నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదు
close

ప్రధానాంశాలు

నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదు

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌

ఈనాడు, దిల్లీ: నీళ్ల ద్వారా కరోనా వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. వైరస్‌ నీళ్లలో పడితే నీరుగారి పోతుందని.. అక్కడి నుంచి వ్యాపిస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన దిల్లీలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనాతో చనిపోయిన పలువురి మృతదేహాలను యమునా నదిలో పడేస్తుండటంతో ఆ నీటి నుంచి మహమ్మారి వ్యాపిస్తుందేమోనని ప్రజలు వ్యక్తం చేస్తున్న భయాందోళనల గురించి అడిగినప్పుడు ఆయన ఈమేరకు వివరించారు. ‘‘మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే ప్రధానంగా వైరస్‌ విస్తరిస్తుంది. గాలిలో వ్యాప్తిచెందే అంశం గాలివీచే దిశపై ఆధారపడి ఉంటుంది. గాలివాటు ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్‌ విస్తరిస్తుంది. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్‌ ఎక్కువ కేంద్రీకృతమవుతుంది. తలుపులు తెరిస్తే పడిపోతుంది. నీటి ద్వారా విస్తరిస్తుందన్న ఆందోళన అవసరం లేదు’’ అని తెలిపారు.

గట్టి చర్యలు చేపడితే.. మూడో వేవ్‌ ఉండకపోవచ్చు..
దేశంలో తప్పకుండా మూడో వేవ్‌ వస్తుందని ఇటీవల ప్రకటించిన విజయ రాఘవన్‌ శుక్రవారం కొంత భిన్నమైన ప్రకటన చేశారు. దేశంలో కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపడితే మూడో ఉద్ధృతి రాకపోవచ్చని పేర్కొన్నారు. స్థానికంగా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో చేపట్టే కట్టడి చర్యలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, సర్వైలెన్స్‌ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తే వ్యాధి లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ విస్తరించడాన్ని అరికట్టొచ్చని వివరించారు. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించే వారికి రక్షణ ఉంటుందన్నారు. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వ్యాపిస్తుందని హెచ్చరించారు.

పరిశీలించాకే ‘స్పుత్నిక్‌ లైట్‌’: వీకే పాల్‌
సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌ లైట్‌ టీకా సమర్థతను పరిశీలించిన తర్వాతే భారత్‌లో వినియోగానికి అనుమతిస్తామని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘ఒకే డోసు ద్వారానే కరోనాను ఎదుర్కోవచ్చని చెప్పడం ఉత్సాహానిస్తోంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా ఒకే డోసు వ్యాక్సినే. అలాంటివి అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్‌ వేగవంతమవుతుంది. శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన వీటి అనుమతులను పరిశీలిస్తాం’’ అని వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని