close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మత విద్వేషాలకు కుట్ర

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వాయిదా వేయించే ఎత్తుగడ
ప్రార్థన మందిరాల వద్ద వికృత చేష్టలకు పన్నాగం
అరాచకశక్తులపై పక్కా సమాచారం ఉందన్న సీఎం కేసీఆర్‌
ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని అలాంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని ప్రకటించారు. శాంతిభద్రతలపై బుధవారం ప్రగతి భవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు అంజనీకుమార్‌, వీసీ సజ్జనార్‌, మహేశ్‌ భగవత్‌, అదనపు డీజీపీ జితేందర్‌, ఐజీలు స్టీఫెన్‌ రవీంద్ర, వై.నాగిరెడ్డి, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, వరంగల్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అధికారులతో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధికి కుట్రలో భాగంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేశారు. మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రజలను ఏమార్చాలని చూశారు. తర్వాత కవ్వింపు చర్యలకు దిగారు. అయినా ప్రజలు అవేవీ పట్టించుకోలేదు. దీంతో అరాచకవాదులు ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కరీంనగర్‌లోనో, వరంగల్‌లోనో, ఖమ్మంలోనో, మరో చోటనో గొడవలు రాజేసి.. దాన్ని హైదరాబాద్‌లో విస్తృత ప్రచారం చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్‌లోనూ ఏదో ఓ చోట గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రార్థన మందిరాల దగ్గర వికృత చేష్టలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది వారి పన్నాగం. ఇలా ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి ఎన్నికలు వాయిదా వేయించాలని ప్రణాళిక రచించారు. దీనిపై పక్కా సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది’ అని అధికారులకు వివరించారు.

హైదరాబాద్‌ తెలంగాణకు గుండెకాయ
‘ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహశక్తుల ఆటలు సాగనీయొద్దు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్నాం. పేకాట క్లబ్బులు, గుడుంబా లాంటి సమస్యలను దూరం చేశాం. ప్రభుత్వ చర్యల కారణంగానే హైదరాబాద్‌ సహా రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు సురక్షిత నగరం అనే పేరు వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండటంతో యువతకు ఉపాధి దొరుకుతోంది. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 1.60 కోట్ల జనాభా ఉన్నారు. తెలంగాణకు గుండెకాయ వంటి ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఘర్షణలు సృష్టించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఎంతటి వారినైనా సరే, అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు. ఎక్కడికక్కడ సమాచారం సేకరించి, కుట్రలను భగ్నం చేయాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి మాటలు విని రెచ్చిపోవద్దని యువతకు సూచించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు. తమ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందని, సంఘ విద్రోహశక్తుల కుట్రలు భగ్నం చేసి తీరుతామని పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు