close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పాత వేతనాలతోనే ట్రెజరీలకు బిల్లులు!

పీఆర్‌సీ ఫలాలు అందేందుకు మరికొంత సమయం?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ నెలకు పాత వేతనాలే అందనున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. వేతన సవరణ ఒప్పందం(పీఆర్‌సీ) ప్రయోజనాలు అందుకునేందుకు కొంత జాప్యం తప్పదని సమాచారం. 30 శాతం ఫిట్‌మెంట్‌తో మే 1న ఏప్రిల్‌ వేతనాలు అందుతాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పీఆర్‌సీ అమలుకు అనుగుణంగా మార్గదర్శకాల విడుదలలో జాప్యంతో ఈ నెలకు పాత వేతనాలే అందనున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలూ సోమవారం ఏప్రిల్‌ వేతనాలకు సంబంధించి బిల్లులను ట్రెజరీల్లో సమర్పించాయి. రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీ అమలుకు మార్గదర్శకాలు జారీ అయినా  కొత్త వేతనాలు నిర్ధారించడం  సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి పీఆర్‌సీ సిఫారసులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఒక నెల ఆలస్యంగా అందుకుంటారు. అవి కూడా అంతకుముందు నెల బకాయిలతో పాటు ఉంటాయని ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వేతనాలు, ఇతర అలవెన్స్‌లు, భత్యాల రూపేణా ప్రస్తుతం నెలకు చెల్లిస్తున్న మొత్తం కంటే పీఆర్‌సీ అమలుతో అదనంగా రూ.750 కోట్ల వరకూ వ్యయం పెరుగుతుందని వారి అంచనా. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మే  ఒకటిన అందే జీతమే కొత్త వేతనం అయ్యేందుకు అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పాత వేతనాలతోనే బిల్లులు సిద్ధమయ్యాయని వారు నిర్ధారించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు