ఇంతటి విపత్తులో ఐఏఎస్‌లతో కమిటీనా?: High Court
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతటి విపత్తులో ఐఏఎస్‌లతో కమిటీనా?: High Court

అంత అత్యవసరం ఏమిటో తెలియదు
దేవరయాంజాల్‌ భూముల్లోకి బలవంతంగా వెళ్లొద్దు
ముందు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి
హైకోర్టు ఆదేశం

ఒకవైపు కొవిడ్‌ కరాళ నృత్యం. శవాల దహనానికి శ్మశానాల్లో చోటు దొరకని దుస్థితి. శుక్రవారం పొరుగింట్లో ఒకరు చనిపోతే శ్మశానవాటికలో రాత్రి 9 గంటలకు అదీ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ చొరవతో అవకాశం లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల, నల్గొండ, మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్లతోపాటు నలుగురు కీలక అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉంది. 1996 నుంచి ఉన్న ఆక్రమణలపై అంత హడావుడి ఎందుకో తెలియడంలేదు.

-జస్టిస్‌ వినోద్‌ కుమార్‌

 

ఈనాడు, హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌ గ్రామంలోని భూముల్లోకి బలవంతంగా వెళ్లడానికి వీల్లేదని విచారణ కమిటీని ఆదేశిస్తూ శనివారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో ఉన్నవారికి ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారు వివరణ ఇవ్వాలని సూచించింది. పిటిషనర్లు సహా మరెవరి భూముల్లోకి అనుమతి లేకుండా వెళ్లకూడదని, వారి హక్కుల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఈ భూములకు సంబంధించి మరిన్ని పిటిషన్‌లు దాఖలు కాకుండా అందరికీ ఇవే ఉత్తర్వులు వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వామి భూములపై విచారణకు ఈనెల 3న జారీ చేసిన జీవో 1014 చట్టబద్ధతపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయశాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన సదా సత్యనారాయణరెడ్డి మరో నలుగురు అత్యవసరంగా హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం జస్టిస్‌ వినోద్‌కుమార్‌ నివాసం నుంచి విచారణ చేపట్టారు.  పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి, ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపించారు.

న్యాయమూర్తి ప్రశ్నల పరంపర...
‘‘ఏ చట్టం కింద కమిటీని ఏర్పాటు చేశారు? ప్రాథమిక ఆధారాలు లేకుండా పిటిషనర్లను ఆక్రమణదారులుగా ఎలా నిర్ధారిస్తారు? 1996 నుంచి వివాదంలో ఉన్న ఈ భూములపై అంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముంది? గచ్చిబౌలిలోని రంగనాథస్వామి ఆలయ భూముల్లో 20 అడుగుల మేర తవ్వకాలు చేపట్టారు.. దాన్నెందుకు పట్టించుకోరు? దేవుడు తన భూములను తాను రక్షించుకోలేడు. అలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారాన్ని రక్షించుకునేవాడు. దేవుడికి కూడా ఒకరి రక్షణ అవసరమే. అయితే ఆలయ భూములన్నింటిపై విచారణ చేపట్టవచ్చుగా? కేవలం ఒక సీతారామచంద్రస్వామి భూములే ఎందుకు? 1925లో నిజాం ఆలయానికి భూములు కేటాయించడంతో దేవలయాంజాల్‌.. దేవరయాంజాల్‌ అయింది. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్‌లు, గ్రామ పటాలు, టిప్పన్‌లు, అద్దె ఒప్పందాలు, విక్రయ ఒప్పందాలు అన్నీ ఉంటాయి. వాటిని పరిశీలించవచ్చు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను సమర్పించాలని ఆదేశించవచ్చు. అలా కాకుండా 2న పత్రికలో వచ్చిన కథనంఆధారంగా 3న జీవో జారీ చేయడం, 4న విచారణ మొదలుకావడం చకచకా జరిగాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందుకింత అత్యవసరమో తెలియడంలేదు. పత్రికల్లో వచ్చిన వెంటనే స్పందించేట్లయితే హైకోర్టులో 2.31లక్షల కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉంటాయి’’ అని జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

చట్టవిరుద్ధంగా చొరబాటు
-సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి

‘‘1930 నుంచి ఆ భూములు మా అధీనంలో ఉన్నాయి. ఈ దశలో అధికారులు.. కమిటీ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి చొరబడ్డారు. ఈ భూములను ఖాళీ చేయాలంటూ అద్దెకున్నవారిని బెదిరించారు. కొవిడ్‌ నేపథ్యంలో జూన్‌ 30 వరకు కూల్చివేతలు, ఖాళీ చేయించడం వంటివి చేపట్టరాదంటూ హైకోర్టు ఫుల్‌బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వ చర్యలున్నాయి. మాకు సంబంధించిన 65 ఎకరాలపై హక్కులను దేవాదాయశాఖ నిరూపించుకున్నాకే ఆక్రమణదారులుగా ప్రకటించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. యథాతథ స్థితి కొనసాగించాలని 2019లో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో చట్టవిరుద్ధంగా ఈ కమిటీ చొరబడటమేగాకుండా ఆక్రమణదారులుగా గుర్తించడం ముందస్తుగా తీసుకున్న నిర్ణయమే. నోటీసులు ఇచ్చి చట్టప్రకారం వస్తే మాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వమే చట్ట ప్రక్రియను ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి న్యాయస్థానానికి వివరించారు.

ఇది ప్రాథమిక విచారణే
-ఏజీ బి.ఎస్‌.ప్రసాద్‌

‘‘కమిటీని ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఇది ప్రాథమిక విచారణే. కమిటీ నివేదిక కేవలం ప్రభుత్వ పరిశీలనకే. అందులో ఆక్రమణలని తేలితే నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్నాకే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆలయానికి చెందిన 1,392 ఎకరాల భూమిపై రిజిస్ట్రేషన్‌ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నిర్మాణాలు చేపట్టారు. హెచ్‌ఎండీయే పరిధిలో ఉన్న ఈ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులూ లేవు. ఆక్రమణదారులను గుర్తించడానికే ఈ కమిటీ. ప్రజలందరూ స్వచ్ఛందంగా విచారణకు హాజరై సహకరిస్తున్నారు. వాస్తవాలను తొక్కిపెట్టి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆలయ భూముల రక్షణకు కోర్టులు అండగా నిలవాలి’’ అని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ న్యాయస్థానాన్ని కోరారు.

కమిషన్‌ ఏర్పాటు చేయండి: సీపీఐ

ఈనాడు, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూములు, దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు భూములను ఎవరెవరు ఎంతెంత ఆక్రమించారో ప్రభుత్వం బహిర్గతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే భూ ఆక్రమణలపై న్యాయ విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములు, ఆయన భార్య పేరు మీద ఉన్న గోదాముల వ్యవహారం కేవలం వారికే పరిమితం కాలేదని ఇందులో ఇంకా అనేకమంది వ్యక్తులు, శక్తులు, రైతుల భాగస్వామ్యం ఉందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని