close

తాజా వార్తలు

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన.. 290కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితా నంది పురస్కారాలు అందుకున్నారు. మాస్టారి కాపురం సినిమాకు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం లభించింది. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. ఈ దంపతులకి ముగ్గురు మగసంతానం.

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచితమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు.

చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేశారు. మనసున మనసై, ప్రజావేదిక, వేదిక, సినీ సౌరభాలు తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరి గోల వారిదే, ప్రేమలు పెళ్ళిళ్ళు, భార్యారూపవతీ శత్రు, ఏది నిజం? తదితర ధారావాహికల్లో నటుడిగా మెప్పించారు. 

అవార్డులు

మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నాడు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.

* 1963 లో ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా..

* 1965 లో ‘ఆత్మగౌరవం’ అనే సినిమాకి ఉత్తమ రచయితగా..

* 1989 లో ‘కళ్ళు’ అనే రచన సినిమాగా వచ్చింది. దానికి ఉత్తమ రచయితగా..

* 1991లో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణల రచయితగా

ఇతర పురస్కారాలు

* 2002లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నాడు.

* 1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు.

* ఉత్తమ హాస్యరచనకు గానూ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం

* 2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం

* 1985లో వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు మెమోరియల్ బంగారు పతకం

* 1959 లో ఆకాశవాణి నిర్వహించిన, ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి

* ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం

* 1984లో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కిలీ పురస్కారం

* 1983 లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడి పురస్కారం

* 1985లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయనటుడి పురస్కారం

* 1987లో ‘సంసారం’ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎంపిక.

* 2015లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం

ఇవే కాక 2009 లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య, అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును, మారుతీరావుకు ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పొలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని అందుకున్నాడు.

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.