close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గబ్బిలంతోకీడెంత?

వైరస్‌ల వ్యాప్తిలో వాటి పాత్రెంత?
మానవాళికి అవి చేస్తున్న మేలేమిటి?


గబ్బిలాల నుంచి వైరస్‌లు వస్తున్నాయని భావిస్తే మనమే వాటికి దగ్గరవుతున్న సందర్భాలేంటో గుర్తించి తగ్గించుకోవటం మంచిది.

- డాక్టర్‌ జాన్‌ ఎప్‌స్టన్‌ (ఎకో హెల్త్ అలయన్స్‌లోని డిసీజ్‌ ఎకాలజిస్ట్‌)


కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌ను గబ్బిలాలు తీసుకొస్తాయనడానికి కచ్చితమైన ఆధారాల్లేవు. ప్రజలు వీటిపై అనవసరమైన ఆందోళనకు గురికాకూడదు.

- సి.శ్రీనివాసులు (హైదరాబాద్‌ నగరానికి చెందిన బయాలజిస్టు)


కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అందరి వేళ్లూ ఇప్పుడు ఓ చిన్న జీవి వైపు చూపిస్తున్నాయి. చాలా వైరస్‌లకు అతిథ్యం ఇస్తున్న చీకటి జీవి గబ్బిలం నుంచే ఇది వ్యాపించి ఉండొచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి(దీన్ని పూర్తిస్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది). గతంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఎబోలా.. సార్స్‌.. మెర్స్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గబ్బిలాలకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతి గబ్బిలంలో కనీసం రెండు రకాల వైరస్‌లు ఆశ్రయం పొందుతాయి. కొన్నిసార్లు నేరుగా గబ్బిలం నుంచి, మరికొన్నిసార్లు మరో జీవిలోకి చేరి అక్కడి నుంచి మనిషిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఇలానే కరోనా వైరస్‌కు కారణమైనట్లు భావిస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌లకు గబ్బిలాలు ఎలా ఆతిథ్యం ఇస్తున్నాయి? చీకటి గుహల్లో, గదుల్లో జీవిస్తూ.. మనుషుల మధ్య సంచరించే ఈ జీవులు వైరస్‌ వ్యాప్తికి ఎంతమేరకు దోహదపడుతున్నాయి? వీటివల్ల మనిషికి కీడా? మేలా? అనేవి ఆసక్తికర అంశాలు.

ఇప్పటిదాకా వచ్చిన చాలా మహమ్మారులు జంతువుల నుంచి మనుషులకు సోకినవే. జునోటిక్‌ వైరస్‌లుగా వీటిని వ్యవహరిస్తారు. వీటికి కారణమైన వైరస్‌లు ఒక జీవి నుంచి మరో జాతి జీవిలోకి ప్రవేశించి అక్కణ్నుంచి మనుషులకు చేరుతున్నాయి. ఇలా గబ్బిలాల్లో ఆశ్రయం పొందుతున్న 60కి పైగా వైరస్‌లను పరిశోధకులు గుర్తించారు.

రెక్కలే దానికి రక్ష..!
సాధారణంగా మనం అలిసిపోయే స్థాయిలో పనిచేసినా, గాయాలైనా, కండరాలు అలిసి, నలిగి కణ స్థాయిలో దెబ్బతింటాయి. అప్పుడు వాటిని మరమ్మతులు చేయడానికి శరీరంలోని రక్షణ వ్యవస్థ సచేతనం అవుతుంది. ఈ క్రమంలో మనకు నొప్పులు రావడం.. ఇంకా ఎక్కువ చేస్తే వాపు రావడం, జ్వరం వంటివి బయల్దేరతాయి. ఇదంతా కూడా మన శరీరం జరిగిన నష్టాన్ని మరమ్మతు చేసుకొనేందుకు చేసే ప్రయత్నంలో సహజంగా తలెత్తే ప్రకియ. కొన్ని సందర్భాల్లో ఇది శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా జరిగి న్యుమోనియా వంటి పరిస్థితి తలెత్తి ప్రాణహాని జరగొచ్చు. ప్రస్తుతం కొవిడ్‌-19లో ఇలానే జరుగుతోంది.

ఈ విషయంలో గబ్బిలం చాలా ప్రత్యేకమైంది. అది ఎగిరేందుకు నిమిషానికి వందల సార్లు నిలకడగా రెక్కలను ఊపుతుండటంతో.. దాని కండరాలు కణస్థాయిలో దెబ్బతింటాయి కాబట్టి.. వాటికి మరమ్మతులు చేసేందుకు శరీర రక్షణ వ్యవస్థ ఎప్పుడూ చురుగ్గా ఉండటం వాటికి అలవాటవుతుంది. కానీ అది నియంత్రిత స్థాయిలోనే ఉంటుంది. ఇది ఆ జీవికి మరో రకంగా ఉపయోగపడుతుంది. వైరస్‌లు దాడిచేస్తే ఈ రక్షణ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కొన్ని గబ్బిలాల్లో ఈ వ్యవస్థ వైరస్‌లను ఎదుర్కోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అవి వైరస్‌లతో పోరాడకపోయినా.. వాటి నుంచి శరీరానికి హాని జరగకుండా అడ్డుకుంటుంటాయి. దీంతో గబ్బిలం శరీరం వైరస్‌ల నివాసంగా మారుతుంది. అంటే ఆ వైరస్‌లు గబ్బిలాన్నేమీ చేయలేవు. కేవలం దాని ఒంట్లో స్థావరాన్ని పెట్టుకుంటాయన్నమాట. ఈ క్రమంలో గబ్బిలం నుంచి మరో జీవికి లేదా మనిషికి ఇది చేరితే కొత్త వ్యాధికి కారణం అవుతుంది.

ఎలా వ్యాపింపజేస్తాయి?
గబ్బిలాలు స్వల్ప సమయంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. ఈ క్రమంలో అవి మార్గం మధ్యలో ఏవైనా జంతువులను కొరకడం, మల, మూత్రాలను విసర్జించే క్రమంలో వైరస్‌లను వ్యాప్తిచేస్తాయి. ఈ గబ్బిలాలను ఎవరైనా తాకినా, వేటాడినా, భుజించినా ఎక్కువగా వ్యాపిస్తాయి. అంటే ఏదో ఒక రకంగా మనిషి వీటి సమీపంలోకి వెళ్లడం వల్లనే వైరస్‌ వ్యాపిస్తోంది తప్ప.. వాటంతట అవి నేరుగా మనిషికి వ్యాపింపజేసింది లేదు. 2002లో గబ్బిలం నుంచి ఒక సివిట్‌ పిల్లికి సార్స్‌ వైరస్‌ వ్యాపించింది. దాని నుంచి మనిషికి వచ్చింది.

చైనాలో వ్యాధుల వ్యాప్తిలో..
చైనా మార్కెట్లలో నెమళ్లు, కుక్కలు, ఉడుములు, జింకలు, గబ్బిలాలు వంటి 120 రకాల వన్యప్రాణులు కనిపిస్తాయి. వీటిని రకరకాల బోనుల్లో పెట్టి వినియోగదారులు ఎంచుకొన్న వాటిని చంపి విక్రయిస్తారు. ఆ దేశంలో వన్యప్రాణుల బ్రీడింగ్‌కు దాదాపు 20,000 ఫామ్‌లు ఉన్నాయి. వుహాన్‌ మార్కెట్‌నే తీసుకొంటే ఇక్కడ దాదాపు 1,000 మాంసపు దుకాణాలు ఉన్నాయి. ఇదే మార్కెట్‌ నుంచి కొవిడ్‌ వ్యాపించిందని వార్తలు వస్తున్నాయి. గతంలో చైనాలోనే గబ్బిలాల నుంచి సివిట్‌ పిల్లికి సార్స్‌ వైరస్‌ సోకినట్లు ఇప్పుడు కూడా గబ్బిలాల ద్వారానే వ్యాపించి ఉండొచ్చని అనుమానాలున్నాయి.

ఇవి ఉండాలా వద్దా?
వైరస్‌లను వ్యాపింపజేస్తున్నాయి కాబట్టి.. గబ్బిలాలను తుదముట్టించాలనే ఆలోచన సరికాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే గబ్బిలాలు ప్రకృతి సమతౌల్యతను కాపాడటంలో ఒక కీలక భాగం. పంటలను ఆశించే పురుగులను ఇవి తగ్గిస్తాయి. గబ్బిలాల సంఖ్య ఎక్కువగా ఉంటే పురుగులు, కీటకాల సంఖ్య పెరగకుండా ఉంటుంది. దీంతోపాటు ఫలదీకరణానికి, వివిధ పండ్లను తిని విత్తనాల వ్యాప్తికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాపించడంతో ప్రజలు గబ్బిలాలను చూసి భయపడి వాటి ఆవాసాలను ధ్వంసం చేసే ముప్పు ఉందని పర్యావరణ ప్రేమికులు భయపడుతున్నారు.

హైదరాబాద్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి?
హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో 16 రకాల గబ్బిలాలు ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 18 రకాలు కనిపిస్తాయి. నగరంలోని గోల్కోండ కోటలో గబ్బిలాలకు 1990లో పెద్ద కాలనీ ఉండేది. దాదాపు 12వేల వరకు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 4 వేలకు పడిపోయిందని అంచనా. 

 


పిచ్చుకపై బ్రహ్మాస్త్రం బెడిసికొట్టి..

ప్రకృతి సమతౌల్యతను మార్చేయాలని చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టి కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 1958లో ఆ దేశ నేత మావో జెడాంగ్‌ ‘ఫోర్‌ పెస్ట్స్‌’ ఉద్యమాన్ని చేపట్టారు. మలేరియాకు కారణం అవుతున్న దోమలను, ప్లేగుకు కారణమవుతున్న ఎలుకలు, ఈగలను, ధాన్యం గింజలను తినేస్తున్నాయన్న కారణంతో పిచ్చుకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి మూడు జీవులు ప్రజల నుంచి తప్పించుకొన్నా.. పిచ్చుకలు మాత్రం భారీగా బలయ్యాయి. ఎంతగా అంటే.. బీజింగ్‌లోని పోలండ్‌ దౌత్యకార్యాలయంలో పిచ్చుకలున్నాయని గ్రహించిన ప్రజలు అక్కడకు చేరారు. లోపలికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యాలయాన్ని చుట్టుముట్టి రెండు రోజుల పాటు భారీగా డప్పులు కొట్టారు. ఆ అమాయక జీవులు రెండురోజుల పాటు ఏకధాటిన ఎగిరి ప్రాణాలు కోల్పోయాయి. చైనా పాలకులు 1960లో వాటిని చంపటం ఆపేయాలని పిలుపునిచ్చారు. అప్పటికే వాటి సంఖ్య భారీగా తగ్గి ప్రకృతి సమతౌల్యతను కోల్పోయింది. ఫలితంగా మిడతల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీనికి ప్రకృతి వైపరీత్యాలు తోడుకావడంతో 1959-61వరకు కనిష్ఠంగా కోటీ 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సోవియట్‌ నుంచి 2.5 లక్షల పిచ్చుకలను చైనాకు తెచ్చుకోవాల్సి వచ్చింది. అందువల్ల ప్రకృతి సమతౌల్యతను కాపాడుతున్న గబ్బిలాల అంతం సరికాదని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.