close

ప్రధానాంశాలు

భవనాల అనుమతికి కొత్త విధానం

స్వీయ ధ్రువీకరణ ఇస్తే చాలు
ఇంటి వద్ద నుంచే పొందొచ్చు
పుర ఎన్నికల తర్వాత నగరాలు, పట్టణాల్లో అమలు
ఈనాడు - సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

వన నిర్మాణ అనుమతుల జారీలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న మార్పు తేనుంది. 500 చదరపు మీటర్ల స్థలంలో పది మీటర్లలోపు ఎత్తున నిర్మించే భవనానికి నిర్మాణదారుడు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. ఏ అధికారి చుట్టూ తిరగకుండానే అనుమతి పత్రం పొందొచ్చు. స్వీయ ధ్రువీకరణ సమర్పిస్తే చాలు. తప్పుడు పత్రాలు పెట్టినా, నిబంధనలను ఉల్లంఘించినా నిర్మాణదారుడిపై కఠినచర్యలు తీసుకునే అధికారం పుర/నగరపాలక సంస్థల అధికారులకు ఉంటుంది. కొత్త విధానం కింద తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టం ఆన్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ (టీఎస్‌బీపాస్‌) ఆన్‌లైన్‌ వ్యవస్థను తీసుకొస్తున్నారు.

జీహెచ్‌ఎంసీలో ఏటా 15వేల భవనాల నిర్మాణాలకు; మిగిలిన నగరాలు, పట్టణాలన్నింటినీ కలిపి మొత్తంమీద దాదాపు 50 వేల నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. ఇందులో 500 చ.మీ.లోపు స్థలంలో నిర్మాణమవుతున్న భవనాలు 85 శాతం వరకు ఉన్నాయి. వీటికి అనుమతులిచ్చే విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై దృష్టిపెట్టాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. తదనుగుణంగా పురపాలక మంత్రి కేటీఆర్‌ అధికారులతో చర్చలు జరిపి సరికొత్త వ్యవస్థకు రూపకల్పన చేశారు. కొత్త మున్సిపల్‌ చట్టంలో ఈ వ్యవస్థకు స్థానం కల్పించారు. ఇలా రూపుదిద్దుకున్నదే టీఎస్‌బీపాస్‌.

దరఖాస్తు నుంచి అనుమతి వరకూ..
* నిర్మాణం చేసే వ్యక్తి టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్లోకి వెళ్లి, భవన నిర్మాణ వివరాలతో కూడిన దరఖాస్తు పూర్తిచేయాలి.
* సంబంధిత స్థలం డాక్యుమెంట్‌, తర్వాత భవన నిర్మాణ ప్లాన్‌ అప్‌లోడ్‌ చేయాలి.
* ఈ డ్రాయింగ్‌ను సాఫ్ట్‌వేర్‌ రీడ్‌ చేసి నిబంధనల ప్రకారం ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. లోపం ఉందని తెలియజేస్తే, సరైన డ్రాయింగ్‌తో తిరిగి లోడ్‌ చేసినప్పుడు..ఫీజు కట్టాలని నిర్మాణదారుడికి మెసేజ్‌ వస్తుంది.
* సమర్పించిన పత్రాలు, డ్రాయింగ్‌ కరెక్టేనంటూ నిర్మాణదారుడు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంది.
* ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణదారునికి భవన నిర్మాణ అనుమతి ఆన్‌లైన్‌లో జారీ అవుతుంది.
* అనుమతి రాగానే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. నిర్మాణదారుడు తప్పుడు పత్రాలు లోడ్‌ చేశారని తేలినా, స్థలం కొలతలు తప్పుగా ఇచ్చి నిర్మాణం చేస్తున్నారని తెలిసినా, నిబంధనలను అతిక్రమించారని కనిపెట్టినా-  నిర్మాణాన్ని ఏ నోటీసూ ఇవ్వకుండానే నేలమట్టం చేసే అధికారం అధికారులకు ఉండేలా నిబంధనలు రూపొందించారు.
* వ్యవస్థను పురపాలక ఎన్నికలయ్యాక హైదరాబాద్‌ మినహా మిగిలినచోట్ల అమల్లోకి తేవాలని నిర్ణయించారు.
* జీహెచ్‌ఎంసీ చట్టంలో మార్పు తెచ్చాక, ఇక్కడా దీన్ని అమలుచేయాలని భావిస్తున్నారు.


ఏకగవాక్ష రీతి

500 చ.మీ. స్థలం దాటి పది మీటర్ల ఎత్తుకు పైబడి నిర్మించే భవన నిర్మాణదారులూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, ఏకగవాక్ష (సింగిల్‌ విండో) పద్ధతిలోనే 21 రోజుల్లోగా అనుమతి లభిస్తుంది. దీన్ని పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేయనున్నారు. దరఖాస్తు చేసిన వెంటనే  సంబంధిత శాఖల నుంచి తుది అనుమతి తీసుకోవడానికి- ఈ దరఖాస్తు వారికి సైతం ఆన్‌లైన్‌లో వెళుతుంది. దరఖాస్తుచేసిన 21 రోజుల్లో భవన నిర్మాణానికి అనుమతి రాకపోతే, దానంతట అదే జారీ అవుతుందని అధికారులు తెలిపారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.