బకాయిపడిన సంక్షేమం
close

ప్రధానాంశాలు

బకాయిపడిన సంక్షేమం

బోధన రుసుములు, ఉపకార వేతనాల మంజూరులో జాప్యం

సంక్షేమశాఖ చెల్లించాల్సిన మొత్తం రూ.3,816 కోట్లకు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధన రుసుములు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఉపకార వేతనాల మంజూరు నెమ్మదించింది. 2019-20, 2020-21 విద్యాసంవత్సరాలకు సంబంధించిన బకాయిలు రూ.3,816 కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఆపై స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థులు దాదాపు 12.5 లక్షల మంది ఏటా ఉపకార వేతనాలు, బోధన ఫీజులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ఫీజుల డిమాండ్‌ రూ.2300 కోట్లుగా ఉంటోంది. ప్రభుత్వం ఏటా గడిచిన విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుములను తదుపరి ఏడాది చెల్లిస్తోంది. ఈ లెక్కన 2019-20 బకాయిలన్నీ 2021 మార్చి 31లోగా చెల్లించాలి. మార్చి 31నాటికి దాదాపు రూ.1500 కోట్ల నిధులు చెల్లించేందుకు టోకెన్లు జారీ చేసినా, కరోనా కారణంగా నిధుల్లేక ఆర్థిక సంవత్సరం ముగియడంతో అవన్నీ రద్దయ్యాయి. 2019-20 ఏడాదికి రూ.784 కోట్ల చెల్లింపులు జరగ్గా.. ఇంకా రూ.1516 కోట్లు బకాయిలున్నాయి. 2020-21కి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారం దాదాపు ముగిసింది. ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికోసం ఈనెలాఖరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. 2019-20కి సంబంధించి నిధులు భారీగా బకాయిలు ఉండటంతో 2020-21 ఏడాదికి పరిష్కారమైన దరఖాస్తుల నిధుల విడుదలకు ఆమోదం తెలపలేదు. ఫీజుల బకాయిల్లో బీసీ సంక్షేమశాఖ విద్యార్థుల వాటా ఎక్కువగా ఉంది. వీరి బకాయిలు పూర్తిగా చెల్లించేందుకు రూ.2 వేల కోట్లు అవసరమని అంచనా. ఎస్సీ, ఎస్టీలకు 2019-20కి బోధన ఫీజులు పూర్తిగా చెల్లించలేదు. 2020-21 ఏడాదికి ఉపకార వేతనాలూ ఇవ్వలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని