పక్షం రోజులకో గ్రామంలో సర్వే
close

ప్రధానాంశాలు

పక్షం రోజులకో గ్రామంలో సర్వే

అధునాతన సాంకేతికతతో పక్కాగా ఫలితాలు
డిజిటల్‌ విధానంలో వేగంగా పూర్తి
రెండు, మూడు రోజుల్లో సంస్థల ఎంపిక!

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల సర్వేను పక్షం రోజులకో గ్రామంలో పూర్తి చేయొచ్చని పలు సంస్థలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాయి. 1500 నుంచి 2000 ఎకరాల విస్తీర్ణంలో భూములున్న గ్రామంలో సర్వేకు సగటున 15 రోజులు పట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. వెయ్యి ఎకరాల్లోపు విస్తీర్ణం ఉండే గ్రామాల్లో పది రోజుల్లోపే సర్వే పూర్తి కానుంది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలుత 27 గ్రామాల్లో పైలట్‌ సర్వే నిర్వహణకు భూమి కొలతలు-దస్త్రాల నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

టెక్నాలజీతోనే కచ్చితత్వం
సరిహద్దులు మారకుండా.. కచ్చితత్వం, పారదర్శకతతో సర్వే నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూ వివాదాలూ సమసిపోతాయని భావిస్తోంది. ప్రైవేటు సంస్థలకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఒక్కో సంస్థ సమర్థత ఆధారంగా పైలట్‌ సర్వేలో రెండు లేదా మూడు గ్రామాలు అప్పగిస్తారు. వాటి ఫలితాల ఆధారంగా పూర్తిస్థాయి సర్వేలో పెద్దపీట వేయనున్నారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఉపగ్రహ చిత్రాలు సహా భూముల మ్యాపింగ్‌, విస్తీర్ణాలను ఏమాత్రం తేడా లేకుండా కొలవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీనికోసం డీజీపీఎస్‌, లైడార్‌, డ్రోన్‌, శాటిలైట్‌ ఇమేజింగ్‌ సిస్టం తదితర సాంకేతిక విధానాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న అమెరికా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు ఇప్పటికే దక్షిణ భారతదేశంలో సాంకేతికతతో కూడిన సర్వే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దిల్లీ, ముంబయితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు స్వదేశీ సంస్థలూ ఈ రంగంలో ఉన్నాయి.

పైలట్‌ సర్వేపై 30 సంస్థల ఆసక్తి
రాష్ట్రంలోని 27 గ్రామాల్లో పైలట్‌ సర్వే నిర్వహించేందుకు భూమి కొలతలు- భూ దస్త్రాల నిర్వహణ సంస్థ ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించింది. 30 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ చేస్తూ దరఖాస్తు చేసుకున్నాయి. బిడ్లను అధికారులు సోమవారం తెరిచారు. ఆయా సంస్థల సమర్థతను అంచనా వేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీకి నివేదిక అందించనున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు అర్హులైన సంస్థలను ఎంపిక చేయనున్నారు. దీనికి మూడు రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంత్రులు, కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు సూచించిన గ్రామాలను పైలట్‌ సర్వేలో తీసుకుంటారు. మొదట జిల్లాకు అయిదు గ్రామాల చొప్పున ప్రభుత్వానికి కలెక్టర్లు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఆయా గ్రామాల్లో పరిస్థితులను అంచనా వేసి ఒక్కోటి చొప్పున ఎంపిక చేయనున్నారు.

వేగంగా పూర్తి చేయడమే లక్ష్యం

సర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేసి రైతులకు డిజిటల్‌ ఫలితాలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయితో పోల్చితే డిజిటల్‌ సర్వేతో అయిదు రెట్లు వేగంగా ప్రక్రియ పూర్తవుతుందని అంచనాలున్నాయి. భూమి రకాన్ని బట్టి సర్వే విధానాన్ని మార్చుకునేందుకూ వీలుంది. పల్లం, కొండలున్న ప్రాంతాల్లో డ్రోన్‌ లేదా లైడార్‌ సర్వేతో వేగం, కచ్చితత్వంతో కొలతలు వస్తాయని అంచనా.
* ఒక్కో బృందంలో 15-30 మంది నిపుణులు, వాలంటీర్లు అవసరం. సాంకేతిక పద్ధతిలో సర్వేకు మానవ వనరుల అవసరం తక్కువగా ఉంటుంది.
* భూముల విలువ అధికంగా ఉన్నచోట కొలతల్లో అడుగు తేడా వచ్చినా భూ యజమానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్వే సంస్థలు కచ్చితత్వంతో కూడిన కొలతలు వేస్తాయి.
* ఉపగ్రహ అనుసంధానం (జియో ట్యాగింగ్‌)తో కొలతలను నిర్ణయించడం వల్ల హద్దులు మార్చే వీలుండదు.
* ఒక్కసారి డిజిటల్‌ సర్వే పూర్తయితే ఆ సమాచారాన్ని అనేక రకాలుగా వినియోగించుకోవడానికి వీలుంటుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని