దళిత బంధు మొదలైంది

ప్రధానాంశాలు

దళిత బంధు మొదలైంది

వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు

గ్రామంలో ప్రతి ఒక్కరికీ కొత్త ఇల్లు కట్టిస్తాం

దత్తత గ్రామ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ప్రకటన

ఈనాడు - నల్గొండ


దళితులు కష్టపడేవారు. లక్ష్మిని సృష్టించేదే వారు. అలాంటి వారు పేదరికంలో ఉండకూడదనే ఉద్దేశంతో.. దళితబంధు అమలు చేస్తున్నాం. దీనిని గతేడాదే ప్రారంభించుకోవాల్సింది. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో ఆలస్యమైంది. రాష్ట్రమంతా అమలు చేయాలంటే రూ. లక్ష కోట్లు అవసరం అవుతాయి. అయినా అమలు చేస్తాం. ఏళ్లుగా దోపిడీకి గురైన దళితజాతి ఈ పథకంతో తలెత్తుకు తిరగాలి.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


‘రాష్ట్రంలోనే తొలిసారిగా దళితబంధు పథకాన్ని వాసాలమర్రిలోనే మొదలుపెడుతున్నాను. ఈ నెల 16న హుజూరాబాద్‌లో ప్రారంభం లాంఛనమే. ఇక్కడి 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.7.6 కోట్లు తక్షణం మంజూరు చేస్తున్నా. ఈ నిధులను గురువారం ఉదయం 11 గంటల్లోగా కలెక్టరు పమేలా సత్పతి ఖాతాలో జమచేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతి పైసా పొదుపు చేస్తే దళితులు కూడా షావుకార్లు అవుతారన్నారు. దళిత బస్తీల్లో ఉండే చదువుకున్న, విద్యావంతులైన యువకులే కేసీఆర్‌ ఆస్తి అని పేర్కొన్నారు. తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం పర్యటించారు. దాదాపు ఆరు గంటల పాటు సాగిన కార్యక్రమంలో దళిత బస్తీల్లో పర్యటించడంతో పాటు రైతు వేదికలో దళిత కుటుంబాలతో భేటీ అయి దళితబంధు పథకంపై దిశానిర్దేశం చేశారు.  వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘వాసాలమర్రి గ్రామంలో రెండు వేల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం వీటికి కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ సాగర్‌ నుంచి సాగునీళ్లు అందుతున్నాయి. ఇక్కడ దాదాపు 600 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంటే ప్రస్తుతం కొంత కబ్జా అయింది. ఆ లెక్కలన్నీ కలెక్టరుకు చెప్పి తీయిస్తా. మరో నూరు ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దానిని సైతం భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేస్తాం. ఈ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు భూమి లేదు. వారికి సైతం భూమి ఇచ్చి రైతులను చేస్తాం.

గుర్తింపు కార్డుతో పర్యవేక్షణ

దళితబంధు ద్వారా డబ్బు పొందిన లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఒక గుర్తింపుకార్డు ఇస్తాం. అందులో ప్రత్యేక చిప్‌ను అమర్చి ఈ డబ్బులు మంచి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారా అనేది పర్యవేక్షిస్తాం. స్వయంగా నేనే ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తా. డబ్బులు వృథా అయితే మీతో పాటు నన్ను తిడతారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలేవీ ఆగిపోవు. వారి రేషన్‌కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతరత్రా సౌకర్యాలు ఎప్పట్లాగే వస్తాయి.

ఎర్రవల్లిలా అందరికీ ఇళ్లు

ఈ గ్రామంలో ఇళ్లు ఒక ప్రణాళిక ప్రకారం లేవు. మీరందరూ ఒప్పుకొంటే ఊరు ఊరంతా కూలగొట్టి సరైన ప్రణాళికతో నిర్మించుకుందాం. వానాకాలం తర్వాత సమగ్ర ప్రణాళికలు రచిద్దాం. ఎర్రవల్లిలోనూ ఇలానే ఉంటే అన్నీ కూలగొట్టి కొత్తవి కట్టించాం. సుమారు ఆరు నెలల పాటు చెన్నై నుంచి తెప్పించిన టెంట్ల లాంటి ఇళ్లలోనే ప్రజలంతా ఉన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత పండగలా గృహప్రవేశం చేశారు. ఇక్కడ కూడా అలానే గ్రామ ప్రజలందరికీ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది’’ అని సీఎం తెలిపారు.

దళిత బస్తీల్లో ..60 ఇళ్లకు సీఎం

మధ్యాహ్నం 12.30 గంటలకు వాసాలమర్రికి చేరుకున్న ముఖ్యమంత్రి నేరుగా దళిత బస్తీలకు చేరుకొని మూడు గంటల పాటు పర్యటించారు. మహిళలు బొట్టుపెట్టి ఆయనకు స్వాగతం పలికారు. దాదాపు 60 ఇళ్లలోకి వెళ్లి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు లేని వారందరికీ రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని పలువురిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పది లక్షలు ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. పలువురు స్వయం ఉపాధికి ఉపయోగించుకుంటామని, మరికొందరు ట్రాక్టర్లు, ఆటోలు, బర్రెలు కొనుక్కుంటామని బదులిచ్చారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన సీఎం పింఛనువస్తోందా అని ఆరా తీశారు. దాదాపు 20 మంది బీడీ కార్మికులు పింఛను రాలేదని చెప్పడంతో ‘నేనూ బీడీలు చేసేటోళ్ల ఇంట్లో ఉండే చదువుకున్నానమ్మ. మీ కష్టాలు నాకు తెలుసు’ అని బదులిచ్చారు.  ఈ నెల నుంచే వీరికి పింఛన్‌ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. ఒక ఇంటికి వెళ్లినప్పుడు తనకు ఏదైనా సహాయం చేయాలని ఆ కుటుంబ పెద్ద అడగ్గా వారి అల్లుడు డ్రైవర్‌ అని తెలుసుకొని దళితబంధు కింద ట్రాక్టర్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తన వెంట వచ్చిన ప్రజాకవి గోరటి వెంకన్నను పరిచయం చేస్తూ ఈయన తెలుసా ‘దళిత నాయకుడు. పల్లె కన్నీరెడుతుందో కనిపించని కుట్రల’ అనే పాట ఈయన రాసిందేనన్నారు. అనంతరం సర్పంచి ఇంట్లో భోజనం చేశారు.

వంటలు బాగా కుదిరాయ్‌ ఆంజనేయులూ!

మధ్యాహ్నం 2.50 గంటలకు సర్పంచి పోగుల ఆంజనేయులు ఇంటికి వెళ్లిన కేసీఆర్‌ సుమారు గంటన్నర పాటు అక్కడే గడిపారు. భోజనానికి చికెన్‌, మటన్‌తో పాటు నాటుకోడి కూర, తలకాయ, బోటి, బెండకాయ ఫ్రై, సాంబారు, ఉలవచారు, గులాబ్‌జామూన్‌ వడ్డించగా...వంటలు బాగా కుదిరాయ్‌ అని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే, విప్‌ సునీత, రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టరు పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, గ్రామ సర్పంచి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


దళిత రక్షణ నిధితో అండ

ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల్లో ప్రభుత్వం రూ.10 వేలు తీసుకొని అందుకు మరో రూ.10 వేలను ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధి పేరుతో నిల్వ చేస్తుంది. ఈ నిధిని దళితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖర్చు చేసే విధంగా తయారు చేశాం. గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేసి ఈ నిధిపై పర్యవేక్షణ చేస్తాం. ఆలేరు నియోజకవర్గానికి వాసాలమర్రి దారి చూపాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కమతాల ఏకీకరణ జరగాలి. అది ఇక్కడి నుంచే మొదలుపెడతాం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని