close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇప్పుడే మరింత జాగ్రత్త

ప్రపంచ ఆరోగ్యసంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు
డాక్టర్‌ శ్రీనాథరెడ్డితో ముఖాముఖి
ఈనాడు - హైదరాబాద్‌

లాక్‌డౌన్‌కు సడలింపులివ్వటం స్తంభించిన జనజీవనం తిరిగి గాడిలో పడడానికి తప్పితే.. కరోనా వైరస్‌ను పారదోలినట్లు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు, భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌, ప్రముఖ హృద్రోగ వైద్యనిపుణులు డా।। శ్రీనాథరెడ్డి స్పష్టం చేశారు. వైరస్‌ ఇంకా మనకు చేరువలోనే దాగి ఉందనీ, ఎవరిలో ఉందో, ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుందో తెలియని అతి క్లిష్ట కాలాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని ఆయన హెచ్చరించారు. స్వేచ్ఛ దుర్వినియోగంతో నష్టమే అధికమన్నారు. కేసుల సంఖ్య పెరిగితే భయపడొద్దని, వ్యక్తిగత, సామూహిక జాగ్రత్తలు పాటిస్తూ ఇప్పుడే మరింత అప్రమ్తతంగా ఉండాలని సూచించారు.

‘కొవిడ్‌ 19 సాలిడారిటీ’ ప్రయోగాల్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన అంతర్జాతీయ స్టీరింగ్‌ కమిటీలో డాక్టర్‌ రెడ్డికి స్థానం కల్పిస్తూ ఇటీవలే సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్‌ చికిత్సకు ప్రపంచ దేశాల్లో జరిగే పలు పరిశోధనలను ఈ కమిటీ పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశనం చేస్తుంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ అనంతర జాగ్రత్తలతో పాటు కరోనా చికిత్సపై అంతర్జాతీయ పరిశోధనలు, నిర్ధారణ పరీక్షలు, తదితర అంశాలపై డాక్టర్‌ శ్రీనాథరెడ్డితో ‘ఈనాడు’ జరిపిన ప్రత్యేక ముఖాముఖి.

వాహకాల ద్వారా వైరస్‌ సోకే అవకాశాలు తక్కువేనని అమెరికాలోని సీడీసీ అధ్యయనంలో విశ్లేషించారు కదా?
వ్యక్తి నుంచి వ్యక్తికి తుంపర్ల ద్వారా వైరస్‌ ఎక్కువగా సోకుతుందనేది వారి అధ్యయన సారాంశం. అయితే కొద్ది మోతాదులోనైనా వాహకాల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుంది. అందువల్ల ఏదైనా వస్తువులను తాకినప్పుడు వెంటనే చేతులను శుభ్రపర్చుకోవాలి. లేదంటే అవే చేతుల ద్వారా నోటిని, ముక్కును, కళ్లను తాకినప్పుడు శరీరంలోనికి వైరస్‌ ప్రవేశించే అవకాశాలుంటాయి.

నిర్ధారణ పరీక్షలు వైరస్‌ నియంత్రణకు ఎలా దోహదపడతాయి?
పరీక్షల అవసరముంది. ఎవరికి చేయాలనేది ముఖ్యం. చాలామంది పాజిటివ్‌ వ్యక్తుల్లో లక్షణాలు కనిపించవు. కొద్దిమందిలో అవి కనిపించడానికి రెండుమూడు రోజుల ముందు కూడా ఆ వ్యక్తి నుంచి వైరస్‌ ఇతరులకు వ్యాపించే అవకాశాలున్నాయి. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తిలో వైరస్‌ ఉందో లేదో గుర్తించడం కష్టం. అందువల్ల ఆ వ్యక్తికి దూరంగా ఉండడం అవసరం.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి నుంచి ఎవరికి వైరస్‌ సోకిందో తెలియనప్పుడు.. అందరిలోనూ నిర్ధారణ పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం లేదు. లండన్‌లోని ఇంపీరియల్‌ కళాశాల వారు కొవిడ్‌ పరీక్షల నిర్వహణపై గత నెల చేసిన సమగ్ర అధ్యయనంలో తేల్చిందిదే.  నిర్ధారణ పరీక్షల వల్ల 20-30 శాతమే ప్రయోజనమని.. దానికన్నా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించటంతోనే ఎక్కువ మేలని అందులో పేర్కొన్నారు.

కరోనా చికిత్సకు ఔషధ ప్రయోగాలు ఏ దశలో..?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పలు దేశాల్లో కరోనా చికిత్సకు ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయి. మరో మూణ్నాలుగు నెలల్లో ఫలితాలు వెల్లడవుతాయి. టీకా రావడానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర పట్టొచ్చు.


మున్ముందు కేసుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళన ఉంది?
కచ్చితంగా చెప్పలేం, కేసులు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య  పెంచుతున్నారు. కాబట్టి పాజిటివ్‌ కేసుల సంఖ్యా పెరుగుతుంది. ఆ కేసులు ఎలాంటివి? వాటిలో తీవ్రత.. మరణాల రేటు ఎంత? ఇది ప్రధానం. వైరస్‌ సోకినంతనే తీవ్రంగా జబ్బు పడినట్లు కాదు. అత్యవసర సేవలు అవసరమైనప్పుడు వారికి చికిత్స అందించడమే ముఖ్యం. కేసుల సంఖ్య పెరుగుతుందని భయాందోళనలు వద్దు. వైరస్‌ వ్యాప్తి వేగాన్ని తగ్గించడం కీలకం.


లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీన్ని మీరెలా చూస్తారు?
వియత్నాం వంటి కొన్ని దేశాల్లో విజయవంతంగా వైరస్‌ను నియంత్రించగలిగారు. కానీ, ప్రపంచంలో అత్యధిక దేశాలు కరోనా బారినపడి కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. మన వద్దా వైరస్‌ ఉంది. కానీ, జీవితాంతం లాక్‌డౌన్‌లో ఉండలేం కదా.. లాక్‌డౌన్‌లో వైరస్‌ను ఎదుర్కోవడానికి వనరులన్నీ సమకూర్చుకున్నాం. ఇప్పుడు వైరస్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం. అయినా లాక్‌డౌన్‌ తర్వాత వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యక్తిగత దూరం పాటించటం, మాస్కులు ధరించటం, చేతులు శుభ్రపర్చుకోవడం వంటివి అనుసరించాల్సిందే. వ్యక్తిగతంగా, సామూహికంగా తీసుకునే జాగ్రత్తలనూ కొనసాగించాల్సిందే.


కరోనా మరణాలు భారత్‌లో తక్కువ.. కారణాలేంటి..?
మన దేశంలోనే కాదు.. దక్షిణాసియా దేశాల్లోనూ కరోనా మరణాల రేటు తక్కువే. కారణం వాతావరణమా, ఇతరాలు ఏమైనానా.. అనేది అధ్యయనం చేస్తున్నారు. మన వద్ద 60ఏళ్లు పైబడిన వారు తక్కువ. వృద్ధాప్యంలో ఈ వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతుంది. దక్షిణాసియా దేశాల్లో గ్రామీణ జనాభా ఎక్కువ. అమెరికా, ఐరోపా దేశాల్లో పట్టణ జనాభా అధికం. తక్కువ స్థలంలో ఎక్కువమంది జీవిస్తుంటారు. ఇలాంటి చోట్ల వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుంది. అదే గ్రామీణంలో ఆ పరిస్థితులుండవు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.