అరుణగ్రహంపై చైనా ముద్ర
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరుణగ్రహంపై చైనా ముద్ర

బీజింగ్‌: అంగారకుడి ఉపరితలంపై చైనా తొలిసారిగా తన ముద్ర వేసింది. ఆ గ్రహంపై విజయవంతంగా ఒక రోవర్‌ను దించింది. తద్వారా.. అమెరికా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా గుర్తింపు పొందింది. ఈ సంక్లిష్ట ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. తమ ఖగోళ పరిశోధనల్లో ఇదో ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కూడా చైనా శాస్త్రవేత్తలను అభినందించింది.
తియాన్‌వెన్‌-1 పేరిట ఒక వ్యోమనౌకను చైనా గత ఏడాది జులై 23న భూమి నుంచి ప్రయోగించింది. అందులో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉన్నాయి. తియాన్‌వెన్‌-1.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి అక్కడే తిరుగుతూ పరిశోధనలు సాగించింది. అందులోని ల్యాండర్‌, రోవర్‌ భాగాన్ని అంగారకుడి ఉపరితలంపై దించేందుకు శాస్త్రవేత్తలు శనివారం తెల్లవారుజామున సన్నాహాలు చేపట్టారు. వారు పంపిన సంకేతాలకు అనుగుణంగా తియాన్‌వెన్‌-1 నుంచి సదరు భాగం విడిపోయింది. గంటకు 20వేల కిలోమీటర్ల వేగంతో అంగారకుడి వాతావరణంలోకి ప్రవేశించింది. ఉష్ణకవచం, పారాచూట్‌, రాకెట్‌ సాయంతో క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. ఈ క్రమంలో ‘9 నిమిషాల భీతవహ పరిస్థితుల’ను ఎదుర్కొంది. అరుణగ్రహ ఉపరితలం నుంచి 100 మీటర్ల ఎత్తులో ఈ వ్యోమనౌక కొద్దిసేపు నిశ్చలంగా ఉండి నేలపై అవరోధాలు లేని ప్రాంతాన్ని చూసుకుంది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అంగారకుడి ఉత్తరార్ధ గోళంలోని ‘ఉటోపియా ప్లానిషియా’ అనే ప్రాంతంలో తన నాలుగు కాళ్ల సాయంతో దిగింది. ఈ ప్రక్రియ మొత్తం ముందుగా నిర్దేశించిన రీతిలో  కచ్చితత్వంతో సాగిందని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) అధిపతి ఝాంగ్‌ కెజియాంగ్‌ పేర్కొన్నారు. భూమికి 32 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అంగారకుడి వద్దకు సంకేతం చేరడానికి 17 నిమిషాలు పడుతుంది. అయితే ల్యాండింగ్‌ ప్రక్రియ మొత్తం 9 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అందువల్ల ఆర్బిటర్‌ నుంచి విడిపోయాక అంగారకుడిపై కాలుమోపే వరకూ ల్యాండింగ్‌ ప్రక్రియను ముందుగానే చేసిన ప్రోగ్రామ్‌ ఆధారంగా వ్యోమనౌక సొంతంగా చేపట్టింది. ఉపరితలంపై దిగాక రోవర్‌లోని నాలుగు సౌరఫలకాలు, యాంటెన్నా సొంతంగా విచ్చుకొని, భూమికి సంకేతం పంపడానికి గంట పట్టింది. 

మూడు నెలలపాటు పరిశోధన
ఆరు చక్రాలు కలిగిన ఈ రోవర్‌ పేరు ఝురాంగ్‌. ల్యాండర్‌ పైభాగంలో దీన్ని అమర్చారు. రోవర్‌ బరువు 240 కిలోలు. అందులో ఆరు పరిశోధన సాధనాలు ఉన్నాయి. త్వరలో ఈ రోవర్‌.. ల్యాండర్‌ నుంచి కిందకి దిగి, అంగారక ఉపరితలంపై కాలుమోపుతుంది. అక్కడ మూడు నెలలపాటు సంచరిస్తూ పరిశోధనలు సాగిస్తుంది. గంటకు 200 మీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. పైభాగంలోని కెమెరాలు.. పరిసరాలను ఫొటో తీస్తూ, రోవర్‌కు మార్గనిర్దేశం చేస్తాయి. 1960ల నుంచి అంగారకుడి వద్దకు వివిధ దేశాలు 40కిపైగా వ్యోమనౌకలను పంపాయి. అందులో సగమే విజయం సాధించాయి. అంగారకుడిపై ల్యాండింగ్‌ విషయంలో ఈ విజయాల రేటు తక్కువగా ఉంది. సదరు పరిజ్ఞానంపై ఇప్పటివరకూ అమెరికాకే పట్టు ఉంది. 1976లో ఆదేశం పంపిన వైకింగ్‌-2 వ్యోమనౌక కూడా ఉటోపియా ప్లానిషియా ప్రాంతంలోనే దిగింది. అంగారక కక్ష్యలోకి మాత్రం అమెరికాతోపాటు రష్యా, యూరోపియన్‌ యూనియన్‌, భారత్‌లు విజయవంతంగా ఉపగ్రహాలను పంపాయి. భవిష్యత్‌లో అరుణగ్రహ ఉపరితల నమూనాలను భూమికి రప్పించేందుకు ఒక వ్యోమనౌకను పంపాలని చైనా భావిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని