రామానుజాచార్య విగ్రహావిష్కరణకు రండి

ప్రధానాంశాలు

రామానుజాచార్య విగ్రహావిష్కరణకు రండి

 రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు చినజీయర్‌ స్వామి, జూపల్లి ఆహ్వానం

అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లకు కూడా

ఈనాడు, దిల్లీ: భగవత్‌ రామానుజాచార్య విగ్రహావిష్కరణకు విచ్చేయాల్సిందిగా త్రిదండి చినజీయర్‌ స్వామి, మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించారు. అమిత్‌ షా సహా పలువురు  కేంద్ర మంత్రులను కూడా కలిశారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 216 అడుగుల పంచలోహ విగ్రహం. మొత్తం 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ విగ్రహావిష్కరణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 35 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వర్‌రావు తదితరులు రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి విగ్రహ విశేషాలు, ఆ ప్రతిమ ఏర్పాటు వెనుకున్న కారణాలను వివరించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ఆహ్వానితులు తెలిపారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆహ్వానం పలికిన వీరు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి ఆహ్వానం పలికారు. రామానుజాచార్య జీవిత విశేషాలు తదితర అంశాలను ఆయనకు సుమారు గంటపాటు వివరించారు. అంతకుముందు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను వీరు వేర్వేరుగా కలిసి ఆహ్వానం పలికారు. అలాగే కేంద్రమంత్రి నితిన్‌గడ్కరి, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి, పర్యావరణ అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌చౌబే, వ్యవసాయశాఖ సహాయమంత్రి శోభాకరంద్లాజేలనూ కలిసి ఈ బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. కుల, మత, వర్గ, ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న దశలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటుచేస్తున్నట్లు చినజీయర్‌ స్వామి కేంద్రమంత్రులకు వివరించారు.


స్వామీజీని కలిసే భాగ్యం ఇన్నాళ్లకు: అమిత్‌ షా

‘‘చినజీయర్‌ స్వామీజీని కలిసే భాగ్యం ఈరోజుకు నాకు కలిగింది. మానవాళికి ఆయన అందిస్తున్న నిస్వార్థసేవలు, శ్రీరామానుజాచార్య ఆలోచనల విస్తరణకోసం చూపుతున్న అంకితభావం నిజంగా ఎంతో గొప్పవి’’ అని పేర్కొంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని