు రాయాల్సిన ‘సదా శివ సన్యాసి’ పాట నేను రాశానంటే ‘ఈయనలో ఈ విషయం కూడా ఉంది’ అన్న ఇమేజ్‌ రావడానికి దోహదపడింది. ఆ పాట నాకు రావడం నా అదృష్టం. 

ఈ పాట మొదటిసారి రాయగానే డైరెక్టర్‌ ఓకే చేశారా?
రామజోగయ్య శాస్త్రి: ఇందులో మూడు పద్య శ్లోకాలు ఉంటాయి. మొదటిదాని కోసం చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. రెండు, మూడు రాయడం కోసం డైరెక్టర్‌గారితో కూర్చొని ఒకరోజులో పూర్తి చేశా. రికార్డింగ్‌లో స్పేస్‌ లేదని చెప్పి, రెండే రికార్డు చేశారు. మూడోది ఫైట్‌ సీన్స్‌లో బ్యాగ్రౌండ్‌లో వస్తుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పా. అలా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌గారి వల్ల ఒక మంచి పాట నా ఖాతాలో పడింది. 

మీరు పాట రాసేటప్పుడు ‘ఈ పాట ఫలానా సింగర్‌ పాడితే బాగుంటుంది’ అనుకున్నారా?
రామజోగయ్య శాస్త్రి: ఎప్పుడూ ఆలోచన రాలేదు. నా పని వరకూ నేను చేసుకుంటా. 

డబ్బింగ్‌ పాటల్లో వినిపించే తెలుగు పదాలు.. నేరుగా తెలుగు సినిమాకు రాసేటప్పుడు ఎందుకు కనిపించవు?
రామజోగయ్య శాస్త్రి: అలా ఏమీ లేదు. డబ్బింగ్‌ పాటల్లో కూడా ఆ పదాలు ఉంటే అలాగే రాస్తాం. ఇది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. స్వచ్ఛమైన తెలుగు పదాలు వినపడకపోవడం కూడా పెద్ద కంప్లయింట్‌ ఏమీ కాదు. అయితే, నేను రాసిన ‘ప్రణామం.. ప్రణామం’, అనంత్‌ శ్రీరామ్‌రాసిన ‘ఇంకేం.. ఇంకే కావాలే..’, చంద్రబోస్‌ రాసిన ‘వేరుశెనగ కోసం.. మట్టిని తవ్వితే..’ ఇలా చాలా పాటలు వస్తున్నాయి. కొంతమందికి ఏం చేసినా నచ్చదు. 

మీది ప్రేమ వివాహమా.. పెద్దలు కుదిర్చిన వివాహమా?
రామజోగయ్య శాస్త్రి: పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆమె మా అక్క కూతురు. 

మీరు రాసిన పాటను చూసి ‘ఇదేం పాట శాస్త్రిగారూ’ అన్నవాళ్లు ఉన్నారా?
రామజోగయ్య శాస్త్రి: నేను రాసిన పాట చూడగానే ‘ఆహా.. ఓహో..’ అంటూ రికార్డింగ్‌కు పంపరు. అదే సమయంలో ‘ఇలా రాశారేంటి సర్‌..’ అని కూడా అనరు. ఎందుకంటే నా ట్రాక్‌ రికార్డు ఏంటో వాళ్లు తెలుసు. ‘ఇంకొంచెం బెటర్‌గా రాస్తే బాగుంటుందేమో’ అంటారు తప్ప ముఖం మీద ‘బాగోలేదు’ అని చెప్పరు. కొన్నిసార్లు వాళ్లు ఓకే చెప్పినా, ఇంకా బాగా రాయొచ్చేమోనని నేను ఆలోచిస్తా. మనకు పని ఇచ్చిన వ్యక్తి మన పనిపట్ల సంతోషంగా ఉండాలని కోరుకుంటా. 

అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన డైరక్టర్‌ ఎవరైనా ‘నేను రాసిన పాటను మళ్లీ ఒకసారి ట్రై చేయండని చెప్పడమేంటి’ అని ఎప్పుడైనా మీకు అనిపించిందా?
రామజోగయ్య శాస్త్రి: నాకు ఏదైనా చెబితే, ఇంట్లో అందుకు తగిన హోంవర్క్‌ చేసుకుని, పది రకాలు వెర్షన్లు రాసుకుని, అందులో రెండు బాగున్నాయని వాటిని తీసుకుని వెళ్తాను. అలా వెళ్లినప్పుడు వాళ్లు కాదనడాన్ని కూడా నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ల దృక్పథం ఏముందో నాకు తెలియదు కదా! నాకు బలమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు నేను పుస్తకాలు, కవితలు రాసుకుని పబ్లిష్‌ చేసుకోవడం సరైన పని. కానీ, నేనున్న రంగంలో ఒక మనిషికి ఒక విజన్‌ ఉంటుంది. దాన్ని సాకారం చేయాలి. అందుకు వివిధ క్రాఫ్ట్‌లు కావాలి. అందులో నేను కూడా ఒకడిని. అసలు ఆలోచన అతనిదే. వెన్నెముక అతనే. దానికి నేను అలంకరణ చేయాలి. అందుకే నన్ను పిలుస్తున్నారు. అలాంటప్పుడు అతని పరిధికి లోబడి నేను పని చేయాలి. అయితే, ఈ ప్రయాణంలో నాకొంత అనుభవం ఉంది. కొన్ని సలహాలు నేను సూచించవచ్చు. కానీ, దానికి ఒక పద్ధతి ఉంది. వాళ్ల ఆలోచనలు, భావాలను తొక్కేసేలా ఉండకూడదు. 

సోషల్‌మీడియాలో మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు కదా.. అందుకు కారణం ఏదైనా ఉందా?
రామజోగయ్య శాస్త్రి: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండటం నాకు ఇష్టం. ఎందుకంటే లిరిక్‌ రైటర్స్‌కు ఇండస్ట్రీలోనూ, బయటా రావాల్సినంత ప్రాధాన్యం రాలేదేమోననిపిస్తుంది. ‘నన్ను గౌరవించండి.. నన్ను గుర్తించండి’ అని అనే కన్నా, మన పనిని ముందు పెడితే, అదే మనకు పేరు తీసుకొస్తుందని నేను భావిస్తా. అందుకే ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటా. నేటి యువతకు సాహిత్యం పట్టదని అనుకుంటారు. కానీ, నేను రాసిన పాటను, అందులోని పదాలను నాకే కోట్‌ చేసి పెడతారు. అంటే వాళ్లు ప్రభావితం అవుతున్నారని అర్థం. ‘జనతా గ్యారేజ్‌’కు పాటలు రాసినప్పుడు కూడా ప్రభావితమైన యువత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 

మరి ఆడియో విడుదల వేడుక అంటేనే, సంగీత దర్శకుడు, లిరిక్‌ రైటర్స్‌కు సంబంధించింది. అక్కడ మీ గురించే చెబుతారు కదా! అది కూడా పబ్లిసిటియే కదా! 
రామజోగయ్య శాస్త్రి: పాటకు సంగీతం-సాహిత్యం రెండూ అవసరమే. అవి రెండూ కలిస్తేనే పాట అవుతుంది. రెండు సమపాళ్లలో చూడాలి. అలాంటి సందర్భాల్లో మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని నాకు అనిపించింది. దాన్ని సరిచేయడం కోసం, సోషల్‌మీడియా వేదికగా చురుగ్గా ఉంటా. అంతేకానీ, సంగీత దర్శకులను, నిర్మాతలను తక్కువ చేయడానికి కాదు. 

‘కేజీఎఫ్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’లాంటి చిత్రాలకు తెలుగులో పాటలు రాశారు. అవి మీ కెరీర్‌కు ఎలా ఉపయోగపడ్డాయి?
రామజోగయ్య శాస్త్రి: నా కెరీర్‌కు అవి ప్లస్‌ అయ్యాయి. ఒకప్పుడు డబ్బింగ్‌ పాటలను సులభంగా గుర్తించగలిగేవాళ్లం. ఎందుకంటే అందులోని ట్యూన్‌కు, సాహిత్యానికి పొంతన ఉండేది కాదు. ఒక శ్రోతగా నాకు అది నచ్చేది కాదు. డబ్బింగ్‌ పాట కూడా స్ట్రయిట్‌ సాంగ్‌లా ఉండాలని నేను పెట్టుకున్న నియమం. అలాంటప్పుడు ఒరిజినల్‌ పాట కన్నా నేను రాసిన డబ్బింగ్‌ పాట బాగుందని మెచ్చుకుంటే అంతకన్నా ఆనందం వేరే ఉండదు. ‘పహిల్వాన్‌’ సినిమా ఆడియో విడుదల వేడుక సమయంలో సుదీప్‌ నన్ను ఎంతో మెచ్చుకున్నారు. ‘కేజీఎఫ్‌’కు రాసినప్పుడు ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ.. ‘తెలుగులో మీరొక మార్కెట్‌ క్రియేట్‌ చేశారు’ అన్నారు. ఇటీవల ‘దబంగ్‌3’కి రాశా. 

హాలీవుడ్‌లో పాటలు ఉండవు. టైమ్‌ సేవ్‌ అవుతుంది. అలాంటి పరిస్థితి తెలుగులో వస్తే లిరిక్‌ రైటర్ల పరిస్థితి ఏంటి?
రామజోగయ్య శాస్త్రి: ఏముంటుంది ఏమీ ఉండదు. కొన్నాళ్లు టైటిల్‌ సాంగ్స్‌ వరకూ పెడతారేమో. ఆ తర్వాత అవి కూడా ఉండవు. రాంగోపాల్‌వర్మలాంటి దర్శకుల సినిమాల్లో పాటలే ఉండవు కదా!

మీరు నాటక రంగం నుంచి వచ్చారని అంటారు నిజమేనా?
రామజోగయ్య శాస్త్రి: నేనెప్పుడూ నాటకాలు వేయలేదు.  

మీ తొలి అవార్డు ఏది?
రామజోగయ్య శాస్త్రి: ‘శ్రీమంతుడు’టైటిల్‌ సాంగ్‌, ‘ప్రణామం.. ప్రణామం’ పాటలకు నంది అవార్డులు వచ్చాయి. వీటితో పాటు చాలా అవార్డులు వచ్చాయి.

సాధారణంగా ట్యూన్‌లు, పాటలు కాపీ కొడతారు. మీరెప్పుడైనా లిరిక్‌లు కాపీ కొట్టారా?
రామజోగయ్య శాస్త్రి: ఆలోచనల్లో ఎక్కడో ఒక చోట ఇన్స్‌ప్రేషన్‌ ఉంటాయి. ఒక సందర్భంలో తెలిసి కావాలని కాపీ కొట్టా. నా చిన్నప్పుడు మా ఊళ్లో గ్రంథాలయంలో చదువుకుంటున్నప్పుడు ఓ పత్రికలో ఒక న్యూస్‌ ఐటమ్‌ చూశా. విద్యాసాగర్‌గారు సంగీత దర్శకుడు, వెన్నెలకంటి పాటలు రాశారు. ‘చిరు నవ్వులు వరమిస్తావా.. చితి నుంచి బతికొస్తాను. మరు జన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తాను’ ఈ పదాలను ‘ఎందుకంటే ప్రేమంటే’ సినిమాలో రాశా. ఈ విషయం వెన్నెలకంటిగారికి కూడా చెప్పా. ఆయన చాలా సంతోషించారు. 

మీ పేరును ఒక్క అక్షరంగా మార్చమంటే ఏమని మారుస్తారు?
రామజోగయ్య శాస్త్రి: జో

సిగ్గుపడే అమ్మాయిలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
రామజోగయ్య శాస్త్రి: సిగ్గుపడేలోపు ఒక సెల్ఫీ తీసుకొని వస్తా. 

మీరు రాసిన పాటల్లో ఒక పాటను మ్యూజియంలో పెట్టమంటే ఏ పాటను పెడతారు.
రామజోగయ్య శాస్త్రి: చాలా కష్టమైన ప్రశ్న. నేను రాసిన మొదటి కన్నడ పాట మ్యూజియంలో పెడతా. 

సిరివెన్నెల సీతారామశాస్త్రిపై పుస్తకం రాస్తే దానికి మీరు ఏం పేరు పెడతారు?
రామజోగయ్య శాస్త్రి: తాపసి. తపస్సంపన్నుడు. ఇవాల్టికీ నిత్య విద్యార్థిలా కష్టపడుతుంటారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.