TS News: జహీరాబాద్‌లో రక్షణ పరిశ్రమ

ప్రధానాంశాలు

TS News: జహీరాబాద్‌లో రక్షణ పరిశ్రమ

యెల్గోయ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటు
రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి, రెండువేల మందికి ఉపాధి
తెలంగాణకు గర్వకారణమన్న మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరో భారీ పరిశ్రమ రానుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద యెల్గోయ్‌లో వీఈఎం టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ రూ.వెయ్యి కోట్లతో 511 ఎకరాల్లో సమీకృత రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ (ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఫెసిలిటీ)ను ఏర్పాటు చేయనుంది. మానవరహిత యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు, నౌకాదళ యంత్రాలు, రాడార్లు తయారుచేస్తారు. దీనిద్వారా రెండువేల మందికి ఉపాధి కలుగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి శిక్షణనిస్తారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, డీఆర్‌డీవో ఛైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి, నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ల సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌- వీఈఎం సంస్థ సీఎండీ వి.వెంకటరాజు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి పాల్గొన్నారు.


అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులకు అవకాశం  

డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వైమానిక, రక్షణ పరిశ్రమలకు అత్యంత అనుకూలమని, అనేక సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సాధించేందుకు రాష్ట్రానికి అవకాశం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం చక్కటి సహకారం అందిస్తోందని, నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను తాము కలసి రక్షణ పరిశ్రమలకు భూమిని కోరగా... కేవలం గంట వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రక్షణ, వైమానిక ఉత్పత్తులు వేగం పుంజుకున్నాయని, వీఈఎం లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడమే దీనికి నిదర్శనమన్నారు. వీఈఎం సంస్థ సీఎండీ వెంకటరాజు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, సహకారంతో ఇక్కడే పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించామని తెలిపారు. దేశీయ, ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా తమ సంస్థ ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతులు చేస్తుందన్నారు. ఆకాశ్‌, అస్త్ర, బ్రహ్మోస్‌ క్షిపణులకు తమ ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. అధునాతన హంగులతో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, యెల్గోయ్‌ భారత రక్షణ రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు.


తెలంగాణకు గర్వకారణం

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ వైమానిక రక్షణ, ఉత్పత్తుల కేంద్రస్థానంగా ఉందన్నారు. ఇప్పటికే బోయింగ్‌, సఫ్రాన్‌, జీఈ దేశవిదేశాలకు చెందిన ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ పరిశ్రమలను స్థాపించాయన్నారు. వైమానిక రంగంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ తరహా పేరున్న వీఈఎం సంస్థ పరిశ్రమను ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. దానికి మెగా పరిశ్రమ రాయితీలు, ప్రోత్సాహకాలను అందజేస్తామని, అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. జహీరాబాద్‌లో స్థానికులకు వీఈఎం సంస్థ ఉద్యోగాలివ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సిద్ధాంతపర విభేదాలున్నప్పటికీ జాతీయ ప్రయోజనాల కోసం కలసి పనిచేయాలన్నారు. వైమానిక, రక్షణ రంగంలో ఇక్కడి పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని