వేల మంది పెట్టిన పుత్రభిక్ష ఇది
close

ప్రధానాంశాలు

వేల మంది పెట్టిన పుత్రభిక్ష ఇది

రూ.22 కోట్లు అనగానే.. కాళ్ల కింద భూమి కదిలింది!
మా బిడ్డ ఇంటికొస్తాడని అనుకోలేదు
దాతల స్పందన చూసి ద్రవించిపోయాం
‘ఈనాడు’తో అయాన్ష్‌ గుప్తా తల్లిదండ్రులు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పుట్టుకతోనే అరుదైన వ్యాధి... మూడేళ్లు వచ్చినా, సరిగా నిలుచోలేడు. కూర్చోలేడు. ఏమీ తినలేడు. క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇదీ హైదరాబాద్‌కు చెందిన బాలుడు అయాన్ష్‌ గుప్తా పరిస్థితి. కుమారుడి పరిస్థితి చూసి రెండేళ్లపాటు ఆ తల్లిదండ్రులు ఎంతో యాతన అనుభవించారు. చికిత్సకు ఏకంగా రూ.22 కోట్లు సమకూర్చుకునేందుకు వారు పడిన మనోవేదన అంతా ఇంతా కాదు. శనివారం సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రి నుంచి బాధిత బాలుడు అయాన్ష్‌గుప్తాను డిశ్చార్జి చేయించి, ఇంటికి తీసుకెళ్లే సమయంలో ఆ ఉద్విగ్న భావాల్ని తల్లిదండ్రులు యోగేష్‌ గుప్తా, రూపాల్‌ ‘ఈనాడు’తో పంచుకున్నారు.
బతకడేమో అని భయమేసింది..
‘బాబుకు ఎస్‌ఎంఏ (స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ) ఉందని, దానికి అవసరమైన ఇంజక్షన్‌ ఇతర దేశాల నుంచి రప్పించడానికి రూ.22 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో మా కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ఎంత కష్టమైనా బాబును బతికించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాం. కార్పొరేట్‌ సంస్థలు, ప్రముఖుల్ని సంప్రదించాం. ఇంపాక్ట్‌గురు వెబ్‌సైట్‌ గురించి తెలిసి ఆ వేదిక ద్వారా దాతలకు విజ్ఞప్తి చేశాం. అది విస్తృతంగా జనంలోకి వెళ్లింది. మా వేదన చూసి మొత్తం 62,450 మంది స్పందించారు. అలా దాదాపు వంద రోజుల్లోనే మాకు కావాల్సిన మొత్తం వచ్చేసింది. ఇంజక్షన్‌పై దిగుమతి సుంకాన్ని తొలగించడంతో రూ.6 కోట్ల దాకా కలిసొచ్చింది. ఇలా ఏ సంబంధం లేకున్నా మా కోసం వేలమంది అండగా నిలబడినందుకు హృదయం ద్రవించి ఏడ్చేసిన రోజులున్నాయి. రెండేళ్ల తర్వాత బాబు జీవితంపై మాకు ఆశలు చిగురించాయి. వైద్యుల సాయంతో తను పూర్తిగా కోలుకునే దశకు చేరుకున్నాడు. ఇంకో నెలలో మామూలు స్థితికి వస్తాడని వైద్యులు చెప్పారు. ఇది అయాన్ష్‌కి వేల మంది ప్రాణబంధువులిచ్చిన పునర్జన్మ. మాకు పుత్రభిక్ష’ అని వారు భావోద్వేగంతో చెప్పారు.

ప్రముఖులూ కదిలొచ్చారు..
బాబును కాపాడేందుకు మొదలైన యజ్ఞంలో దేశ, విదేశాల్లో ఉన్న పలువురు ప్రముఖులూ పాలుపంచుకున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవగణ్‌, అనిల్‌కపూర్‌, శ్రద్ధాకపూర్‌, ఆలియాభట్‌, కార్తీక్‌ ఆర్యన్‌, సారా అలీఖాన్‌, అర్జున్‌ కపూర్‌, అనురాగ్‌ బసు, పలు నిర్మాణ సంస్థలతో పాటు భారత యువ క్రికెటర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, దినేశ్‌ కార్తీక్‌, వాషింగ్టన్‌ సుందర్‌, భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇంపాక్ట్‌ గురు వేదికపై తమవంతు సాయమందించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రచారం నిర్వహించారు.
దేశంలో వందల మంది ఎస్‌ఎంఏ బాధితులు
దేశవ్యాప్తంగా అరుదైన జన్యు వ్యాధి ఎస్‌ఎంఏతో వందల మంది చిన్నారులు బాధపడుతున్నారని రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ రమేశ్‌ కోణంకి తెలిపారు. అయాన్ష్‌ డిశ్చార్జి సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల కిందటి వరకు ఈ జబ్బుకు చికిత్స లేదని.. శాస్త్రసాంకేతిక రంగం అభివృద్ధితో విదేశాల్లో దీనికి మందులొచ్చాయని చెప్పారు. గత పది నెలల వ్యవధిలో ముగ్గురు చిన్నారులకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. సహజ జన్యువుల రూపాన్ని కృత్రిమ పద్ధతిలో మార్చడమే ఈ చికిత్స విధానమని వెల్లడించారు. సమావేశంలో ఇంపాక్ట్‌గురు వైస్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ త్రిపాఠి పాల్గొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని