NIN: ముందుకు సాగని ‘సీరో సర్వే’!

ప్రధానాంశాలు

NIN: ముందుకు సాగని ‘సీరో సర్వే’!

నాలుగో దశపై లేఖ రాసిన ఎన్‌ఐఎన్‌
స్పందించని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కరోనా మూడో దశ కూడా వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడే నాలుగో దశ సీరో సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఈ సర్వే నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ మాత్రం స్పందించడం లేదు. టీకాలు తీసుకున్నాక పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్రం జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ద్వారా దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో మూడుసార్లు సీరో సర్వే చేయించింది. ఏయే జిల్లాల్లో ఎంతమేరకు ప్రజల్లో యాంటీబాడీలు వృద్ధి చెందాయన్న అంశం ఆధారంగా రెండో దశలో రాష్ట్రాలకు కేంద్రం జాగ్రత్తలు చెప్పింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, నల్గొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో మూడుసార్లు సర్వే నిర్వహించారు. హైదరాబాద్‌ మినహా మూడు జిల్లాల్లో గతేడాది మేలో సర్వే చేసినప్పుడు 0.5 శాతం మందిలోనే యాంటీబాడీలు ఉన్నాయని తేల్చారు. రెండోసారి ఆగస్టులో సర్వే చేపట్టినపుడు 7.5 శాతం, డిసెంబరులో నిర్వహించినపుడు 21.5 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందాయని ఎన్‌ఐఎన్‌ తేల్చింది. హైదరాబాద్‌లో మాత్రం 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది.

రెండు సార్లు లేఖ రాసినా..
రెండో దశలో రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో అనధికారిక లెక్కల ప్రకారం వేల మంది వైరస్‌ బారినపడ్డారు. అనేకమంది చనిపోయారు. గ్రామీణుల్లో యాంటీబాడీలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈసారి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పూర్తిస్థాయిలో సీరో సర్వే చేసి పరిస్థితిని అంచనా వేసి పూర్తి నివేదికను ఇవ్వడానికి ఎన్‌ఐఎన్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు మూడు నెలల కిందట రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది రక్తం సేకరించి.. దీని ఆధారంగా పక్షం రోజుల్లోనే నివేదిక ఇస్తామని పేర్కొంది. రెండు రోజుల కిందట మరోసారి లేఖ రాసింది. మొత్తం సర్వే ఖర్చు రూ.1.50 కోట్లకు మించదనీ పేర్కొన్నారు. ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని