ప్రజావసరాలకు అనుగుణంగా చట్టాలను సంస్కరించాలి

ప్రధానాంశాలు

ప్రజావసరాలకు అనుగుణంగా చట్టాలను సంస్కరించాలి

 సరైన చట్టాలు చేస్తే కోర్టులు శాసనకర్తల పాత్ర పోషించనక్కర్లేదు

కార్యనిర్వాహక వ్యవస్థ సరళమైన నిబంధనలు రూపొందించాలి

మూడు విభాగాలు సుహృద్భావంతో పనిచేస్తేనే సమస్యల పరిష్కారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ఈనాడు, దిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థను ప్రస్తుత కాలానికి, ప్రజావసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పునరుద్ఘాటించారు. గ్రామీణులు ఇప్పటికీ కోర్టులు ఉన్నది తమ కోసం కాదన్న భావనలో ఉన్నారని, దాన్ని దూరం చేసి న్యాయస్థానాలను, న్యాయాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. న్యాయ యంత్రాంగాన్ని ప్రజానుకూలంగా తీర్చిదిద్దేలా న్యాయవ్యవస్థను మార్చకపోతే కోర్టులు ప్రజాసమస్యలకు పరిష్కారం చూపే లక్ష్యాన్ని చేరుకోలేవన్నారు. శాసనవ్యవస్థ చట్టాలను సరిగా రూపొందిస్తే కోర్టులకు శాసనకర్తల పాత్ర పోషించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రభుత్వంలోని మూడు విభాగాలూ సామరస్యపూర్వకంగా పనిచేస్తేనే ప్రజాసమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం ఒడిశాలోని కటక్‌లో కొత్తగా నిర్మించిన ఆయీనీ సేవాభవన్‌ను ప్రారంభించి ప్రసంగించారు.

‘ప్రాంతీయ, ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో న్యాయాన్ని అందుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఒడిశాలో గత జనాభా లెక్కల ప్రకారం 83.3% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. వారంతా న్యాయవ్యవస్థకు దూరంగానే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయసేవా సంస్థలకు ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ న్యాయవ్యవస్థ ద్వంద్వ సవాళ్లను ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థను భారతీయీకరించడం అందులో మొదటిది. 74 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా సంప్రదాయ, వ్యవసాయ వర్గాలవారు కోర్టులకు రావడానికి సంశయిస్తున్నారు. కోర్టుల విధానాలు, నిబంధనలు, భాష అన్నీ వారికి పరాయిభావన కలిగిస్తున్నాయి. సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైంది. అన్ని వాస్తవాలు, చట్టాలపై న్యాయస్థానాల్లోనే మథనం చేసేలా మన వ్యవస్థను తీర్చిదిద్దడం బాధాకరం. న్యాయవ్యవస్థకు భారతీయతను అద్ది ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని అనుకుంటున్నాను. ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలది ప్రధాన భూమిక. శాసనవ్యవస్థ చట్టాలను పునఃసమీక్షించి వాటిని కాలానుగుణంగా సంస్కరించాలి. కార్యనిర్వాహక వ్యవస్థ నిబంధనలను సరళంగా రూపొందించి చట్టాలు ప్రజావసరాలకు సరిపోయేలా చేయాలి. కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తే, న్యాయవ్యవస్థ శాసనకర్త పాత్ర పోషించాల్సిన అవసరం ఉండదు. అంతిమంగా మూడు రాజ్యాంగ వ్యవస్థలు సుహృద్భావంతో పనిచేసినప్పుడే న్యాయపంపిణీలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి వీలవుతుంది.

* ప్రజల్లో అవగాహన పెంపొందించి న్యాయపంపిణీ వ్యవస్థను ప్రజలు అందుకొనేలా చేయడం రెండో సవాలు. న్యాయాన్ని అందుబాటులోకి తేవడం అంటే కేవలం కక్షిదారుల తరఫున న్యాయవాదులు వాదించేలా చేయడం కాదు. పేదలు, అట్టడుగు వర్గాలకు న్యాయాన్ని అందుబాటులోకి తేవడం న్యాయసేవా సంస్థల బాధ్యత. అత్యంత దుర్బల వర్గాలకు న్యాయసాయం అందించి వారి హక్కులు వారికి అందేలా చేయడం ముఖ్యం. ప్రజల సమస్యలకు న్యాయసేవా సంస్థలు లోక్‌అదాలత్‌, మధ్యవర్తిత్వం, రాజీ లాంటి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ప్రోత్సహించాలి. మౌలికవసతులు, నిధుల కొరతతో ఈ సంస్థల కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఫలితంగా న్యాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం దెబ్బతింటోంది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా న్యాయచైతన్య కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మారుమూలలకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు. అంతకుమునుపు జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని