దేశభక్తికి స్ఫూర్తిదాత కర్నల్‌ సంతోష్‌
close

ప్రధానాంశాలు

దేశభక్తికి స్ఫూర్తిదాత కర్నల్‌ సంతోష్‌

విగ్రహావిష్కరణ సందర్భంగా మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌-నల్గొండ, సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: శాసనసభ్యుడిగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, మహావీర చక్ర సంతోష్‌బాబు అమరత్వం శాశ్వతంగా గుర్తుండేలా చేపట్టిన ఈ కార్యక్రమానికి హాజరవడం సంతృప్తినిచ్చిందని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సంతోష్‌బాబు 9.6 అడుగుల విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటుచేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, కర్నల్‌ కుటుంబ సభ్యుల నడుమ మంగళవారం కేటీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమీకృత కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దేశభక్తికి కర్నల్‌ సంతోష్‌బాబు స్ఫూర్తిదాతగా నిలిచారని, దానిని చాటిచెప్పేలా విగ్రహాన్ని రూపొందించారని కొనియాడారు. కర్నల్‌ వీరమరణం తర్వాత తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కృషి వల్లే ఆ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరిగిందన్నారు. వీర సైనికుల కుటుంబాలకు భారతీయులు అండగా ఉంటారన్న ఆలోచనను ఇతర రాష్ట్రాల కంటే గొప్పగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేశారని కేటీఆర్‌ పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించడం అందరికీ సాధ్యం కాదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భర్త మరణంతో తీవ్రంగా కుంగిపోయిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన భరోసా తమకు మనోధైర్యం కల్పించిందని కర్నల్‌ సతీమణి సంతోషి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం రూ.5 కోట్లు, ఉద్యోగంతోపాటు, ఇంటి స్థలం ఇచ్చి ఆదుకోవడం మరువలేమన్నారు. విగ్రహ రూపశిల్పి ఆత్మకూర్‌(ఎస్‌) మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డిని మంత్రులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, గాదరి కిశోర్‌, నోముల భగత్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ పాల్గొన్నారు.

ఇది ప్రొటోకాల్‌ ఉల్లంఘనే: ఎంపీ కోమటిరెడ్డి
 

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సూర్యాపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కర్నల్‌ సంతోశ్‌బాబు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్థానిక ఎంపీనైన తనను పిలవకపోవడం పట్ల కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రతిపక్ష పార్టీకి చెందిన తనను పిలవలేదని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్‌ ఉల్లంఘనే అని మండిపడ్డారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని