close

తాజా వార్తలు

కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!

అంతేగా వింతేగా

ఓ ఇంజినీరింగ్‌ తప్పిదం..ముప్పునకు కారణమైంది. విషయం తెలిసి ‘అయ్యో..’ అనే సరికే చాలా ఆలస్యమైంది.. చేతులు దాటిపోయింది. ఇక చేసేది లేక తాత్కాలిక పరిష్కారంతో ఎలాగో అలాగ నెట్టుకొస్తున్నారు. ఇంతకీ ఏంటా తప్పు?..ఏమా ముప్పు?.. చదవండి మరి.. మీకే తెలుస్తుంది!

లండన్‌ చల్లగా ఉండే ప్రదేశం. కానీ ఈ నగరంలోని ఓ వీధి మాత్రం చలికాలంలోనూ సెగలు పుట్టిస్తోంది. ఎంత వేడిగా అంటే.. ఏకంగా కార్ల భాగాలే కరిగిపోయేంత! సమీపంలో ఉన్న దుకాణాలు, భవనాలూ భగభగమంటున్నాయి. దీనికి ఏ గ్లోబల్‌ వార్మింగో, వాతావరణ కాలుష్యమో, పరిశ్రమలో కారణం కాదు. ‘వాకీటాకీ’తోనే అసలు సమస్య! అదేనండి ఈ పేరుతో పిలుచుకునే ఓ పెద్ద భవంతే ఈ వేడికి మూలం! చదవడానికి వింతగా ఉన్నా... ఇది నిజంగా నిజం.
ఆకారంతోనే అనర్థం
వింత ఆకారం వల్లనే స్థానికులు ఈ భవనానికి వాకీటాకీ భవంతి అని పేరు పెట్టారు. ఇంతకీ ఈ భవనం ఎక్కడ ఉందో చెప్పనేలేదు కదూ! దీన్ని 20 ఫెన్‌చర్చ్‌ స్ట్రీట్‌లో నిర్మించారు. వంపు తిరిగి ఉన్న దీని విచిత్ర ఆకృతే సమస్యకు కారణమవుతోంది. ఈ భవనానికి ఏర్పాటు చేసిన అద్దాలు సూర్యకాంతిని స్వీకరించి ఎదురుగా ఉన్న రోడ్డు మీదకు పరావర్తనం చెందిస్తున్నాయి. నిజానికి ఇలా పరావర్తనమైతే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ కిరణాలను చెల్లాచెదురుగా కాకుండా... వాటన్నింటినీ ఓ చోట కేంద్రీకృతం అయ్యేలా చేస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే... అచ్చం భూతద్దాల మాదిరిగా పనిచేసి.. చాలా వేడిని పుట్టిస్తున్నాయన్నమాట.

కారు నిలిపితే అంతే!
ఈ కిరణాలు పడే ప్రాంతంలో నిలిపిన కార్ల భాగాలు ఈ వేడికి కరిగిపోతున్నాయి. 2011లో ప్రారంభమైన ఈ భవన నిర్మాణం 2014లో పూర్తైంది. 2013లోనే... ఈ భవంతి చివరి హంగులు అద్దుకునే సమయంలో ఈ విషయం బయట పడింది. జాగ్వార్‌ కారును దాని యజమాని రోడ్డుపై సరిగ్గా కిరణాలు పడే ప్రాంతంలో నిలిపాడు. సుమారు రెండు గంటల తర్వాత వచ్చి చూసి.. అవాక్కయ్యాడు. కారు భాగాలు చాలా వరకు కరిగిపోయి ఉన్నాయి. సైడ్‌ వ్యూ అద్దాలు, డోర్లు, ఇలా పలు భాగాలు ఆకృతి కోల్పోయి కనిపించాయి. ఆ భవంతి డెవలపర్స్‌ విషయం తెలుసుకుని సారీ చెప్పారు. కారు రిపేరుకు అయ్యే ఖర్చులన్నీ భరించారు.

అప్పటికే చేయిదాటి పోయింది
కారు యజమానికి నష్టపరిహారం అయితే ఇచ్చారు కానీ అప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తి కావడంతో ఆకృతి విషయంలో ఏమీ చేయలేకపోయారు. ఎన్ని చిన్నచిన్న మార్పుల కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎదురుగా ఉన్న దుకాణాల బయట ఏర్పాటు చేసిన కార్పెట్లు ఏకంగా కాలిపోవడం ప్రారంభమైంది. బయట టైల్స్‌ పగిలిపోతున్నాయి. దుకాణాల ముందు ఆకర్షణ కోసం ఏర్పాటు చేసిన చిన్నచిన్న లాన్‌లలోని గడ్డి మాడిపోవడం ప్రారంభమైంది. ప్యాన్‌లో కోడిగుడ్డును కొట్టిపోస్తే ఏకంగా ఆమ్లెట్‌ అవుతోంది. ఏంటబ్బా.. ఇది అని అక్కడ ఉష్ణోగ్రతను కొలిస్తే... ఏకంగా 80 డిగ్రీల సెల్సియస్‌కు పైనే చూపించింది. అవాక్కైన ఇతర దుకాణాల వారు తమ భవనాలకు దీర్ఘకాలంలో నష్టం తప్పదని గగ్గోలు పెట్టారు.

డిజైన్‌లో లోపం వల్లే..
నిజానికి ఈ భవన ఇంజినీర్‌ కేవలం ఆకృతి, అందం మీదే దృష్టి పెట్టాడు.. కానీ దీని వల్ల ఎదురయ్యే పర్యవసానాలను ఊహించలేకపోయాడు. తెలుసుకునే సరికే చాలా ఆలస్యమైపోయింది. మొత్తానికి ఈ ప్రాంతంలో మనుషులు పట్టుమని పదినిముషాలూ నిల్చోలేని పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు ఇక్కడ పడే వెలుగుకు మృత్యుకిరణాలు (డెత్‌ రేస్‌) అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. భవన నిర్మాణం పూర్తి కావడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక అప్పటి నుంచి సమస్యకు కారణమవుతున్న ఆ భవనం పైభాగాన ఉన్న అద్దాలకు పెద్ద తెర అడ్డుగా కడుతున్నారు. ఇలా తాత్కాలికంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతున్నారు.

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.