Covid Variant: కొత్త వేరియంట్‌ కలకలం

ప్రధానాంశాలు

Covid Variant: కొత్త వేరియంట్‌ కలకలం

దక్షిణాఫ్రికాలో 22 కేసులు
ఆందోళనకర రీతిలో ఉత్పరివర్తనాలు

లండన్‌/జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో తాజాగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ బయటపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ‘బి.1.1.529’గా గుర్తించిన ఈ రకానికి సంబంధించి ఇంతవరకు 22 కేసులు బయటపడ్డాయి. క్రమేపీ ఈ వేరియంట్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతున్నట్లు దక్షిణాఫ్రికా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. కరోనా నాలుగో ఉద్ధృతి (వేవ్‌) డిసెంబరు లేదా జనవరిలో వస్తుందని అంచనా వేశామని.. అయితే కొత్త వేరియంట్‌ కేసులు తాజాగా బయటపడుతున్నాయని ఆ శాఖ మంత్రి జో ఫాహ్లా తెలిపారు. కొత్త కేసులు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ కొత్త వేరియంట్‌ను బోట్స్‌వానా, హాంకాంగ్‌ల్లోనూ కనుగొన్నారు. దీనిపై ఇంపీరియల్‌ కాలేజి లండన్‌ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ టామ్‌ పీకాక్‌ బ్రిటన్‌ను అప్రమత్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అధిక సంఖ్యలో ఈ వేరియంట్‌కు కొమ్ము భాగంలో ఉత్తరివర్తనాలు (మ్యుటేషన్లు) ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విస్తృతంగా వ్యాప్తి చెందడం, రోగనిరోధక శక్తిని ఏమార్చడం వంటి కోణాల్లో ఈ రకం తీరుతెన్నులపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ‘ఆందోళనకర రకం’గా పరిగణించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డేటా పరిమితంగా ఉందని దక్షిణాఫ్రికా అంటువ్యాధుల జాతీయ సంస్థ (ఎన్‌ఐసీడీ) తాత్కాలిక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆడ్రియన్‌ పురేన్‌ చెప్పారు. దీనిపై తమ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా బి.1.1.529 రకానికి సంబంధించి రెండు ఉత్పరివర్తనాలను కనుగొన్నట్లు కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం క్లినికల్‌ బయాలజీ ప్రొఫెసర్‌, భారత సంతతికి చెందిన రవి గుప్తా ‘ది గార్డియన్‌’కు తెలిపారు.

క్లినికల్‌ ట్రయల్స్‌లో ఐటీసీ ‘కొవిడ్‌-19’ నాసల్‌ స్ప్రే
దిల్లీ: కొవిడ్‌-19ను నిరోధించేందుకు ఐటీసీ సంస్థ ముక్కులో వేసుకొనే నాసల్‌ స్ప్రేను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. బెంగళూరులోని ఐటీసీ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం క్లినికల్‌ ట్రయల్‌ రిజిస్ట్రీ- ఇండియా (సీటీఆర్‌ఐ) దగ్గర ఈ స్ప్రేను ఐటీసీ నమోదు చేసింది. ‘‘క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నందున దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రస్తుత సమయంలో ఇవ్వలేం’’ అని ఐటీసీ ప్రతినిధి పేర్కొన్నారు.


కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు లేఖ

ఈనాడు, దిల్లీ: దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (బి.1.1.529) బయటపడిన నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాల్‌ విసిరే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో సూచించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు.

539 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,119 మంది కొవిడ్‌-19 బారిన పడడంతో మొత్తం కేసులు సంఖ్య 3,45,44,882కు చేరుకుంది. క్రియాశీల కేసులు తగ్గుముఖం (1,09,940) పట్టాయి. 539 రోజుల్లో ఇదే కనిష్ఠం. తాజాగా వైరస్‌తో 396 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 4,66,980కు చేరుకుంది. రికవరీ రేటు 98.33%, పాజిటివిటీ రేటు 0.79%గా నమోదైంది. ఇప్పటివరకు దాదాపు 119.38 కోట్ల మంది వ్యాక్సిన్‌ డోసులు వేసుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని