close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భారత్‌లో డ్యామ్‌లకు కాలం చెల్లుతోంది

వాటితో పెను ముప్పు
2025 నాటికి 1,115 జలాశయాలకు 50 ఏళ్లు పూర్తి
ఐరాస నివేదిక స్పష్టీకరణ

న్యూయార్క్‌: భారత్‌లో అనేక భారీ డ్యామ్‌లకు కాలం చెల్లుతోందని ఐరాస నివేదిక హెచ్చరించింది. 2025 నాటికి దేశంలో వెయ్యికిపైగా డ్యామ్‌లు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి పాత జలాశయాల వల్ల పెను ముప్పు పొంచి ఉందని స్పష్టంచేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో అధికశాతం.. 20వ శతాబ్దంలో నిర్మించిన డ్యామ్‌లకు దిగువన ఉంటారని తెలిపింది.
‘ఏజింగ్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: యాన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌’ పేరుతో ఈ నివేదికను ఐరాస విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కెనడాలో ఉన్న ‘జల, పర్యావరణ, ఆరోగ్య సంస్థ’ తయారుచేసింది. భారత్‌, అమెరికా, ఫ్రాన్స్‌, కెనడా, జపాన్‌ వంటి దేశాల్లో డ్యామ్‌ల స్థితిగతులపై అధ్యయనం జరిపి, దీన్ని రూపొందించింది. దీని ప్రకారం..
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న 58,700 భారీ డ్యామ్‌లలో అధిక భాగం 1930-1970 మధ్య నిర్మించినవే. 50 నుంచి 100 ఏళ్ల మధ్య మన్నేలా వాటిని నిర్మించారు.
50 ఏళ్లు నిండాక ఒక భారీ కాంక్రీటు డ్యామ్‌లో సమస్యలు మొదలవుతాయి. జలాశయంలో వైఫల్యాలు;  మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు పెరగడం; పనితీరు, సమర్థత తగ్గడం వంటివి ఇందులో ఉంటాయి.
2050 నాటికి భూమి మీద ఉండే జనాభాలో అధికశాతం మంది.. 20వ శతాబ్దంలో నిర్మించిన వేలాది జలాశయాలకు దిగువన ఉంటారు. వాటిలో అనేక డ్యామ్‌లకు ఇప్పటికే కాలం చెల్లింది.
20వ శతాబ్దం మధ్యలో జరిగినట్లు మరోసారి భారీ డ్యామ్‌ నిర్మాణ విప్లవానికి అవకాశం లేదు. మరోవైపు.. నాడు నిర్మించిన వాటికి మాత్రం కాలం చెల్లడం మొదలవుతోంది.
ప్రపంచంలోని భారీ డ్యామ్‌లలో 55 శాతం (32,716).. ఆసియాలోని చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియాలోనే ఉన్నాయి. వాటిలో చాలా వరకూ త్వరలోనే 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు ఐరోపాల్లోనూ ఇదే పరిస్థితి.
భారత్‌లో 2025 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకునే భారీ డ్యామ్‌లు 1,115 మేర ఉంటాయి. 2050 నాటికి వాటి సంఖ్య 4250కు చేరుతుంది.
కేరళలో 100 ఏళ్ల కిందట నిర్మించిన ముళ్లైపెరియార్‌ డ్యామ్‌కు ప్రమాదం వాటిల్లితే 35 లక్షల మందికి ప్రమాదం కలుగుతుంది. ఆ జలాశయం.. భూకంప ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతంపై ఉంది. ఆకృతిపరంగానూ లోపాలు బయటపడుతున్నాయి. దాని నిర్వహణ అంశంపై కేరళ, తమిళనాడు మధ్య వివాదాలు ఉన్నాయి.
డిజైన్‌, నిర్మాణం, నిర్వహణపరంగా మెరుగైన డ్యామ్‌లు చాలా తేలిగ్గా 100 ఏళ్లు మన్నుతాయి. అయితే ఆర్థిక, ఆచరణకు సంబంధించిన పరిమితుల వల్ల అనేక డ్యామ్‌లకు ముందే స్వస్తి పలకడం జరుగుతుంది. అమెరికా, ఐరోపాల్లో ఇప్పటికే ఈ పోకడ మొదలైంది.
అమెరికాలో 90,580 డ్యామ్‌ల సరాసరి వయసు 56 ఏళ్లు. దాదాపు 85 శాతం జలాశయాలకు కాలం చెల్లింది.
ప్రపంచవ్యాప్తంగా భారీ డ్యామ్‌లలో నిల్వ చేసిన నీటిని పరిశీలిస్తే అది 7వేల నుంచి 8,300 క్యూబిక్‌ కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. ఈ పరిమాణంతో కెనడాలోని 80 శాతం భూభాగాన్ని ఒక మీటరు ఎత్తు వరకూ నీటిని నింపొచ్చు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు