close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకాల పంపిణీకి 5 సూత్రాలు

రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలి
ప్రధాని మోదీకి మన్మోహన్‌సింగ్‌ లేఖ

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమ వేగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం అయిదు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎంతమందికి టీకాలు ఇచ్చామని కాకుండా, జనాభాలో ఎంత శాతం మందికి ఇచ్చామన్నదాన్నే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఇంతవరకు జనాభాలో చాలా తక్కువ శాతం మందికే టీకాలు అందాయని గుర్తు చేశారు.

1. ఏయే వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు ఎంతమేరకు ఆర్డర్లు ఇచ్చారు, వచ్చే ఆరు నెలల్లో ఎంత పరిమాణంలో వ్యాక్సిన్‌ అందించడానికి ఆ సంస్థలు అంగీకరించిందీ బహిరంగంగా వెల్లడించాలి. ఆరునెలల కాలంలో నిర్దేశిత జన సంఖ్యకు వ్యాక్సిన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అనువుగా ముందస్తు ఆర్డర్లు ఇవ్వాలి.  
2. తమ వద్దకు రాబోయే వ్యాక్సిన్‌ నిల్వలను రాష్ట్రాల వారీగా పారదర్శక సూత్రాల ప్రకారం ఎలా అందించబోయేదీ ప్రభుత్వం ప్రకటించాలి. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం తన వద్ద 10% నిల్వలు ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అందించాలి.

3. కరోనాపై పోరాటంలో ముందుండే విభాగంలో ఎవరెవర్ని చేర్చాలన్న అంశంపై నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛను రాష్ట్రాలకివ్వాలి. దీంతో ఆయా వర్గాల్లోని 45 ఏళ్లలోపువారికీ టీకా అందించడానికి వీలవుతుంది.
4. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుగా భారత్‌ అవతరించింది. ఉత్పత్తి సామర్థ్యం ప్రైవేటు రంగం వద్దే అధికంగా ఉంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు తగిన విధంగా మద్దతిచ్చి తయారీ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోవడానికి చేయూతనందించాలి. నిర్బంధ లైసెన్సింగ్‌ నిబంధనలను ప్రయోగించాలి. దానివల్ల ఒకే లైసెన్సు కింద చాలా కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది.
5. దేశీయంగా టీకాల సరఫరా పరిమితంగానే ఉన్నందున యూరోపియన్‌ మెడికల్‌ ఏజెన్సీ, యూఎస్‌ఎఫ్‌డీఏ లాంటి విశ్వసనీయ సంస్థలు అనుమతిచ్చిన వ్యాక్సిన్లను దేశీయంగా అనుబంధ ప్రయోగాలు (బ్రిడ్జింగ్‌ ట్రయల్స్‌) లేకుండానే నేరుగా అనుమతివ్వాలి. పరిమిత కాలానికి ఈ మినహాయింపులు వర్తింపజేయాలి. వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచడమే కొవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో విజయానికి ముఖ్యం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు