16 నుంచి హుజూరాబాద్‌లో దళితబంధు

ప్రధానాంశాలు

16 నుంచి హుజూరాబాద్‌లో దళితబంధు

పథకానికి త్వరలో చట్టబద్ధత

దళితుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలు

సమూహంగా ఏర్పడి పెద్ద యూనిట్‌ పెట్టుకునే అవకాశం

మంత్రిమండలి నిర్ణయాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం దళితబంధును ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల ఆర్థిక సాయం చేసేలా.. లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి పెద్ద పెట్టుబడితో పెద్ద యూనిట్‌ పెట్టుకునే అవకాశాన్ని దళితబందు పథకం ద్వారా కల్పించాలనే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపింది. ఈ పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని మంత్రిమండలి అభిప్రాయపడింది. దళితబంధు కూడా దేశానికి దారి చూపే పథకమవుతుందని కేబినెట్‌ పేర్కొంది. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పరిశ్రమల కేంద్రం (సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ప్రైజ్‌) ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ పథకం అమలుపై పర్యవేక్షణ కోసం వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని ఆర్థికశాఖను కేబినెట్‌ ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే కార్డు నమూనాలను పరిశీలించింది. రైతుబీమా మాదిరే నేత, గీత కార్మికులకు బీమా కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, ‘‘దళితులు రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో 20% జనాభా ఉన్నా వారి చేతుల్లో ఉన్న సాగుభూమి 13 లక్షల ఎకరాలే. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అరకొర సహాయంతో వారి అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే యూనిట్‌ పెట్టుకోవడానికి రూ. పదిలక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయించాం. బ్యాంకులతో అనుసంధానం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా చేస్తేనే వారి పరిస్థితి మెరుగుపడుతుంది. ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లబ్ధిదారులదే. అధికారులు, దళితబంధు స్వచ్ఛంద కార్యకర్తలూ వారికి మార్గదర్శనం చేస్తారు. శిక్షణ, పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటవుతాయి. జిల్లా కలెక్టర్‌, జిల్లా మంత్రి ఇందులో కీలక పాత్ర పోషిస్తారు. దళితవాడల్లో వెంటనే సదుపాయాల కల్పన జరగాలి. 

అన్ని వర్గాల సంక్షేమంతో..

రాష్ట్రంలోని ఆన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల కింద సాగు పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తయి అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చింది. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం వ్యవసాయరంగం నుంచే వస్తోంది. వృత్తి పనులవారి జీవితాలను నిలబెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపట్టింది. గొర్రెల పంపిణీ గొల్లకుర్మలకు లాభం చేకూర్చింది. పశుసంపద పెరిగింది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం వల్ల మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. గీత కార్మికులకు చెట్ల పన్ను బకాయిలు రద్దు చేయటమే కాకుండా చెట్లకు పన్ను విధానాన్ని రద్దు చేశాం. నేత, మరమగ్గాల వారి ఆదాయాలూ మెరుగుపడ్డాయి. నూలు రంగుల మీద సబ్సిడీతో పాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి ద్వారా వారికి చేతినిండా పని దొరికింది’’ అని తెలిపారు.


ఉద్యోగ ఖాళీలపై వచ్చేసారి నిర్ణయం

రాష్ట్రంలో 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రభుత్వం మంత్రిమండలికి నివేదించింది. ఈ జాబితాను అధ్యయనం చేస్తామని, వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.


నేడు నాగార్జునసాగర్‌లో సీఎం పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నాగార్జునసాగర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.40కి హాలియా చేరుకుంటారు. అక్కడి మార్కెట్‌ యార్డులో ఉదయం 10.55కి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే నోముల భగత్‌ ఇంట్లో భోజనం చేసి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుంటారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని