close

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై గుళ్ల వర్షం

శతఘ్నులతో విరుచుకుపడిన భారత సేన
10 మంది పాకిస్థాన్‌ సైనికులు
20 మంది ముష్కరుల హతం
నియంత్రణ రేఖ ఆవలి ఉగ్ర స్థావరాలు, సైనిక శిబిరాలపై భీకర కాల్పులు
కవ్వింపు లేకుండా జరుపుతున్న కాల్పులకు ప్రతీకారం
బుద్ధి తెచ్చుకోకుంటే ఇలాంటి దాడులు తప్పవు: బిపిన్‌ రావత్‌
9 మంది భారత సైనికులు చనిపోయారన్న పొరుగు దేశం
దిల్లీ

ఏం జరిగింది?

తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్‌ తాజాగా శనివారం అదే పని చేసింది. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపించేందుకు వీలుగా వారికి రక్షణగా తంగ్దార్‌ సెక్టార్‌లో కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత సైనికులు ఇద్దరు మరణించారు.

భారత్‌ ఎలా బుద్ధి చెప్పింది?

తంగ్దార్‌ సెక్టార్‌కు ఎదురుగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని నీలం లోయలో జురా, అథ్‌ముకమ్‌, కుందల్‌షాహి, లిపా లోయలో ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలున్నట్లు భారత్‌ గుర్తించింది. ఒక్కో స్థావరంలో 10-15 మంది ఉగ్రవాదులు పాగా వేసినట్లు పసిగట్టింది. ఈ స్థావరాలే లక్ష్యంగా శతఘ్నులతో విరుచుకుపడింది.

పాక్‌కు నష్టం ఎంత?

మూడు ముష్కర శిబిరాలు పూర్తిగా ధ్వంసం. నాలుగో శిబిరానికీ భారీగా నష్టం.

జమ్మూ-కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ సాగిస్తున్న దురాగతాలకు భారత్‌ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. ఎలాంటి కవ్వింపు లేకుండా ఆ దేశ సైన్యం జరుపుతున్న కాల్పులకు దిమ్మ తిరిగిపోయేలా ఆదివారం బదులిచ్చింది. పాక్‌ సైనిక శిబిరాలు, నాలుగు ఉగ్రవాద స్థావరాలను భారీ శతఘ్నులతో నుగ్గునుగ్గు చేసింది. ఈ దాడిలో 6-10 మంది పాక్‌ సైనికులు, మరో పది మంది ఉగ్రవాదులు హతమైనట్లు తాజాగా అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. అయితే దాడిలో 20 మంది వరకూ ఉగ్రవాదులు హతమై ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. ఉగ్రవాద మౌలిక వసతులకు భారీగా నష్టం కలిగించామని రావత్‌ తెలిపారు. మూడు ముష్కర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. నాలుగో స్థావరానికి గణనీయ నష్టం కలిగించామన్నారు. విద్రోహ చర్యలకు స్వస్తి పలకకుంటే ప్రతీకార దాడులకు భారత్‌ ఏ మాత్రం వెనుకాడబోదని హెచ్చరించారు. జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరించినప్పటి నుంచి ఉగ్రవాద చొరబాటు యత్నాలపై తమకు పదేపదే సమాచారం అందుతోందన్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆదివారం పాక్‌ సాగించిన కాల్పుల్లో భారత పౌరుడొకరు గాయపడ్డారు. ఆ దేశ దుశ్చర్యను ఖండిస్తూ గ్రామస్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఉగ్రవాదులను పంపడానికి పాక్‌ దాడి
నియంత్రణ రేఖ వెంబడి తంగ్దార్‌ సెక్టార్‌లో శనివారం పాక్‌ జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇళ్లు, పశువుల పాకలు సహా పలు ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఉగ్రవాద చొరబాట్లకు సాయం చేయడం కోసం పాక్‌ ఈ దురాగతానికి పాల్పడినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే ప్రతిచర్యకు నడుం బిగించింది. ఉగ్ర స్థావరాలకు రక్షణగా ఉండటమే కాకుండా, భారత్‌లోకి ముష్కరులు చొరబడేందుకు సాయం అందిస్తున్న పాక్‌ సైనిక శిబిరాలను గుర్తించింది.
తంగ్దార్‌ సెక్టార్‌కు ఎదురుగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని నీలం లోయలో జురా, అథ్‌ముకమ్‌, కుందల్‌షాహి, లిపా లోయలోని లష్కరే తొయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి ముష్కర ముఠాలకు చెందిన నాలుగు స్థావరాలపై భారత సైన్యం కన్నేసింది. ఒక్కో స్థావరంలో 10-15 మంది ఉగ్రవాదులు పాగా వేసినట్లు పసిగట్టింది. ఈ ముష్కర స్థావరాలు, వాటికి అండగా ఉంటున్న పాక్‌ సైనిక శిబిరాలే లక్ష్యంగా ఆదివారం శతఘ్నులతో పిడుగుల వాన కురిపించింది.

బాలాకోట్‌ తర్వాత..
ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో బాలాకోట్‌ వైమానిక దాడి తర్వాత భారత్‌ సాగించిన ప్రధాన ఎదురుదాడి ఇదే. ఈ దాడులు 2016 సెప్టెంబర్‌లో నియంత్రణ రేఖ అవతల ఉగ్రవాద శిబిరాలపై జరిగిన మెరుపు దాడుల్లాంటివి కావని అధికారులు పేర్కొన్నారు. ఈ దఫా నియంత్రణ రేఖ దాటకుండా శతఘ్నులతో పొరుగు దేశపు లక్ష్యాలపై విరుచుకుపడినట్లు వివరించారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ అంశంపై బిపిన్‌ రావత్‌తో మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పాక్‌ బుకాయింపులు
ఈ ఘటనపై పాక్‌ సైన్యం యథావిధిగా బుకాయింపులు, కట్టుకథలకు దిగింది. భారత కాల్పుల్లో తమ సైనికుడొకరు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్‌ సైనిక అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ పేర్కొన్నారు. తమ కాల్పుల్లో భారత్‌కు చెందిన 9 మంది సైనికులు చనిపోయారని, అనేక మంది గాయపడ్డారని చెప్పుకొచ్చారు. రెండు సైనిక శిబిరాలనూ ధ్వంసం చేశామన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడుస్తోందని, ఉద్దేశపూర్వకంగా తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. పాక్‌ సైనిక శిబిరాలపై దాడి చేశామన్న తప్పుడు ప్రకటనలను సమర్థించుకునేందుకు ఇలా చేస్తోందన్నారు. ‘‘తమ సైనికుల మృత దేహాలను తీసుకెళ్లడానికి కూడా భారత్‌ అవస్థ పడుతోంది. ఆ దేశ సైన్యం తెల్లజెండాను చూపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ముందు వారు దీనిపై ఆలోచించాల్సింది’’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

భారత మీడియాపైనా గఫూర్‌ విమర్శలు చేశారు. భారత శిబిరాలకు తాము కలిగించిన నష్టం గురించి వార్తలు రాయడంలేదన్నారు. ‘‘పాక్‌ మీడియా తరహాలో పాత్రికేయ సూత్రాలను పాటించండి. బాధ్యతాయుతంగా వార్తలు రాయండి’’ అని పేర్కొన్నారు. మరోపక్క పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కూడా భారత వాదను ఖండించింది. భారత్‌ ‘అబద్ధాల’ను రుజువు చేసేందుకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల దౌత్యాధికారులను సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమని పేర్కొంది. మరోవైపు ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లూవాలియాను పాక్‌ పిలిపించి, సరిహద్దు కాల్పుల ఘటనను ఖండించింది. జురా, షాకోట్‌, నౌషేరి సెక్టార్లలో భారత కాల్పుల వల్ల తమ పౌరులు మరణించారని ఆరోపించింది. అయితే పాక్‌ వాదనను భారత్‌ కొట్టిపడేసింది.

2050 సార్లు పాక్‌ ఉల్లంఘనలు
దిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట పాకిస్థాన్‌ ఈ ఏడాదిలోనే (సెప్టెంబర్‌ నాటికి) దాదాపు 2050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కారణంగా 21మంది మృతి చెందగా అనేక మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.