పదవి చేపట్టిన తక్షణమే విధుల్లోకి

ప్రధానాంశాలు

పదవి చేపట్టిన తక్షణమే విధుల్లోకి

తొలి రోజునే దాదాపు 12 ఉత్తర్వులు ఇవ్వనున్న బైడెన్‌
హామీల అమలుపై రూపొందిన కార్యాచరణ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షునిగా అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే జో బైడెన్‌ పరిపాలన కార్యాచరణను ప్రారంభించనున్నారు. తొలి రోజైన ఈ నెల 20న దాదాపు 12 కీలక అంశాలపై ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దేశాన్ని ప్రస్తుతం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న నాలుగు సంక్షోభాలు పీడిస్తున్నాయని, వాటి పరిష్కారానికే ఈ ఉత్తర్వులు ఇస్తారని శ్వేత సౌధం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమితులు కానున్న రోన్‌ క్లెయిన్‌ వెల్లడించారు. ఈ మేరకు శ్వేత సౌధంలోని సీనియర్‌ అధికారులకు ఓ నోట్‌ పంపించారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను మార్చడంతో పాటు, మరింత పురోగతి సాధించేలా ఈ విధానాలు ఉండనున్నాయి. ‘‘తొలి రోజునే చేస్తాను’’ అంటూ ఎన్నికల సమయంలో ఆయన పలు అంశాలపై హామీలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు.

4 సంక్షోభాలకు తక్షణ పరిష్కారం
అమెరికాలో కరోనా సంక్షోభం, దాని ఫలితంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ సంక్షోభం, జాతి వివక్ష సంక్షోభాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అత్యవసర చర్యలు తీసుకొని ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను నిలపాల్సి ఉంది. మొదటి పది రోజుల్లోనే వీటిపై కార్యాచరణ ప్రారంభిస్తారు. అందులో భాగంగా ప్రమాణ స్వీకారం రోజున దాదాపు డజను ఉత్తర్వులపై సంతకాలు చేస్తారు.
* కరోనా నియంత్రణలో భాగంగా మాస్కు కట్టుకోవడాన్ని తప్పనిసరి చేయనున్నారు. ‘వంద రోజుల మాస్కు ధారణ సవాలు’ అనే కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
* విద్యా రుణాలు, వడ్డీ చెల్లింపుపై ప్రస్తుతం ఉన్న గడువును మరింతగా పొడిగించాలని విద్యాశాఖను ఆదేశించనున్నారు.
* వలస వచ్చిన వారిని గౌరవిస్తూ విధానాల్లో మార్పులు చేయనున్నారు. వీరి వల్లనే అమెరికావారికి అవకాశాలు తగ్గుతున్నాయంటూ 2016లో ట్రంప్‌ ప్రచారం చేసి అధికారంలోకి రావడం గమనార్హం. ఈ విషయంలో ట్రంప్‌ విధానాలను పూర్తిగా మార్చనున్నారు. చట్టంలో తగిన సవరణలు సూచిస్తూ కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపించనున్నారు. దీని ద్వారా 1.10 కోట్ల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.
* రెండో రోజైన జనవరి 21న కరోనా నియంత్రణపై మరిన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. పాఠశాలలు, వ్యాపారాలను సురక్షితంగా పునః ప్రారంభించడంపై ఆదేశాలు వెలువడొచ్చు.
* కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించే విషయమై మంత్రులకు సూచనలు ఇవ్వనున్నారు.
* ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మరికొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చనున్నారు. ‘‘అమెరికా భవిష్యత్తు అమెరికాలోనే తయారు’’ అన్న నినాదాన్ని ఇవ్వనున్నారు.
* క్రిమినల్‌ న్యాయ విధానంలో సంస్కరణలు చేపట్టి జాతి వివక్ష లేకుండా చూస్తానన్న ఎన్నికల హామీ అమలుపై ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
* ప్రభుత్వ పరిపాలనకు నమ్మకాలు కాకుండా శాస్త్ర విజ్ఞానమే మార్గదర్శకం కావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా వాతావరణ మార్పుల విషయమై ఉత్తర్వులు ఇవ్వనున్నారు. పర్యావరణంపై అంతర్జాతీయంగా కుదిరిన పారిస్‌ ఒప్పందంలో మళ్లీ చేరే అవకాశం ఉంది.
* ఆరోగ్య భద్రతను విస్తరించడంతో పాటు ఆర్థికంగా దిగువ వర్గాల మహిళలు, అందులోనూ శ్వేత జాతికి చెందని మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.
* కొన్ని ముస్లిం దేశాల వారు రాకుండా విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది.

రెండు బైబిల్‌ పుస్తకాలపై కమల ప్రమాణం
ప్రమాణ స్వీకారం సందర్భంగా కమలా హారిస్‌ రెండు బైబిల్‌ పుస్తకాలను పట్టుకోనున్నారు. తల్లి శ్యామలా గోపాలన్‌ తరువాత తల్లిగా భావించే రెగీనా షెల్టాన్‌ ఉపయోగించిన బైబిల్‌ను తీసుకురానున్నారు. చిన్నతనంలో కమల నివాసానికి రెండిళ్ల దూరంలో రెగీనా ఉండేవారు. పాఠశాల నుంచి వచ్చిన తరువాత కమల నేరుగా అక్కడికే వెళ్లేవారు. ఆమెను కూడా తల్లిగానే గౌరవించేవారు. ఈ బైబిల్‌ను పట్టుకొనే అటార్నీగా, సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బాల్యంలోనే హీరోగా భావించిన పౌర హక్కుల నాయకుడు థుర్‌గుడ్‌ మార్షల్‌ చదివిన బైబిల్‌ను కూడా పట్టుకోనున్నారు. ఆయన అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయునిగా గుర్తింపు పొందారు. ఆయన స్ఫూర్తితోనే కమల న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.

కమలచే ప్రమాణ స్వీకారం చేయించనున్న సోనియా
వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్‌చే సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారిలో సోనియా మూడోవారు కావడం గమనార్హం. ఆమె హిస్పానిక్‌ (దక్షిణ అమెరికా ఖండం) జాతికి చెందిన తొలి మహిళ కావడం ఇంకో విశేషం.  

నేడు సెనేటర్‌ పదవికి రాజీనామా
ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుండడంతో కాలిఫోర్నియా సెనేటర్‌ పదవికి కమల సోమవారం రాజీనామా చేయనున్నారు. మిగిలిన రెండేళ్ల కాలానికి ఆమె స్థానంలో ఆ రాష్ట్ర సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అలెక్స్‌ పడిల్లాను గవర్నర్‌ నియమించనున్నారు.

క్యాపిటల్‌ భవనం వద్ద తుపాకీతో సంచారం
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసే క్యాపిటల్‌ భవనం వద్దకు లైసెన్స్‌లేని తుపాకీతో వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వెస్లీ అలెన్‌ బీలర్‌ అనే వ్యక్తి 9 ఎం.ఎం. హ్యాండ్‌ గన్‌, 500 రౌండ్ల మందుగుండు సామగ్రి పట్టుకొని కారులో రాగా చెక్‌పాయింట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారును తనిఖీ చేసినప్పుడు ఇవి బయటపడ్డాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని