దేవరయాంజాల్‌లో నిలిచిన సర్వే
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవరయాంజాల్‌లో నిలిచిన సర్వే

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శామీర్‌పేట: హైదరాబాద్‌ నగర శివారులోని దేవరయాంజాల్‌ ఆలయ భూముల్లో ఐఏఎస్‌ అధికారుల కమిటీ విచారణ ఆగింది. శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలన సాగలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సర్వేను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ భూములపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు అధ్యక్షతన ఐఏఎస్‌ అధికారులు ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌, భారతిహొళికరి, శ్వేతామహంతితో ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. వారు ఆరు రోజులు విచారించారు. 8 మంది తహసీల్దార్లతో బృందాలు ఏర్పాటు చేసి ఆలయ భూముల్లోని కట్టడాల వివరాలు సేకరించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్న గోదాములతోపాటు ఇతర కట్టడాలను పరిశీలించి వివరాలు నమోదు చేశారు. అదే సమయంలో ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు సైతం ఆలయంతో పాటు తూంకుంట పురపాలక సంఘంలో రికార్డులు తనిఖీ చేసి, పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ఏమిటో..?
సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో 219 కట్టడాలు ఉన్నాయి. వీటిల్లో మూడింటికే హెచ్‌ఎండీఏ అనుమతి ఉంది. మిగిలిన 216 కట్టడాలకు అనుమతులు లేవు. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది. ఈ కట్టడాల ద్వారా ప్రస్తుతం తూంకుంట మున్సిపాలిటీకి ఏటా రూ.3.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవుతోంది. దాదాపుగా అవన్నీ గోదాముల తరహాలో నిర్మించినవే. బడా కంపెనీలు అద్దెకు తీసుకుని సరకులను నిల్వ ఉంచుతున్నాయి. వీటి క్రమబద్ధీకరణకు సర్కారు అవకాశం ఇస్తుందా.. లేదా మరేదైనా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి 2005-06 సమయంలో సీసీఎల్‌ఏ రఘోత్తమరావు అధ్యక్షతన నియమించిన కమిటీ పలుపరిష్కార మార్గాలు సూచించింది. దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరేలా భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవచ్చని సూచంచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎలాంటి తదుపరి చర్యలకూ ఉపక్రమించలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంగోదాముల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని