close

తాజా వార్తలు

మయాంకంలో మరో డబుల్‌

అగర్వాల్‌ ద్విశతకం
ఇండోర్‌లో పరుగుల వరద
పట్టుబిగించిన భారత్‌; 493/6
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు
ఇండోర్‌

అప్పటికి స్కోరు 196
అతడిలో అదురు లేదు.. బెదురు లేదు. ఆందోళనా లేదు. ఆడుతున్నది ఎనిమిదో టెస్టే అయినా ద్విశతకం కోసం జాగ్రత్తా లేదు. ఉన్నదల్లా ఆకాశాన్నంటుతున్న ఆత్మవిశ్వాసమే. ఉరకలేస్తున్న ఉత్సాహం.. బంతిని కసిదీరా బాదాలన్న కసే. ఇంకేముంది సింహంలా ముందుకు కదులుతూ.. వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తూ బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేశాడు. సగర్వంగా చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు.
ఇండోర్‌లో మయాంక్‌ జోరుకు, విధ్వంసక బ్యాటింగ్‌కు ఆ షాట్‌ ఓ మచ్చుతునక మాత్రమే. బంగ్లా బౌలర్లను నిస్తేజితుల్ని చేస్తూ.. భారత అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేస్తూ మైదానం నలువైపులా అలాంటివే ఇంకెన్నో కళ్లు చెదిరే షాట్లు ఆడాడు అతడు. మయాంక్‌ జోరుతో భారత్‌ తొలి టెస్టుపై పట్టుబిగించేసింది. చివరికి ఉమేశ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌కూ విలవిల్లాడిన బంగ్లాకు మిగిలిందిక ఎదురీతే. భారత్‌ ఓవర్‌నైట్‌ స్కోరు వద్దే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తే మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (243; 330 బంతుల్లో 28×4, 8×6) కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ సాధించిన వేళ.. బంగ్లాతో తొలి టెస్టులో భారత్‌ శాసించే స్థితిలో నిలిచింది. మయాంక్‌తో పాటు రహానె (86; 172 బంతుల్లో 9×4), జడేజా (60 బ్యాటింగ్‌; 76 బంతుల్లో 6×4, 2×6), పుజారా (54; 72 బంతుల్లో 9×4) రాణించడంతో రెండో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ (ఓవర్‌నైట్‌ 86/1) తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 493 పరుగులు సాధించింది. ఇప్పటికే 343 పరుగుల ఆధిక్యంతో ఉన్న భారత్‌కు మరో ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం రాకపోవచ్చు. జడేజాతో పాటు ఉమేశ్‌ యాదవ్‌ (25; 10 బంతుల్లో 1×4, 3×6) క్రీజులో ఉన్నాడు.

దంచి కొట్టాడు..: రహానె కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పుజారా కూడా ఉపయుక్తమైన పరుగులు చేశాడు. జడేజా దూకుడైన ఆటతో అలరించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఉమేశూ మురిపించాడు. కానీ రెండో రోజు మాత్రం పూర్తిగా మయాంక్‌ అగర్వాల్‌దే. రోహిత్‌, కోహ్లి విఫలమైనా భారత్‌ భారీ స్కోరు చేసిందంటే కారణం అతడి అద్వితీయమైన బ్యాటింగే. పుజారా, రహానెలతో అతడు నెలకొల్పిన కీలక భాగస్వామ్యాలే. అలవోకగా బ్యాట్‌ ఝుళిపిస్తూ పరుగుల వరద పారించిన మయాంక్‌.. పుజారాతో రెండో వికెట్‌కు 91 పరుగులు, రహానెతో నాలుగో వికెట్‌కు 190 పరుగులు జోడించాడు. ఆపై జడేజాతో కేవలం 23.5 ఓవర్లలోనే మెరుపు వేగంతో 123 పరుగులు జోడించి బంగ్లా పుండుపై కారం చల్లాడు. పూర్తి సాధికారికంగా ఆడిన మయాంక్‌ బంగ్లా బౌలర్లపై యథేచ్ఛగా విరుచుకుపడ్డాడు. మైదానం అన్నివైపులా బౌండరీలు బాదేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. చక్కని ఫుట్‌వర్క్‌ను ప్రదర్శించిన మయాంక్‌ (ఓవర్‌నైట్‌ 37) మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ జోరు పెంచాడు. కళ్లు చెదిరే డ్రైవ్‌లు, పుల్‌ షాట్లతో అలరించాడు. ముఖ్యంగా స్పిన్నర్లకు చుక్కలు చూపించాడు. అతడు లేట్‌ కట్స్‌ ఆడిన తీరు, ముందుకొచ్చి అమాంతం బౌలర్‌ తల మీదుగా సిక్సర్లు బాదిన విధానం అమోఘం. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి క్యాచ్‌ను వదిలేసినందుకు బంగ్లా ఇంకా చింతిస్తూ ఉంటుంది. స్పిన్నర్లు మెహదీ హసన్‌  (1/125), తైజుల్‌ ఇస్లామ్‌ (0/120) 33 బౌండరీలు ఇవ్వగా.. అందులో మయాంక్‌ బాదినవే 19 ఉన్నాయంటే అతడు ఎలా చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. మయాంక్‌ కొట్టిన ఎనిమిది సిక్సర్లూ ఇచ్చింది వీళ్లిద్దరే. 183 బంతుల్లో టెస్టుల్లో మూడోసారి మూడంకెల స్కోరును అందుకున్న అతడు.. తైజుల్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌లో ఫోర్‌తో 150 (234 బంతుల్లో) పూర్తి చేశాడు. అదే జోరు కొనసాగిస్తూ 190ల్లో అడుగుపెట్టాడు. 196 వద్ద మెహదీ హసన్‌ బౌలింగ్‌లో వైడ్‌ లాంగాన్‌లో భారీ సిక్సర్‌ బాది ద్విశతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా విధ్వంసాన్ని కొనసాగించిన మయాంక్‌.. చివరికి మెహదీ హసన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటై ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య పెవిలియన్‌ చేరాడు. మయాంక్‌ డబుల్‌ సెంచరీకి చేరుకునే క్రమంలో అతడికి పుజారా, రహానె చక్కని సహకారాన్నిచ్చారు. కాస్త ధాటిగానే ఆడిన పుజారా లంచ్‌కు ముందు అబు జాయేద్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. క్రీజులో పాతుకుపోయి సెంచరీ చేసేలా కనిపించిన రహానె.. టీ తర్వాత ఔటయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి మాత్రం నిరాశపరిచాడు. పుజారా నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన అతడు ఖాతా అయినా తెరవకుండానే అబు జయేద్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. బంగ్లా సమీక్షలో అతడి వికెట్‌ను చేజిక్కించుకుంది. కోహ్లి నిష్క్రమణతో 119/3తో నిలిచిన భారత్‌ను ఒత్తిడికి గురిచేయడానికి బంగ్లాకు అవకాశం దక్కింది. కానీ మయాంక్‌ ఆ జట్టుకు అడ్డుపడ్డాడు.

జడేజా, ఉమేశూ..: మయాంక్‌ విధ్వంసంతో ఆఖరి సెషనల్లో భారత్‌కు ఏకంగా 190 పరుగులు వచ్చాయి. ఇటీవల కాలంలో బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా మరోసారి సత్తా చాటాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అలవోకగా అర్ధశతకం పూర్తి చేశాడు. ఉమేశ్‌ యాదవ్‌ కూడా బంగ్లా బౌలర్లను వదల్లేదు. కేవలం 10 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఎబాదత్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో అతడు వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడం విశేషం. జడేజా, ఉమేశ్‌ జోడీ అభేద్యమైన ఏడో వికెట్‌కు 39 పరుగులు జోడించింది.

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 150
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) అబు జయేద్‌ (బి) మెహదీ హసన్‌ 243; రోహిత్‌ (సి) లిటన్‌ (బి) అబు జయేద్‌ 6; పుజారా (సి) సైఫ్‌ హసన్‌ (బి) అబు జయేద్‌ 54; కోహ్లి ఎల్బీ (బి) అబు జయేద్‌ 0; రహానె (సి) తైజుల్‌ (బి) అబు జయేద్‌ 86; జడేజా బ్యాటింగ్‌ 60; సాహా (బి) ఎబాదత్‌ హుస్సేన్‌ 12; ఉమేశ్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ 25; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (114 ఓవర్లలో 6 వికెట్లకు) 493; వికెట్ల పతనం: 1-14, 105, 3-119, 4-309, 5-432, 6-454
బౌలింగ్‌: ఎబాదత్‌ హుస్సేన్‌ 31-5-115-1; అబు జయేద్‌ 25-3-108-4; తైజుల్‌ ఇస్లామ్‌ 28-4-120-0; మెహదీ హసన్‌ మిరాజ్‌ 27-0-125-1; మహ్మదుల్లా 3-0-24-0

కోహ్లి చెప్పాడు.. మయాంక్‌ కొట్టాడు

మయాంక్‌ 150 పరుగుల మైలురాయిని అందుకోగానే డ్రెస్సింగ్‌రూమ్‌లో కెప్టెన్‌ కోహ్లి సహా ఆటగాళ్లంతా లేచి చప్పట్లు చరుస్తూ అతణ్ని అభినందించారు. కోహ్లి తన చర్యతో అతడికి మరింత ప్రోత్సాహాన్నిచ్చాడు. రెండు వేళ్లూ చూపిస్తూ డబుల్‌ సెంచరీ చేయాలని సూచించాడు. అందుకు మయాంక్‌ స్పందించాడు. బొటన వేలిని చూపిస్తూ సరే అన్నాడు. ఆ తర్వాత డబుల్‌ సెంచరీ పూర్తయ్యాక మయాంక్‌ కోహ్లి వైపు చూస్తూ ‘డబుల్‌ సాధించా. చూశావా’ అన్నట్లు చెయ్యెత్తి రెండు వేళ్లు చూపించాడు. దానికి కోహ్లి ‘ఇక ట్రిఫుల్‌ సాధించు’ అన్నట్లుగా మూడు వేళ్లు చూపించాడు. 

ఈ దాహం తీరనిది.. 

సరిగ్గా ఏడాది కింద అతడు జట్టులోనే లేడు.. కానీ ఇంతలోనే అతడు జట్టులో అంతర్భాగమయ్యాడు. మయాంక్‌ పరుగుల దాహం అలాంటిది మరి.
దేశవాళీలో ఎన్నో మారథాన్‌ ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించిన మయాంక్‌.. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ అదే జోరునూ అంతర్జాతీయ క్రికెట్లోనూ కొనసాగిస్తున్నాడు. భారత జట్టు ఓపెనింగ్‌ కష్టాలను తీరుస్తూ.. 12 ఇన్నింగ్స్‌లో (ఇది ఎనిమిదో టెస్టు) 71.50 సగటుతో 858 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల జట్టులో స్థానం దిశగా ఉరకలేస్తున్నాడు. సెహ్వాగ్‌ తర్వాత ఆ స్థాయి టెస్టు ఓపెనర్‌ మయాంకే అని అభిమానులు అనడం అతిశయోక్తేమీ కాదు. అతడి దూకుడు అలాంటిది. కాకపోతే ఆరంభంలో ప్రశాంతంగా ఆడతాడు. తొందరపడడు. ఒక్కసారి కుదురుకున్నాడంటే.. యథేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపిస్తాడు. చక్కని టెక్నిక్‌ అతడి సొంతం. మంచి ఫుట్‌వర్క్‌తో మైదానంలో ఎటువైపైనా అలవోకగా షాట్లు ఆడగలిగే అతడికి పేసరైనా, స్పిన్నరైనా ఒక్కటే. నెల రోజుల వ్యవధిలో రెండో డబుల్‌ సెంచరీ సాధించాడంటేనే అతడెంత అలవోకగా భారీ ఇన్నింగ్స్‌ ఆడగలడో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్‌ ఇన్నింగ్స్‌కు రాటుదేలుతున్న మయాంక్‌ చాలా కాలం ఉండడానికే వచ్చానని చాటుకుంటున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు మరింతకాలం నిరీక్షంచక తప్పదేమో. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై కోహ్లి, రోహిత్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు విఫలమైనా భారత్‌ భారీ స్కోరు చేసిందంటే ప్రధాన కారణం మయాంకే. ముఖ్యంగా స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు అద్భుతం. పదే పదే ముందుకొచ్చి ఆడిన అతడు వారికి చుక్కలు ఊపించాడు. అతడు కొట్టిన ఎనిమిది సిక్స్‌లు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే రావడం విశేషం. ఇటీవల కాలంలో పర్యటక జట్ల స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డ టీమ్‌ఇండియా తిరిగి వారిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొవడంలో మయాంక్‌  పాత్ర ముఖ్యమైందే. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ అతడు స్పిన్నర్ల భరతం పట్టాడు. ఇంతకు మయాంక్‌ ఇంతలా చెలరేగిపోవడానికి కారణమేంటి? బంగ్లాతో రెండో రోజు ఆట అనంతరం అతణ్ని అడిగితే.. ‘‘విఫలమవుతానన్న భయాన్ని పోగొట్టుకోవడం నాకెంతో ఉపకరిస్తోంది. ఆ భయాన్ని పక్కన పెట్టాక నా పరుగుల దాహం పెరిగింది’’ అని బదులిచ్చాడు. సిక్స్‌ల గురించి మాట్లాడుతూ.. ‘‘బంతిని బాగా పరిశీలించి అందుకున్నా. పిచ్‌పై బౌన్స్‌ ఉంది. నా పరిధిలో పడ్డ బంతులను లాగి కొట్టా’’ అని చెప్పాడు. 

ఆట సాగిందిలా.. 

భారత్‌ బ్యాటింగ్‌ 
తొలి సెషన్‌
ఓవర్లు 28
పరుగులు 102
వికెట్లు 2

రెండో సెషన్‌
ఓవర్లు 30
పరుగులు 115
వికెట్లు 0

మూడో సెషన్‌
ఓవర్లు 30
పరుగులు 190
వికెట్లు 3

407

రెండో రోజు భారత్‌ చేసిన పరుగులు. ఇప్పటివరకు భారత జట్టు ఒక్క రోజే అత్యధికంగా చేసిన స్కోరు 443. 2009లో బ్రబోర్న్‌ టెస్టులో శ్రీలంకపై ఈ ప్రదర్శన చేసింది.

4

గత నాలుగు టెస్టుల్లో కనీసం ఒక భారత బ్యాట్స్‌మన్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇలా వరుసగా నాలుగు టెస్టుల్లో డబుల్‌ సెంచరీలు కొట్టడం ఇదే తొలిసారి. 

12 

టెస్టుల్లో రెండో డబుల్‌ సెంచరీ చేసేందుకు మయాంక్‌ ఆడిన ఇన్నింగ్స్‌. అత్యంత వేగవంతంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌ అతడు. వినోద్‌ కాంబ్లి (5) ముందున్నాడు. బ్రాడ్‌మన్‌ (13) మూడో స్థానంలో ఉన్నాడు.

8

మయాంక్‌ అగర్వాల్‌ కొట్టిన సిక్స్‌లు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా అతడు సిద్దూ రికార్డు (1994లో లంకపై ఎనిమిది సిక్స్‌లు)ను సమం చేశాడు.

5

భారత ఓపెనర్‌ సాధించిన అత్యధిక స్కోర్లలో మయాంక్‌ (243) స్థానం. తొలి 4 స్కోర్లు సెహ్వాగ్‌వే (319, 309, 293, 254)
- ఈనాడు క్రీడావిభాగం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.