గ్రామీణ ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు
close

ప్రధానాంశాలు

గ్రామీణ ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు

సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు వర్తింపు
క్యాజువల్‌ లేబర్‌ రోజువారీ వేతనం రూ.390
హోంగార్డులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలకు పెరిగింది 30 శాతం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందం(పీఆర్‌సీ) అమలు నేపథ్యంలో ఒప్పంద(కాంట్రాక్ట్‌), పొరుగుసేవల(అవుట్‌ సోర్సింగ్‌) ఉద్యోగుల వేతనాలను 30 శాతం పెంచుతూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీలు, సర్పంచుల గౌరవవేతనాలనూ పెంచింది.
కనీస వేతన సవరింపులతో...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని క్యాజువల్‌ లేబర్‌, డైలీ వేజ్‌ వర్కర్లు సహా కంటింజెంట్‌ వర్కర్లు, కన్సాలిడేటెడ్‌ వర్కర్ల కనీస వేతనాన్ని సవరిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. క్యాజువల్‌ లేబర్‌, డైలీవేజ్‌ వర్కర్లకు రోజుకు రూ.390 (గతంలో రూ.300), పూర్తిస్థాయి కంటింజెంట్‌ వర్కర్లు, కన్సాలిడేటెడ్‌ పే వర్కర్లకు నెలకు రూ.10,400, (గతంలో రూ.8000), పార్ట్‌టైం వర్కర్లకు నెలకు రూ.5,200 (గతంలో రూ.4000)గా నిర్ణయించారు. సవరించిన వేతనాలు 2021 జూన్‌ నుంచి అమలుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గత వేతనాలకు గరిష్ఠంగా 30 శాతం పెరుగుదల
వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను మూడు రకాలుగా విభజించి వేతనాలు నిర్ణయించారు. మొదటి కేటగిరీ ఉద్యోగులకు రూ.15,600, రెండో కేటగిరీకి రూ.19,500, మూడో కేటగిరీ ఉద్యోగులకు రూ.22,750ను నిర్ణయిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తాజాగా వీటికి సంబంధించి స్పష్టతనిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మూడు కేటగిరీల ఉద్యోగులకు గత వేతనాలకు గరిష్ఠంగా 30 శాతం పెంపుతో కొత్త వేతనాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది. తాజాగా నిర్ణయించిన వేతనాలు, పాత వేతనాల్లో 30శాతం పెరుగుదల.. ఈ రెంటిలో ఏదీ తక్కువగా ఉంటే దాన్ని అమలు చేయాలని ఆదేశించింది.
గౌరవ వేతనాలు కూడా..
రాష్ట్రంలో గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న వారి వేతనాలను 30 శాతం పెంచుతూ  ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ సహాయకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ), వీఓఏలు, ఆశావర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల గౌరవ వేతనాలు 30 శాతం పెరగనున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని