close

తాజా వార్తలు

మాకొద్దీ ఉద్యోగం!

 తొలి జీతం తీసుకోకుండానే రాజీనామా

● 38 మంది వార్డు సచివాలయ ఉద్యోగుల ఇంటిబాట

● తిరుపతి నగరపాలికలో కలకలం

పీజీలు, పీహెచ్‌డీలు వంటి ఉన్నత చదువులు పక్కన పెట్టి, సొంతూరుకు దగ్గర్లో విధులు నిర్వహించే భాగ్యం.. రెండేళ్లు కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం అవుతుందనే భరోసాతో నిరుద్యోగులెందరో ఇటీవల వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్ష రాశారు. ఎంపికైన వారంతా విధుల్లో చేరారు. రాష్ట్రంలో అన్నిచోట్లా ఉద్యోగులు కేటాయించిన విధులకు హాజరవుతూ.. పని చేస్తున్నా.. తిరుపతిలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. విధుల్లో చేరిన 38 మంది నగరపాలక సంస్థకు చెందిన వార్డు సచివాలయ ఉద్యోగులు.. అధికారుల తీరుతో ఉద్యోగాలు వద్దంటూ రాజీనామాలు సమర్పించి తప్పుకొన్నారు. తొలి జీతమైనా అందుకోకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం కార్పొరేషన్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

న్యూస్‌టుడే, తిరుపతి(నగరపాలిక): తిరుపతి నగరపాలిక పరిధిలోని 50 వార్డులలో 102 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిలో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వం 1006 మంది వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కేటాయించింది. వేల మంది పరీక్ష రాయగా.. అర్హులైన 736 మందిని ఆరు దశల కౌన్సెలింగ్‌ ద్వారా తిరుపతికి కేటాయించారు. అక్టోబర్‌ 2న ఉద్యోగంలో చేరిన సచివాలయ ఉద్యోగులకు ఇంకా తొలి జీతం కూడా అందలేదు. భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఏం జరిగిందో కానీ తిరుపతి నగరపాలికలో వార్డు సచివాలయ ఉద్యోగుల రాజీనామాల ఘట్టం మూడు వారాల క్రితం ప్రారంభమైంది. తమకు ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందని, చదువుకోవాలనే కారణాలు చూపుతున్నా.. వారు బృందంగా ఏర్పాటు చేసుకున్న వాట్సాప్‌ గ్రూపుల్లో అసలు విషయాలు దాగి ఉన్నట్లు తెలిసింది.

వాస్తవాలు వెల్లడిస్తున్న సందేశాలు

ప్రభుత్వ ఉద్యోగం కంటే ఉన్నత ఉద్యోగాలు ఇటీవల నియామకాలు జరగలేదని అనుమానం వచ్చిన కొందరు రాజీనామా చేసిన ఉద్యోగులను సంప్రదిస్తే పని ఒత్తిడి అధికంగా ఉండటంతోపాటు, కార్పొరేషన్‌ కార్యాలయంలోని కొందరు అధికారుల తీరు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. పని ఒత్తిడి భరించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన శిక్షణ, అధికారుల సహకారం లేక, సమావేశాలలో అధికారుల తీరును ఉన్నత విద్యాభ్యాసం చేసి, ఇప్పటికే ఉన్నత స్థాయి ఉద్యోగం చేసిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. వార్డు అధికారులకు, సచివాలయ ఉద్యోగులకు సంయుక్తంగా జరిగే సమావేశాల్లో కొందరు అధికారుల మాటతీరు, మందలింపులు, అతి పెత్తనంపై వారు మండిపడుతున్నారు. ఉద్యోగంలో చేరిన తమకు కనీస గౌరవం లేకుండా, పది మందిలో అవమానకరంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డుల కేటాయింపు పూర్తయిన నెల రోజుల తరువాత వారిలో 10 మందిని నిబంధనలకు విరుద్ధంగా ఇతర వార్డులకు బదిలీ చేయడంపై కొందరు గుర్రుగా ఉన్నారు.

కమిషనర్‌తో ఇబ్బంది లేదు

నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషపై నగరపాలిక ఉద్యోగులు కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ గోడు చెప్పుకొంటున్న ఎవరిని ప్రశ్నించినా ‘కమిషనర్‌ దేవుడు’ అనే సమాధానం వస్తోంది. ఉద్యోగుల సమస్యలు నాకు తెలుసని, మీకు కుటుంబాలు ఉన్నాయని, వారి కోసం కాస్త సమయం కేటాయించాలని ఆయన పదేపదే సూచిస్తుంటారని ఉద్యోగులు చెబుతున్నారు. కమిషనర్‌ నిర్వహించే సమావేశాలు అర్థవంతంగా ఉంటాయని, ఆయన సమావేశ మందిరం వదిలిన తరువాతే కొందరు అధికారుల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వివరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఉద్యోగులంతా కార్యాలయం ప్రధాన ద్వారం ముందు నిరసన తెలపడం కలకలం రేపగా.. ఉద్యోగుల రాజీనామా అంశం మరింత చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా నగరపాలికలో సచివాలయ ఉద్యోగుల వరుస రాజీనాయాలు సంచలనం రేకెత్తించాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.