దుర్భర విధులు.. అరకొర జీతాలు

ప్రధానాంశాలు

దుర్భర విధులు.. అరకొర జీతాలు

ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల దీనావస్థ

ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా ఆదరణ కరవు

చాలీచాలని ఆదాయంతో నిత్యం వెతలు

అయితరాజు రంగారావు

ఈనాడు - హైదరాబాద్‌

ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం సోకి మంచాన పడితే సొంత మనుషులే సేవ చేయలేని రోజులివి... అన్నీ మంచంమీదే చేయాల్సి వస్తే ఆ యాతన మరింత దుర్భరం. అలాంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగుజీవులు వారు. బతుకుతెరువు కోసం దుర్భరమైన... క్లిష్టమైన వృత్తిలో కొనసాగుతున్నారు. వారికి ఇచ్చే వేతనాలు అరకొర. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, రోగుల సంరక్షకుల దుస్థితి ఇది.

రోగులకు అమ్మలా అన్నం తినిపిస్తారు. వేళకు మందులిస్తారు. దగ్గరుండి బాత్రూమ్‌కు తీసుకెళ్తారు. రోగులు వాంతులు, మలమూత్రాదులు చేస్తే.. శుభ్రం చేయాల్సిందీ వారే. వ్యాధులు సోకకుండా ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలి. వాడి పడేసిన సిరంజిలు, ఇంజక్షన్లు తదితర ప్రమాదకరమైన బయోవ్యర్థాలను బయటకు తరలించాలి. ఇలా నెలలో 30 రోజులూ గైర్హాజరీ లేకుండా పనిచేస్తే, వీరికిచ్చే వేతనం కోతలు పోనూ కేవలం రూ.8400.. అంతకంటే తక్కువే. ఈ తరహాలోనే పారిశుద్ధ్య సేవలందిస్తున్న నిమ్స్‌, కేంద్ర ఆరోగ్య సంస్థలు, జీహెచ్‌ఎంసీ కార్మికులకు కాస్త మెరుగైన వేతనాలు అందుతుండగా.. రాష్ట్ర సర్కారు దవాఖానాల్లో పని చేస్తున్న వారికి మాత్రం అందులో సగం జీతాలే దక్కుతున్నాయి. కొవిడ్‌ కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నా, కనీస వేతనాలు దక్కని దీనావస్థ వారిది. కష్టాల కడలిలో చాలీచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా పదివేలమందికి పైగా ఉన్నారు. వారి జీవన పోరాటంపై ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.


బక్కచిక్కిన లెక్కలు

పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది సేవలకు 2017లో టెండర్లు పిలిచినప్పుడు.. 100 పడకలకు 42 మంది చొప్పున ఉండాలని లెక్కగట్టారు. ఒక్కో పడకకు నెలకు రూ.8 వేల చొప్పున చెల్లించాలని ప్రణాళిక రూపొందించారు. తర్వాత వేర్వేరు కారణాల వల్ల ఒక్కో పడకకు నెలకు రూ.5,016 చొప్పున నిర్ణయించారు. ఇందులోనే పారిశుద్ధ్య, భద్రతా కార్మికుల వేతనాలు, శుభ్రపర్చే రసాయనాలు, వినియోగించే ఇతర వస్తువులు, కీటక నాశన ప్రక్రియలు అన్నీ భరించాలి. టెండరు పోటీలో భాగంగా అది రూ.4,575కే ఖరారైంది. ఆ ప్రభావం కార్మికుల నియామకంపై పడింది. 100 మంది ఉండాల్సిన చోట 60-70 మందితోనే పనిచేయించాల్సిన పరిస్థితి. కనీస వేతనం ఖరారు కాకపోవడంతో గుత్తేదారు తనకు ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్మునే సర్దుబాటు చేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య, రోగుల సంరక్షక సిబ్బందికి నెలకు రూ.9225, భద్రతా సిబ్బందికి రూ.9555 చొప్పున చెల్లిస్తున్నారు.


శ్రమ దోపిడీ

గాంధీ ఆసుపత్రిలో 1060 పడకలకు 103 మంది భద్రతా సిబ్బంది, 103 మంది సంరక్షకులు, 185 మంది పారిశుద్ధ్య సిబ్బంది అవసరమని లెక్కగట్టారు. అదే తీరున ఉస్మానియాలోనూ 1100 పడకలకు టెండరు పిలిచారు. వాస్తవానికి రెండుచోట్లా 2000కు పైగా పడకలను నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి ఆసుపత్రిలో 350 పడకలకు మంజూరు ఉంటే, 600 మంది రోగులకు సేవలందిస్తున్నారు. కానీ టెండరులో ఆమోదం పొందిన పడకలకే ప్రభుత్వం నిధులిస్తుంది. రెట్టింపు పడకలకు ఈ సిబ్బంది సేవలందించాల్సి వస్తోంది.


ఆరోగ్యశాఖ నివేదిక ఏం చెబుతోంది?

గతంలో ముఖ్యమంత్రే చొరవ తీసుకుని... ఒక్కో పడకకు ఒక కార్మికుడి చొప్పున పనిచేయాలని సూచనలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చిన నివేదికలో ఆరోగ్యశాఖ గుర్తుచేసింది. కనీస వేతనాలివ్వాల్సి ఉన్నందున ఒక్కో పడకకు వ్యయం నెలకు రూ.12,021కి పెంచాలని కోరింది. ఇందుకోసం ఏటా వ్యయం రూ.276 కోట్లు అవుతుందని తెలిపింది. అన్ని ఆసుపత్రులకూ ఒకే టెండరు పిలవకూడదని, అన్నిటికీ ఒక్కరే టెండరు పొంది నిర్వహించడం కష్టమని పేర్కొంది.


పీజీ చేసి పారిశుద్ధ్య సేవల్లో..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం బయ్యారం గ్రామానికి చెందిన ఎన్‌.సాయికృష్ణ (26) ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఉపాధి కోసం గాంధీలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరారు. నెలకు వేతనంగా రూ.10,470 అందుతున్నాయి. హైదరాబాద్‌లో ఇంటి కిరాయే కనీసం రూ.10 వేలుండే స్థితిలో.. అంత అద్దెను భరించలేని సాయి.. రోజూ ఇంటి వద్ద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు.


మిగిలేవి అప్పులే

గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఈమె పేరు పాశికంటి అంబిక (31). ఈమె చేతికి అందే వేతనం నెలకు రూ.8400 మాత్రమే. భర్త గోవింద్‌ చిరువ్యాపారంతో నెలకు రూ.10 వేల వరకూ సంపాదిస్తారు. ఇంటి కిరాయి, ముగ్గురు పిల్లల ఖర్చులు, అన్నీ పోను నెల తిరిగేసరికి అప్పులే మిగులుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు అంబిక. ఆటో ఖర్చు భరించలేక పార్సిగుట్ట నుంచి రోజూ నడుచుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.


ఇల్లు గడవడం కష్టమే

గాంధీ ఆసుపత్రిలో పదేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఈయన పేరు బుద్ధి మురారి(41). రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సొంతూరు. భార్య రెండో ఏఎన్‌ఎం. ఆమె నెల వేతనం రూ.10 వేలు. ఈయనకు జీతంలో కోతలు పోను చేతికొచ్చేది నెలకు రూ.8700. దంపతులిద్దరం పనిచేసినా, కుటుంబం గడవడం కష్టంగా ఉందన్నారు మురారి. తన సహచరులకు కొవిడ్‌ వచ్చినప్పుడు భయమేసిందని, వీరిలో ఇద్దరు మృతిచెందారని, అయినా బతుకుదెరువు కోసం విధులకు హాజరవుతున్నానని చెప్పుకొచ్చారు.


వేతనానికి ఎదురుచూపులే

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం చోపన్‌ముత్నూర్‌కు చెందిన కేంద్రె సోమ్‌నాథ్‌ ఏడేళ్లుగా రిమ్స్‌లో భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. నెల వేతనం రూ.7,800. దీంతో కుటుంబం గడవక అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అరకొర వేతనం కూడా నెలనెలా సరిగా అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.


అప్పుల తిప్పలు తప్పట్లేదు

ఈమె పేరు వై.గంగామణి. ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా రిమ్స్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. భర్త దొరికిన రోజు కూలి పనికి వెళ్తారు. ఈమెకు నెలకు అందే వేతనం రూ. 8,200. ఇంటి అద్దె రూ.మూడు వేలు, కరెంటు, నల్లా బిల్లు చెల్లించాక.. మిగిలే మొత్తంతో కుటుంబం ఎలా గడపాలని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. పిల్లల చదువు రుసుములు చెల్లించటానికి ప్రతి నెల తెలిసిన వారి దగ్గర అప్పు చేయక తప్పటం లేదని వాపోతున్నారు.


పాచి పని చేసి ఆసుపత్రికి

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు ఈదుల రజిత. ఎంజీఎంలో 17 ఏళ్లుగా పనిచేస్తున్నా నెల జీతం రూ. 5 వేలు మాత్రమేనని వాపోతున్నారు. వరంగల్‌ కొత్తవాడలోని సుర్జీత్‌నగర్‌లోని గుడిసెవాసుల కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా భర్త నెలకు రూ. 5 వేల వరకు సంపాదిస్తారు. వేతనం చాలక... తాను ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి మూడిళ్లలో పాచి పని చేసి ఆసుపత్రికొస్తున్నానని. అయినా ఇల్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రజిత.


కూలీ చేస్తేనే గడిచేది

ఎంజీఎంలో 20 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు తూళ్ల సుధాకర్‌. స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం చెన్నారం గ్రామం. ఈయనకు అందే వేతనం రూ.7800 మాత్రమే. భార్య ప్రతి రోజూ కూలికి వెళ్తే గానీ కుటుంబం గడవని దుస్థితి. అయిదేళ్ల క్రితం పెద్దబ్బాయికి రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో సుధాకర్‌ రూ.లక్షన్నర వరకు అప్పు చేశారు. దానికి వడ్డీలు కడుతూ వస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని