మనోహరంగా మానేరు తీరం
close

ప్రధానాంశాలు

మనోహరంగా మానేరు తీరం

ఇతర పర్యాటక ప్రాజెక్టులకంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌లోని దిగువ మానేరు తీర ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాజెక్టుల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలని.. పర్యాటకంగా రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇప్పటికే రూ.300 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. దీని నిర్వహణకు ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు. భూసేకరణ వంటి అంశాల్లో మరింత వేగం పెంచాలన్నారు. మానేరు నదీతీర అభివృద్ధి (రివర్‌ డెవలప్‌మెంట్‌ ఫ్రంట్‌) ప్రాజెక్టుపై బీసీ సంక్షేమ, పర్యాటక శాఖల మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌లతోపాటు కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన శనివారమిక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే మానేరు రివర్‌ ఫ్రంట్‌కు అవకాశం లభించింది. కేవలం సాగునీరు మాత్రమే కాకుండా పర్యాటకం వంటి రంగాల్లోనూ ప్రగతి సాధించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా సీఎం ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టు పూర్తయ్యాక హైదరాబాద్‌, వరంగల్‌, జిల్లాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ టవర్‌ ద్వారా కరీంనగర్‌కు కంపెనీలను తరలించే ప్రయత్నం చేస్తున్నాం. రివర్‌ ఫ్రంట్‌ పూర్తయ్యాక నగరం మరింతగా అభివృద్ధి చెందుతుంది’’ అని చెప్పారు.
త్వరలో టెండర్లు: గంగుల
సీఎం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేకమైన అభిమానంతో ప్రపంచస్థాయి ప్రాజెక్టును మంజూరు చేశారని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా త్వరలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. ‘‘మానేరు నదిలో అంతర్భాగమైన నాలుగు చెక్‌ డ్యాంల నిర్మాణం పూర్తైంది. కేబుల్‌ బ్రిడ్జి పనులు చివరిదశలో ఉన్నాయి’’ అని గంగుల వెల్లడించారు. మానేరు ప్రాజెక్టుతో రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త కాంతులు వస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. త్వరగా పూర్తి చేసేందుకు తమ శాఖపరంగా అవసరమైన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని