close

ప్రధానాంశాలు

జాతీయ భద్రత ముఖ్యం

సరిహద్దులను కాపాడుకోవాల్సిందే
మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యలు

న్యూయార్క్‌: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందన నేపథ్యంలో భారత్‌లో రాజకీయ పార్టీలు భిన్న వ్యాఖ్యానాలు చేశాయి. న్యూయార్క్‌కు చెందిన ‘బజ్‌ఫీడ్‌’ అనే ఆన్‌లైన్‌ వార్తా సంస్థ.. సీఏఏపై అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ సత్య నాదెళ్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో దీనిపై స్పందన వ్యక్తమైన నేపథ్యంలో నాదెళ్ల సమాధానాన్ని బజ్‌ఫీడ్‌ యథాతథంగా నెట్‌లో పెట్టింది. భారత్‌లోని బహుళ సంస్కృతుల గురించి ఇందులో నాదెళ్ల మాట్లాడారు. అందరికీ సమానావకాశాలు సృష్టించాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు.

భారత సంస్కృతి తనను తీర్చిదిద్దిందని నాదెళ్ల చెప్పారు. సమానత్వంతో కూడిన వలస విధానాలు అమెరికాలో తన విజయాలకు దోహదపడ్డాయన్నారు. భారత్‌లో ఒక వలసదారుడు అద్భుత కంపెనీని ప్రారంభించడం కానీ బహుళజాతి సంస్థకు నాయకత్వం వహించడాన్ని కానీ చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనివల్ల భారత సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘‘నా సాంస్కృతిక వారసత్వం నాకు గర్వకారణం. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో క్రిస్మస్‌, దీపావళితోపాటు పెద్ద పండుగలను జరుపుకొనేవాళ్లం.’’ అని అన్నారు. ఆ దేశంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తిగా.. జరుగుతున్న పరిణామాలు తనకు విచారకరమని తెలిపారు. అమెరికాకు చెందిన రెండు అద్భుతమైన అంశాలు భారత్‌లో కనిపిస్తున్నాయని చెప్పారు. ‘‘ఒకటి.. నేను పుట్టి పెరిగిన చోటుకు సాంకేతికత వ్యాపిస్తోంది. రెండోది.. ఇమిగ్రేషన్‌ విధానం. భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్‌ వలసదారుడు ఇక్కడ అనూహ్య విజయాలు సాధించడం కానీ ఇన్ఫోసిస్‌కు సీఈవో కావడం కానీ చూడాలని ఉంది. అమెరికాలో నాకు జరిగిన పరిణామాలను తరచి చూసుకున్నప్పుడు భారత్‌లోనూ అదే జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

సరిహద్దులు వాస్తవం
దేశాలన్నీ తమ సరిహద్దులను నిర్వచించుకొని, జాతీయ భద్రతను కాపాడుకుంటూ దానికి అనుగుణంగా వలస విధానాన్ని తీర్చి దిద్దుకోవాలని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ‘‘దేశాలు తమ జాతీయ భద్రతను విస్మరించాలని నేను చెప్పడంలేదు. సరిహద్దులు ఉన్నాయి. వాటి ఉనికి వాస్తవం. జనం దాని గురించి యోచిస్తారు. ఇతర దేశాల తరహాలో భారత్‌లోనూ ఇమిగ్రేషన్‌ అనేది కీలకాంశమే. అసలు ఇమిగ్రేషన్‌ అంటే ఏమిటి? వలసదారులు, మైనార్టీ బృందాలు ఎవరు అనే అంశాలపై సంబంధిత ప్రభుత్వం అనుసరించే వైఖరి సున్నితమైనది’’ అని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వాలు చర్చల ద్వారానే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు.
భారత్‌లో జరుగుతున్న పరిణామాల్లో సానుకూల అంశాలూ ఉన్నాయన్నారు. ‘‘నాకు సంబంధించినంత వరకూ మంచి పరిణామమేమిటంటే.. ఇది భిన్నస్వరాల ప్రజాస్వామ్యం. ప్రజలు దీనిపై చరుగ్గా చర్చిస్తున్నారు. దాన్నేమీ దాచిపెట్టలేదు. మేం (భారతీయులు) దేనికి కట్టుబడి ఉన్నామన్నదానిపై, నేను దేనికి కట్టుబడి ఉన్నానన్న అంశంపై నాకు స్పష్టత ఉంది.’’ అని పేర్కొన్నారు. సీఏఏపై వ్యక్తమైన వ్యతిరేక స్వరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అదే చేస్తున్నాం: భాజపా
నాదెళ్ల కోరుకుంటున్నట్లే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని భాజపా పేర్కొంది. ‘‘జాతికి భద్రత కల్పిస్తోంది. సరిహద్దులను రక్షిస్తోంది. అందుకు అనుగుణంగా వలసదారులకు సంబంధించిన విధానం రూపొందిస్తోంది’’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. ఎవరైనా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటికే ప్రధాని మోదీ ఈ విషయం చెప్పారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భాజపా ఎంపీ మీనాక్షి లేఖి భిన్నంగా స్పందించారు. ‘‘సీఏఏపై అక్షరాస్యులకూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేందుకు సత్య నాదెళ్ల వ్యాఖ్యలే నిదర్శనం.’’ అని అన్నారు. సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ ‘‘ఎవరైనా భాజపా నాయకత్వ తీరును అద్దంలో చూపితే వారిపై జాతివ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. భారత్‌లో వ్యాపారం చేయకుండా అడ్డుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.