close

తాజా వార్తలు

అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

కేంద్ర శాసన, న్యాయవ్యవస్థలన్నీ కూతవేటు దూరంలోనే
కార్యాలయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చేలా కొత్త నిర్మాణాలకు ప్రణాళిక
రూ.12 వేల కోట్లతో ‘సెంట్రల్‌ విస్టా’ ఆధునికీకరణ

 

దేశ రాజధానిలో అత్యున్నత శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలన్నీ ఒకదానికొకటి కూతవేటు దూరంలోనే ఉన్నా.. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వాటి విభాగాలు చెట్టుకి ఉన్న పూలలా కొంచెం దూర దూరంగా ఉన్నాయి.ఆ దూరం కూడా లేకుండా దండలోని పూలలా కార్యాలయాన్నింటినీ ఒక చోటకు తెస్తున్నారు.

ప్రస్తుత ‘సెంట్రల్‌ విస్టా’ (రాష్ట్రపతి భవన్‌- ఇండియా గేట్‌ మధ్య ప్రాంతం) ఆధునికీకరణకు బృహత్‌ ప్రణాళిక రూపొందించారు. రేపటి అవసరాలకు అనుగుణంగా నూతన పార్లమెంటు, సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

 

పార్లమెంటు, కేంద్ర శాఖల కార్యాలయాలు, నిరసన కార్యక్రమాల కేంద్రం జంతర్‌మంతర్‌,  సుప్రీంకోర్టు.. ఇవన్నీ కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇక్కడి నుంచి దిల్లీ రైల్వేస్టేషన్‌ 4 కిలోమీటర్లు, విమానాశ్రయం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఫలితంగా  ప్రభుత్వంతో పనిపై దిల్లీ వచ్చిన వారు 5 కిలోమీటర్ల పరిధిలో పనులు చూసుకుని వెళ్లడానికి వీలవుతోంది.

గాంధీనగర్‌కు ఆదర్శం దేశ రాజధాని

దేశ రాజధానిని స్ఫూర్తిగా తీసుకొనే గాంధీనగర్‌లో సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మించారు. అక్కడ అసెంబ్లీకి అటూఇటూ రెండువైపులా పది అంతస్తుల భవనాల్లో అన్ని మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశారు.


ఇప్పుడు ఇలా..

దేశ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చాలని 1911లో బ్రిటిషర్లు నిర్ణయించారు. న్యూదిల్లీ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేసి పాలన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి ప్రభుత్వాధినేత వైస్రాయ్‌ నివాసం (నేటి రాష్ట్రపతి  భవన్‌) కేంద్రంగా చేసుకొని సర్‌ ఎడ్విన్‌ ల్యుటియెన్స్‌.. పార్లమెంటు, పాలనా వ్యవస్థల ప్రాంగణాలకు రూపకల్పన చేశారు. అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని ల్యుటియెన్స్‌ బంగ్లా జోన్‌గా పిలుస్తారు. ఇది దేశ పరిపాలనకు కేంద్ర స్థానం. పౌరవిమానయాన, ఐటీ, ఎలక్ట్రానిక్‌, అటవీ, పర్యావరణ శాఖల కార్యాలయాలు మినహాయించి కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రిత్వశాఖల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 51 శాఖల విభాగాలకుగాను 21 శాఖల విభాగాలు సెంట్రల్‌ విస్టా పరిధిలో ఉన్నాయి. మిగిలిన వాటిని కూడా సెంట్రల్‌ విస్టాలోకి తెచ్చేందుకు ఆధునికీకరణ చేపట్టారు.

కార్యాలయాలు
రాష్ట్రపతి భవన్‌ గేటు బయట కుడి, ఎడమల్లో దేశ కార్యనిర్వాహక వ్యవస్థలకు ప్రాణాధారమైన ప్రధానమంత్రి, రక్షణ శాఖ కార్యాలయాలు (సెక్రటేరియట్‌ బిల్డింగ్‌లో భాగమైన సౌత్‌ బ్లాక్‌లో); ఆర్థిక, హోంశాఖ కార్యాలయాలు (నార్త్‌ బ్లాక్‌లో) ఉన్నాయి.

పార్లమెంటు భవనం
ఈ కార్యాలయాల తర్వాత పార్లమెంటు భవనం ఠీవిగా కనిపిస్తుంది. 1921లో నిర్మాణం ప్రారంభమై 1927 జనవరి 18న ప్రారంభమైన ఈ భవనం 93 ఏళ్లుగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మందిరంగా భాసిల్లుతోంది. రాష్ట్రపతి భవన్‌ నుంచి కాలినడకన రావచ్చు.

మంత్రిత్వ శాఖలు
* పార్లమెంటుకు పక్కనే ఉన్న రైలు భవన్‌లో రైల్వేమంత్రిత్వ శాఖ, ఆ పక్కనే కృషీ భవన్‌లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.
* వాణిజ్యం, ఉక్కు, జౌళి మంత్రిత్వశాఖలన్నీ ఉద్యోగ్‌ భవన్‌లో కొలువుదీరి ఉన్నాయి.
* వైద్య ఆరోగ్యం, పట్టణాభివృద్ధి శాఖలు నిర్మాణ్‌ భవన్‌లో దర్శనమిస్తాయి. పలు శాఖలు శాస్త్రి భవన్‌లో కొలువుదీరాయి.
* జాతీయ మీడియా కోసం నేషనల్‌ మీడియా సెంటర్‌ పేరుతో భారీ సముదాయాన్ని ఇక్కడే నిర్మించారు.
* ఇవికాక మిగిలిన అత్యధిక కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌ (సీజీఓ)లో ఉన్నాయి. అది పార్లమెంటుకు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉంది.


సుప్రీంకోర్టు

దేశ న్యాయవ్యవస్థకు మణిమకుటం అయిన సుప్రీంకోర్టు ఇక్కడికి కేవలం 3.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1937 నుంచి 1950 వరకు పార్లమెంటు భవనంలోని ప్రిన్సెస్‌ ఛాంబర్‌లోనే కోర్టుని నిర్వహించేవారు. పార్లమెంటుకు సమీపంలోని ప్రస్తుతం సుప్రీం కోర్టు భవనానికి 1954 అక్టోబరు 29న తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్‌ శంకుస్థాపన చేశారు. 1958 నుంచి సర్వోన్నత న్యాయస్థానం సమున్నత ప్రస్థానాన్ని ఈ భవనంలో ప్రారంభించింది. 


దిల్లీ హైకోర్టు.. దిగువ కోర్టు.. హరిత ట్రైబ్యునల్‌

సుప్రీంకోర్టుకు కిలోమీటరు దూరంలోనే హైకోర్టు, జిల్లా కోర్టు ఏర్పాటు చేశారు. దీంతో.. దిల్లీలోని న్యాయవాదులు ఒకే రోజు మూడు కోర్టుల్లోనూ సేవలందించగలుగుతున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కూడా సుప్రీంకోర్టుకు అతి సమీపంలో ఉంది. పార్లమెంటు, కోర్టులు సమీపంలో ఉండటంతో ఎంపీలుగా ఉన్న చాలామంది సీనియర్‌ అడ్వొకేట్లు ఉదయం కోర్టులకెళ్లి వాదనలు వినిపించి పార్లమెంటుకొచ్చి సమావేశాల్లో పాలుపంచుకుంటున్నారు. కార్యదర్శి స్థాయి అధికారులు పార్లమెంటులో తమ మంత్రిత్వశాఖలకు సంబంధించిన ప్రశ్నలు, చర్చలు ఉన్నప్పుడు ఆ సమయానికి వచ్చి వెంటనే తిరిగి వెళ్లగలుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో ఉంది. జాతీయస్థాయి అధికారిక సమావేశాలు జరిగే విజ్ఞాన్‌ భవన్‌; ఎగ్జిబిషన్‌లు, ఆటోఎక్స్‌పోలు జరిగే ప్రగతి మైదాన్‌ పాలనా యంత్రాంగానికి సమీపంలో ఏర్పాటయ్యాయి. 


ల్యుటియెన్స్‌ బంగ్లా జోన్‌లో ఉన్న కార్యాలయాలు, నివాసాలు
(విస్తీర్ణం: 26 చదరపు కిలోమీటర్లు)

* రాష్ట్రపతి భవన్‌
* పార్లమెంటు
* ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలు, నివాసాలు
* సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు, కిందిస్థాయి కోర్టులు
* కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు
* ఎంపీలు, మంత్రులు, న్యాయమూర్తులు, త్రివిధ దళాధిపతుల కార్యాలయాలు, నివాసాలు
* క్రీడా మైదానాలు, సభాప్రాంగణాలు, అయిదు నక్షత్రాల హోటళ్లు


ఇకపై ఇలా..

రిపాలన సక్రమంగా సాగాలంటే మౌలికవసతులు సరిగా ఉండాలి. వ్యవస్థల మధ్య అనుసంధానం మెరుగ్గా ఉండాలి. ఈ నేపథ్యంలో కార్యాలయాలు దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ గుదిగుచ్చి దండలా మార్చేందుకు నూతన కేంద్ర సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి నాటి బ్రిటిష్‌ ఆర్కిటెక్చర్‌ ల్యుటియెన్స్‌ ఇదే విధానంలో ప్రణాళిక రూపొందించినా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు నాటి ప్లాన్‌ను విస్తృతపరిచి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అమల్లోకి తెస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వశాఖలనూ, విభాగాలనూ నూతన కేంద్ర సచివాలయంలో ఒకేచోటికి తేనున్నారు. 70 వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా రాష్ట్రపతి భవన్‌కు కుడి ఎడమల ఒక్కోటి 8 అంతస్తులతో పది భారీ భవంతులు నిర్మించనున్నారు.

* ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి నివాసాలను కూడా రాష్ట్రపతి భవన్‌కు కుడి ఎడమల నిర్మించి మొత్తం వ్యవస్థలన్నింటినీ పాలన కేంద్రీకృత హారంలోకి తీసుకొస్తున్నారు.
* ప్రస్తుతం వివిధ చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్న కార్యాలయాలను సొంత భవనాల్లోకి తరలించడంతో ఏటా రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతాయని అంచనా.
* 1962లో భూకంప ప్రభావాల తీవ్రత తక్కువగా ఉన్న జోన్‌-2లో దిల్లీ ఉండేది. ఇప్పుడు ప్రమాదాల తీవ్రత అధికంగా ఉన్న జోన్‌-5లోకి చేరింది. ఈ నేపథ్యంలో భూకంపాల తీవ్రతను తట్టుకొనే విధంగా నూతన భవనాల నిర్మాణం చేపడతారు.

పార్లమెంటుకు కొత్త భవనం
ప్రస్తుతం 790 సీట్ల సామర్థ్యంతో లోక్‌సభ, రాజ్యసభ, సెంట్రల్‌హాల్‌గా ఉన్న పార్లమెంటు భవనం పెరిగిన అవసరాలను తీర్చే పరిస్థితి లేకపోవడంతో నూతన భవనాన్ని.. ప్రస్తుత భవనం పక్కనే నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. 2026 తర్వాత పార్లమెంటులో ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ అవసరాల దృష్ట్యా లోక్‌సభలో 900 మంది, రాజ్యసభలో 450 మంది కూర్చొనేలా తీర్చిదిద్దుతారు. పార్లమెంటు ఉమ్మడి సమావేశాల వేదికగా లోక్‌సభనే ఉపయోగించుకొనేలా అందులో 1350 మంది కూర్చొనేలా సౌకర్యాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి సమావేశాలు జరిగినప్పుడు ఎంపీలకు సీట్లు సరిపోక అదనపు కుర్చీలు వేయాల్సి వస్తోంది. ఇది సభా మర్యాదలకు తగదన్న ఉద్దేశంతో కొత్త భవనాన్ని విశాలంగా తీర్చిదిద్దుతున్నారు. పాత పార్లమెంటు భవనాన్ని మ్యూజియంగా లేక ఇతరత్రా పార్లమెంటు అనుబంధ సేవలకు ఉపయోగిస్తారు.


కొత్త నిర్మాణాల విశేషాలు

* ప్రాజెక్టు: సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ
* వ్యయం: రూ. 12 వేల కోట్లు
* నిర్మాణ సంస్థ: హెచ్‌సీపీ డిజైన్స్‌ (గుజరాత్‌)
* రెండేళ్లలో: 2022లో దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకొనే సందర్భానికి గుర్తుగా పార్లమెంటు భవనాన్ని పూర్తిచేసి ప్రారంభించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించింది.
* కోటి చదరపు అడుగుల నిర్మాణం ఐదేళ్లలో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొత్తం సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణను 2024 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. కోటి చదరపు అడుగుల స్థలం నిర్మాణాన్ని అయిదేళ్లలోపు పూర్తిచేసి భారత్‌ కూడా వేగవంతంగా మౌలికవసతుల నిర్మాణాన్ని పూర్తిచేయగలదని ప్రపంచానికి చాటిచెప్పాలనేది లక్ష్యం. వేగవంతంగా పూర్తిచేయడంవల్ల డబ్బు ఆదాతోపాటు, ఇబ్బందులూ తప్పుతాయి. ప్రస్తుతం ఉన్న పాలన భవనాల నిర్మాణం పూర్తిగా సాకారం కావడానికి బ్రిటిషర్లకు దాదాపు 20 ఏళ్లు పట్టింది.

 

- ఈనాడు, దిల్లీ

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.