మన్యంలో ఎదురుకాల్పులు
close

ప్రధానాంశాలు

మన్యంలో ఎదురుకాల్పులు

విశాఖ జిల్లాలో తుపాకుల మోత
ఆరుగురు మావోయిస్టుల మృతి
మృతుల్లో ఇద్దరు డీసీఎంలు, ముగ్గురు మహిళలు
తప్పించుకున్న అగ్రనేతలు అరుణ, జగన్‌, ఉదయ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విశాఖ మన్యం మళ్లీ ఎరుపెక్కింది. తుపాకుల మోతలతో దద్దరిల్లింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు డివిజనల్‌ కమిటీ సభ్యులు, ముగ్గురు మహిళలున్నారు. మరో మహిళా మావోయిస్టు ఎవరన్నది ఇంకా గుర్తించాలి. ఈ ఘటనలో అగ్రనేతలు అరుణ, ఉదయ్‌, జగన్‌ తప్పించుకున్నట్లు సమాచారం.
ఎదురు కాల్పుల్లో డివిజనల్‌ కమిటీ సభ్యుల క్యాడర్‌లో ఉన్న పెద్దపల్లి జిల్లాకు చెందిన సందె గంగయ్య అలియాస్‌ డాక్టర్‌ అశోక్‌, రణదేవ్‌ అలియాస్‌ అర్జున్‌ మృతి చెందారు.  ఆయనతో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతునాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు. మరో మహిళ వివరాలు తెలియలేదు.

పక్కా సమాచారంతో దాడి
కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్‌ పరిధిలోని యు.చీడిపల్లి పంచాయతీ తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్‌ చేస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలు అప్రమత్తమై మంగళవారం రాత్రే అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక.. అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 9.30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో ఏకే-47, కార్బన్‌, .303 రైఫిల్‌, తపంచా, ఎస్‌బీబీఎల్‌ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అగ్రనేతలను కాపాడబోయి..
తీగలమెట్ట అడవిలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టుల్లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు అరుణ, ఉదయ్‌, జగన్‌ మరికొందరు అగ్రనేతలున్నట్లు నిఘావర్గాల సమాచారం. ఎదురుకాల్పులు మొదలవగానే వీరిని సురక్షితంగా అడవిని దాటించే క్రమంలో రక్షణగా నిలిచిన మావోయిస్టులు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన మహిళా మావోయిస్టుల్లో ఇద్దరు అరుణ అంగరక్షకులై ఉండొచ్చని సమాచారం.
డాక్టర్‌ అశోక్‌ అందుకే వచ్చారా?
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన గంగయ్య గోదావరిఖనిలోని సింగరేణి పాఠశాలలో 7వ తరగతి వరకు చదివాడు. అయినా పార్టీ వైద్యబృందంలో ఆయనది కీలక పాత్ర. ఆయన్ను డాక్టర్‌ అశోక్‌ అని పిలుస్తారు. మావోయిస్టు ముఖ్యనేతలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే చికిత్స కోసం డాక్టర్‌ అశోక్‌ను తీసుకొస్తారు. మావోయిస్టులు కొవిడ్‌ బారిన పడ్డారా? వారికి చికిత్స అందించడానికే ఆయన వచ్చారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గంగయ్య అన్న రాజయ్య 1996లో ఓదెలగుట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. మరో అన్న సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌ 2007లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. రాజమౌళి ఉత్తర తెలంగాణ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ దండకారణ్య రీజియన్‌లో కీలక నేతగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర మిలిటరీ కమిషన్‌ సభ్యుడిగా పనిచేశారు. అలిపిరి వద్ద 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడికి రాజమౌళి ప్రణాళిక రచించినట్లు పోలీస్‌ రికార్డులు పేర్కొంటున్నాయి. ఒకే గ్రామానికి, కుటుంబానికి చెందిన ముగ్గురు మావోయిస్టు నేతలు వివిధ సందర్భాల్లో చనిపోయారు.

 

తల్లడిల్లిన తల్లి గుండె

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి, న్యూస్‌టుడే, ఓదెల: విశాఖ జిల్లా ఎన్‌కౌంటర్‌లో సందె గంగయ్య అలియాస్‌ అశోక్‌ మృతి వార్త తెలుసుకుని ఆయన తల్లి అమృతమ్మ తల్లడిల్లిపోయారు. బీపీతో బాధపడుతున్న అమృతమ్మ.. తమ ఇంటివద్ద గుమిగూడిన జనాన్ని చూసి కీడు శంకించారు. అంతలోనే చిన్న కొడుకు మహేందర్‌ భోరున విలపించారు. తమకు కనీసం అధికారులు, పోలీసులు సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మీడియా వారు చెప్పేవరకూ తెలియదన్నారు. గంగయ్య తలపై రూ.5 లక్షల రివార్డు ఉంది. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్‌ పార్టీకి ఆకర్షితుడై ఉద్యమం బాట పట్టాడు.

 Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని