మెట్ట ఇంట.. పల్లీ పంట..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెట్ట ఇంట.. పల్లీ పంట..

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో రూ.500 కోట్ల దిగుబడులు
వరికి బదులుగా వేరుసెనగ వేసి లాభాలు గడించిన అన్నదాతలు

ఈనాడు, నల్గొండ: ఒకప్పుడు ఆ ప్రాంతంలో కిలోమీటర్ల దూరం నడిచి వెళితే గాని గుక్కెడు మంచినీళ్లు దొరకని పరిస్థితి. కరవు, క్షామం నిత్యం పీడిస్తుండటంతో ఉపాధి కోసం హైదరాబాద్‌, మాచర్ల లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి. కాలం మారింది. వలస వెళ్లిన వారంతా ఊరిబాట పట్టారు. అందరూ వరి పంట పండిస్తుంటే వారు అందుకు ప్రత్యామ్నాయంగా వేరుసెనగ సాగుపై దృష్టి పెట్టారు. కాలం కలిసొచ్చి భూగర్భ జలాలు పెరగడం, లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా ఊళ్లకు చేరడంతో కూలీల కొరత సైతం తగ్గింది. మేలు రకం విత్తనాలను సాగు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరాకు గరిష్ఠంగా 16 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయి. ఇదంతా నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్‌లో వేరుసెనగ సాగు చేసి లాభాలు గడించిన గిరిజన రైతుల కథ.

తుంపర సేద్యంతో
కృష్ణా నదికి సమీపంగా.. నల్లమలను ఆనుకొని ఉన్న చందంపేట, నేరేడుగొమ్ము, డిండి మండలాల్లోని దాదాపు 20 గ్రామాల రైతులు ఇటీవల యాసంగిలో దాదాపు 35 వేలకు పైగా ఎకరాల్లో వేరుసెనగ సాగు చేశారు.
ఎగువన ఉన్న డిండి ప్రాజెక్టు గత ఏడేళ్లలోనే తొలిసారిగా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకొని 20 రోజుల పాటు అలుగుపోయడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులు నీటిని వృథా చేయకుండా బోర్లకు స్ప్రింకర్లను బిగించి వాటి ద్వారా వేరుసెనగకు నీళ్లు పెట్టారు. ఒక్కో ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు మార్కెట్లో పంటకు మంచి ధర ఉండటంతో రూ.లక్షకు పైగా ఆదాయం వచ్చింది. ఇక్కడ పండించిన పంటను ఒకప్పుడు రైతులు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో విక్రయించేవారు. పంట నాణ్యంగా ఉండటంతో వ్యాపారులు ఇక్కడకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వేరుసెనగ ధర క్వింటాకు గరిష్ఠంగా రూ.8,500 వరకు ఉంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పంటను సాగుచేసి కొనుగోళ్లకు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం వేరుసెనగను సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.40 వేల వరకు లాభాలు గడించారు. మొత్తం ఇక్కడ ఆరులక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అంచనా. ప్రస్తుత ధరల ప్రకారం దీని విలువ రూ.500 కోట్లపైనే. ప్రభుత్వం సైతం వరి పంటను మానేసి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పదే పదే సూచిస్తున్న నేపథ్యంలో ఇక్కడి రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం వీరికి ప్రోత్సాహం ఇస్తే మరిన్ని దిగుబడులు సాధించే అవకాశం ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు