close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ సినిమా చేస్తుండగా పెద్ద అల వచ్చి లాక్కెళ్లిపోయింది!

వెండితెర వెలుగంతా ఆమె మోములోనే ఉంటుంది. వెండితెర ఆనందమంతా ఆమె నవ్వులో ఉంటుంది. అందుకే వెండితెర ఆమెను ప్రేమించి ఎన్నో పాత్రలను ఇచ్చింది. ఆ పాత్రకు ఆమె ప్రాణం పోసింది. హీరోయిన్‌గా, నటిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు సుమిత్ర. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే, ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి, ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా...

మీరు సుమిత్రానా? శాంతా కుట్టినా?
సుమిత్ర: మీరు ఎక్కడికో వెళ్లిపోయారు. మేము మలయాళీలమే. అయితే, మా నాన్నగారు 18వ యేట ఉద్యోగం నిమిత్తం వైజాగ్‌ వచ్చేశారు. ఆయనకు మేము నలుగురు పిల్లలం. నేను.. నాకు ముగ్గురు తమ్ముళ్లు. నాకు 13వ సంవత్సరం వచ్చే వరకూ వైజాగ్‌లోనే ఉన్నాం. మా అమ్మకు బంధువులు ఉంటే సెలవులకు చెన్నై వెళ్లాం. అక్కడ ట్రస్ట్‌పురం వద్ద హాలీవుడ్‌ అనే టీస్టాల్‌ ఉండేది. రోజూ నాన్న టీ తాగడానికి అక్కడకు వెళ్లేవారు. సినీ నటి కేఆర్‌ విజయ, డ్యాన్స్‌ మాస్టర్‌ మురుగప్ప కూడా అక్కడికే వచ్చేవారు. అలా నాన్న..ఆయన అనుకోకుండా స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఆయనను ఒకరోజు మా ఇంటికి తీసుకొచ్చారు. 

అప్పుడు మేమంతా ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాం. ఆయన నన్ను చూసి, ‘అమ్మాయి చాలా ముద్దుగా బాగుంది. సినిమాల్లో ఏమైనా ట్రై చేశారా’ అని అడిగారు. నాన్నగారు ‘లేదండీ. నాకు ఒక్కతే కూతురు. చదువుకుంటోంది. ఇప్పుడు అవేవీ వద్దులేండీ’ అన్నారు. దానికి ఆయన ‘ప్రయత్నించకుండా సెలెక్ట్‌ అయిపోయినట్లు మాట్లాడతారేం. ఎవరి తలరాత ఎలా ఉందో చెప్పలేం’అని నన్ను ఒక మలయాళీ సినిమా కంపెనీకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లకు 13-14ఏళ్ల వయసున్న అమ్మాయి పాత్ర కావాలట. అప్పటికే ఒక అమ్మాయిని ఎంపిక చేశారు. అయితే, నన్ను చూడగానే, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి పంపించేశారు. ‘రేపు ఉదయం మీ ఇంటికి మా మేకప్‌ మ్యాన్‌ వస్తారు. మీ అమ్మాయిని పంపండి’ అని నాన్నగారి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టారు. అలా ఆ సినిమా చేస్తుంటే, ఆ సెట్‌కు దర్శకుడు రాము కారాట్‌ వచ్చారు. ఆయన జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు. నన్ను చూసి తన తర్వాతి సినిమాకు ఆఫర్‌ ఇచ్చారు. అలా అనుకోకుండా రెండు సినిమాలు చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలు చేసేటప్పుడే ఇంట్లో అనుకున్నాం.. శాంత అంటే సింపుల్‌గా ఉందని సుమిత్రగా పేరు మార్చుకున్నా. 

ఏ సంవత్సరంలో మీరు ఇండస్ట్రీకి వచ్చారు?
సుమిత్ర: 1974-75లో వచ్చా. ఐదు భాషల్లో ఇప్పటివరకూ దాదాపు 600 సినిమాల్లో చేశా. అందులో హీరోయిన్‌గా చేసినవి కూడా ఉన్నాయి. తుళులో కూడా సినిమాలు చేశా. 

ఈ ఐదు భాషల్లో ఏ భాష కష్టంగా అనిపించింది?
సుమిత్ర: నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడగలను. డబ్బింగ్‌ కూడా చెప్పగలను. కానీ, తుళు మాత్రం నేర్చుకోలేకపోయా. నా వల్ల కాలేదు. ఎవరు ఏది చెప్పినా, నాకు తెలుగులో ఉన్నంత సౌకర్యం మరో భాషలో ఉండదు. 

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?
సుమిత్ర: మా ఆయన పేరు డి.రాజేంద్రబాబు. మేము ‘రామదండు’ సినిమా షూటింగ్‌ సందర్భంగా కలిశాం. ఇది మొదట తమిళ, కన్నడ భాషల్లో కె.బాలచందర్‌గారు తీశారు. కన్నడ వెర్షన్‌ కోసం డైలాగ్‌లు చెప్పించడానికి బాలచందర్‌గారు ఈయనను పిలిపించారు. అప్పటికే నేను స్టార్‌ హీరోయిన్‌ను. నా ముందు సిగరెట్‌ కాలుస్తూ, కన్నడ డైలాగ్‌లు చెప్పేవారు. ‘వీడెవడు.. నా ముందు సిగరెట్‌ కాలుస్తున్నాడు’ అనుకునేదాన్ని. ఆ తర్వాత ఆయనే దర్శకుడు అయ్యారు. 62 సినిమాలు చేశారు. నాకు ఇద్దరు పాపలు. ఒక బాబు. చిన్నమ్మాయికి కూడా ఇటీవలే పెళ్లయింది. మా పెద్దమ్మాయి ఉమ నటి. ‘కల్యాణ రాముడు’, ‘స్వామి’ చిత్రాలతో పాటు ‘లక్ష్మి’లో వెంకటేశ్‌గారి చెల్లెలిగా చేసింది. 

అప్పట్లో మీతో ఇండస్ట్రీలో ఉన్న నటీమణులెవరు?
సుమిత్ర: సుజాతగారు, లక్ష్మీగారు నాకన్నా కొంచెం సీనియర్లు‌. సరిత, రాధిక, శ్రీప్రియ, శ్రీదేవి, జయప్రద వీళ్లంతా నేను హీరోయిన్‌గా వచ్చిన సమయానికి కాస్తా అటూఇటూగా వచ్చారు. 

ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ‘ఎందుకు ఒప్పుకొన్నానా’ అనిపించిందా? 
సుమిత్ర: ‘ప్రచండ భైరవి’ అనే సినిమా చేస్తున్నప్పుడు అలా అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉండేది. 

ఇండస్ట్రీలో అప్పటికీ, ఇప్పటికీ మీరు గమనించిన తేడా ఏంటి?
సుమిత్ర: చాలా మార్పులు జరిగాయి. టెక్నికల్‌గా ఎంతో అభివృద్ధి చెందింది. అందులో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. ఇంకొన్ని చెడ్డ విషయాలు ఉన్నాయి.

మీరు షూటింగ్‌కు తెచ్చుకున్న పండ్లను ఎవరో దొంగిలించేవారట!
సుమిత్ర: (నవ్వులు) చంద్రమోహన్‌గారు. ప్రొడ్యూసర్‌గారికి బత్తాయి తోటలు ఉండటంతో రోజూ షూటింగ్‌కు బస్తాల కొద్దీ బత్తాయిలు వచ్చేవి. చంద్రమోహన్‌గారు మాకు ఇచ్చినవి కూడా జ్యూస్‌ చేసుకుని తాగేసేవారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఓ సంఘటన జరిగింది. గోదావరి వద్ద షూటింగ్‌ చేస్తుంటే నా చేతిలో ఉన్న బ్యాగ్‌ నదిలో పడిపోయింది. ఖాళీదే కదా వదిలేయండి అన్నా. ఆయన వినిపించుకోకుండా నదిలో దూకేశారు. ఆయన కాళ్లకు బరువైన షూ ఉండటంతో పైకి రాలేకపోయారు. ‘కాపాడండీ’ అని చేతులు ఎత్తి చూపిస్తుంటే, నటనేమో అనుకున్నారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని అక్కడికి వచ్చిన వాళ్లు నదిలోకి దూకి కాపాడారు. దాంతో ఆయనకు రెండు రోజుల పాటు జ్వరం వచ్చేసింది. (నవ్వులు)

రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశం వస్తే, ‘నేనా ఈ నల్లబ్బాయితో యాక్ట్‌ చేయాలా’ అన్నారట!
సుమిత్ర: (నవ్వులు) ఎస్వీ ముత్తురామన్‌ దర్శకత్వంలో నేను ఒక సినిమా ఒప్పుకొన్నా. ఒకరోజు ఆయన రజనీకాంత్‌గారిని తీసుకొచ్చి ‘ఈ అబ్బాయేనమ్మా. నీతో నటించేది’ అన్నారు. అప్పుడు ఆయనను ఒకసారి పైనుంచి కిందకు అలా చూసి, ‘అవునా.. నమస్కారమండీ’ అన్నా. షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఒక్కసారి కూడా నా పక్కన వచ్చి కూర్చోలేదు. ఎందుకంటే అప్పటికే నేను స్టార్‌ హీరోయిన్‌. ‘రండి.. వచ్చి నా పక్కన కూర్చోండి’ అన్నా కూడా ‘వద్దులేండీ’ అని దూరంగా వెళ్లి నిలబడేవారు. అదే ఇప్పుడు హీరోలైతేనా, మనం కూర్చోమనేలోపే వచ్చి కూర్చొంటారు. అది రజనీకాంత్‌ గొప్పదనం.

మీతో యాక్ట్‌ చేసిన వాళ్లలో నాటీ హీరో అంటే ఎవరు?
సుమిత్ర: కమల్‌హాసన్‌ గారు. బాగా ఆట పట్టించేవారు. పాట షూట్‌ చేస్తుంటే, వెనకాల నుంచి జడ కత్తిరించేసేవారు. నేనేమో షాట్‌కు వెళ్లగానే, జడ ముందుకు వేసుకునే సరికి చాలా చిన్నగా ఉండేది. సెట్‌లో ఉన్న వారందరినీ బాగా ఏడిపించేవారు.

ఒకవేళ మీరు నటి కాకుంటే ఏం చేసేవాళ్లు?
సుమిత్ర: మా అత్తయ్యకు ఒక అబ్బాయి ఉన్నాడు. నాకు పదేళ్ల వయసు ఉండగానే అతనితో పెళ్లి ఫిక్స్‌ చేసేశారు. ఇక పదమూడు ఏళ్లు వచ్చేసరికి, మా అత్త ‘అబ్బాయికి అక్కడి నుంచి మంచి సంబంధం వచ్చింది. ఇక్కడ ఇంత కట్నం ఇస్తానన్నారు’ అంటూ మానాన్నగారి ముందు మాట్లాడటం మొదలు పెట్టింది. ఆయన కాస్త కోపం, కాస్త అవమానంలా అనిపించేసరికి ‘అమ్మా.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్‌. మా అమ్మాయి ఇంకాస్త పెద్దది అయ్యే వరకూ పెళ్లి చేయను’ అని కచ్చితంగా చెప్పేశారు. ఆ తర్వాత సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఒకవేళ నేను నటిని కాకపోయి ఉంటే, మా అత్త కొడుకుని పెళ్లి చేసుకుని, సాధారణ గృహిణిలా ఉండేదాన్నేమో.

మీ సినిమాల్లో బెస్ట్‌ మూవీ ఏంటి?
సుమిత్ర: నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అన్నీ నాకు నచ్చిన పాత్రలే చేశా. ముఖ్యంగా ఇటీవల నటించిన ‘అమ్మమ్మగారి ఇల్లు’ బాగా ఇష్టం. ఇది మంచి కుటుంబ కథా చిత్రం.

మీ పిల్లలు తెచ్చుకున్న స్వీట్లు మీరు తినేసేవారట!
సుమిత్ర: అది కూడా చెప్పేశారా?(నవ్వులు) వాళ్ల నాన్న స్వీట్లు తెస్తే, వాటిలో సగం నా బ్యాగ్‌లో వేసుకునేదాన్ని, అవుట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్తే తింటూ ఉండేదాన్ని. ఎవరికీ కనపడకుండా మేకప్‌ బ్యాగ్‌లో పెట్టుకునేదాన్ని.

ఎస్వీఆర్‌తో నటించడం ఎలా అనిపించింది?
సుమిత్ర: ఆయనతో కలిసి ‘చల్లని తల్లి’చేశా. నాకు దక్కిన అదృష్టం. ఆయన మాట్లాడుతుంటే తండ్రితో మాట్లాడుతున్నట్లే ఉండేది.

ఒక సినిమా షూటింగ్‌ సముద్రం ఒడ్డున చేస్తుంటే పెద్ద అల వచ్చి, యూనిట్‌ మొత్తాన్ని లోపలికి లాగేసిందట!
సుమిత్ర: ఆ సినిమాలో హీరో సూర్య తండ్రి శివకుమార్‌గారు నాతో కలిసి నటిస్తున్నారు. కన్యాకుమారిలో సముద్రం ఒడ్డున షూటింగ్‌. వాతావరణం బాగాలేదని గంటలో షూటింగ్‌ ఆపేయాలని అక్కడ ఉన్న మత్స్యకారులు కూడా చెప్పారు. అయినా, ఆపకుండా షూటింగ్‌ చేస్తుంటే పెద్ద అల వచ్చి, శివకుమార్‌గారు, కెమెరామెన్‌తో సహా చాలా మందిని లోపలికి లాగేసింది. అందరూ ఎలాగో బయటకు వచ్చారు. 

ఇక ‘గీతాంజలి’షూటింగ్‌ జరుగుతుండగా మరో సంఘటన జరిగింది. అప్పుడు నేను ఆరు నెలల గర్భిణిని. కదులుతున్న రైలు ఎక్కాలి. నాలుగు అడుగులు వేసిన తర్వాత నా కాలు జారిపోయింది. అక్కడే ఉన్న నాగార్జునగారు వెంటనే నన్ను రైల్లోకి తోసేశారు. లేకపోతే చక్రాల మధ్య పడిపోయేదాన్ని. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు.

మీ పిల్లలు మీ మాట వింటారా?
సుమిత్ర: అది నా అదృష్టం. నేను ఏం చెప్పినా చక్కగా వింటారు. నేను ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తే, నన్ను బాగా మేకప్‌ చేసి పంపేది వాళ్లే. 

ఇటీవల ఏం సినిమాలు చేశారు?
సుమిత్ర: నాగశౌర్య హీరోగా ‘అమ్మమ్మగారి ఇల్లు’ చేశా. షామిలీ హీరోయిన్‌. దీంతో పాటు, మరో రెండు తమిళ చిత్రాలు కూడా చేస్తున్నా. ఈ షోకు వచ్చిన సందర్భంగా మీ అందరికీ ఓ సూచన ఇద్దామని అనుకుంటున్నా. చిన్న పిల్లలకు దయచేసి సెల్‌ఫోన్లు అలవాటు చేయొద్దు. పిల్లాడు ఏడ్చాడు కదాని ఫోన్‌ ఇవ్వకండి. చిన్నతనంలోనే వాళ్ల కళ్లు, మెదడుపై అవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దయచేసి అందరూ పాటించండి.. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.