రాష్ట్రాలకు 1.92 కోట్ల డోసులు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాష్ట్రాలకు 1.92 కోట్ల డోసులు

ఈ నెల ద్వితీయార్ధానికి కేటాయింపు
20.51 లక్షల టీకాలకు  కోత వేసిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం మే 16 నుంచి 31 వరకూ మొత్తం 1.92 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు పంపనుంది. ఇందులో కొవిషీల్డ్‌ 1.62 కోట్లు కాగా, కొవాగ్జిన్‌ 29.49 లక్షలు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ పక్షం రోజుల్లో ఎప్పుడు ఎన్ని డోసులు సరఫరా చేసేదీ రాష్ట్రాలకు ముందస్తు షెడ్యూలు ఇస్తామని పేర్కొంది. సాధ్యమైనంత మేర వృథాను తగ్గించి వీటిని హేతుబద్ధంగా ఉపయోగించాలని కోరినట్లు తెలిపింది. రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవడానికి వీలుగా కేంద్రం పక్షానికోసారి కేటాయింపులు జరుపుతోంది. ఈ డోసులను కేవలం 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరోవైపు... రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా తయారీదారుల నుంచి మరో 4.39 కోట్ల డోసులను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
తొలిపక్షం కంటే తక్కువే...
మే తొలి 15 రోజుల్లో రాష్ట్రాలకు మొత్తం 2,12,50,000 టీకాలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అందులో 20.51 లక్షల మేర కోత పెట్టింది! ఇదివరకు 1.62 కోట్ల కొవిషీల్డ్‌, 50 లక్షల కొవాగ్జిన్‌ డోసులను కేటాయించగా, ఇప్పుడు కొవాగ్జిన్‌లో 20.51 లక్షల డోసులను తగ్గించింది. ఇందుకు కారణమేంటన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. ఇదివరకటి కంటే దీని కేటాయింపు 41.02% మేర తగ్గింది. ఆ మేరకు తన 50% వాటాలోని భాగాన్ని రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వదిలిపెట్టిందా? అన్నది కూడా తెలియరాలేదు. ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన సరళీకృత విధానం ప్రకారం... ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో సగం కేంద్రం కొనుగోలుచేసి రాష్ట్రాలకు ఇవ్వాలి. మిగిలిన సగంలో రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు చెరి 25% కొనుగోలు చేసుకోవాలి. ఈనెల కేటాయింపుల ప్రకారం... కేంద్రం రెండు విడతల్లో కలిపి రాష్ట్రాలకు 4,04,49,000 డోసులు ఇచ్చింది. రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు మరో 4.39 కోట్ల డోసులు కొనుగోలు చేశాయి. కేంద్రం ఇచ్చిన దానికంటే ఇవి 8.53% ఎక్కువ!
తెలుగు రాష్ట్రాలకూ కోత...
ఈనెల తొలి 15 రోజులకు కేంద్రం ఏపీకి 6,90,360 కొవిషీల్డ్‌, 2,27,490 కొవాగ్జిన్‌ డోసులు; తెలంగాణకు 6,28,760 కొవిషీల్డ్‌, 2,07,200 కొవాగ్జిన్‌ టీకాలు కేటాయించింది. ఈ పక్షం రోజులకు కొవిషీల్డ్‌ కోటా యథాతథంగానే ఉంది. కొవాగ్జిన్‌ కోటా 41% తగ్గినందున ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకూ వాటి పంపిణీలో కోతపడే అవకాశముంది.


18 రాష్ట్రాలకు కొవాగ్జిన్‌ సరఫరా చేశాం
  భారత్‌ బయోటెక్‌

దిల్లీ: తాము తయారుచేస్తున్న కొవాగ్జిన్‌ టీకా డోసులను గుజరాత్‌, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలతో పాటు... అత్యంత అవసరమున్న కేరళ, ఉత్తరాఖండ్‌లకు కూడా పంపామని దేశీయ ఔషధ దిగ్గజం భారత్‌ బయోటెక్‌ శుక్రవారం వెల్లడించింది. ‘‘గువాహటి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌లకు టీకాలు చేరుకుంటాయి. మా సిబ్బంది ఎంతో నిబద్ధతతో వీటి ఉత్పత్తి క్రతువులో పాల్గొన్నారు’’ అని భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.
దేశ రాజధానికి అదనపు డోసులను కేటాయించలేమని భారత్‌ బయోటెక్‌ చెప్పిందంటూ దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఇటీవల విమర్శించడంపైనా ఆమె స్పందించారు. తాము ఇప్పటికే 18 రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ పంపామని... టీకాల సరఫరా విషయంలో సంస్థ ఉద్దేశాల పట్ల కొన్ని రాష్ట్రాలు ఫిర్యాదు చేయడం బాధ కలిగించిందన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు