అయిదు నెలలుగా వేతన వెతలు

ప్రధానాంశాలు

అయిదు నెలలుగా వేతన వెతలు

ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో అందని జీతాలు
ఒప్పంద ఉద్యోగుల ఇబ్బందులు

 

ఈనాడు, హైదరాబాద్‌: ఒక పక్క పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మరో వైపు తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా రాబోతోంది. ఈ సమయంలో ఒప్పంద ఆరోగ్య ఉద్యోగులు పూటగడవని స్థితిలో అల్లాడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌(ఎంపీహెచ్‌ఏ)లు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్‌ అసిస్టెంట్లకు గత 5 నెలలుగా వేతనాలు అందడం లేదు. వీరు సుమారు 1,700 మంది వరకూ ఉంటారని అంచనా. ఈ ఉద్యోగుల్లో అత్యధికులు 2003 నుంచి కూడా పనిచేస్తున్నారు. వీరందరికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాల పెంపు 30 శాతం అమలు కోసమంటూ గత ఏప్రిల్‌ నుంచి సాధారణ వేతనాలను కూడా ఇవ్వకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. పెంపు వేతనాన్ని ఎప్పుడు అమలు చేస్తే.. అప్పట్నించి ఇవ్వచ్చు.. కనీసం సాధారణ వేతనాన్ని అయినా ఇవ్వాలని ఒప్పంద ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు. 30 శాతం పెంపు అమల్లో భాగంగా ఉద్యోగ సమాచారాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులను కోరగా.. కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. మూణ్నెల్ల కిందటే దీనికి సంబంధించిన ఆదేశాలు రాష్ట్ర స్థాయి నుంచి వెళ్లినా.. ఇంకా మరో 16 జిల్లాల నుంచి సమాచారాన్ని పంపలేదని ఉన్నతాధికారులంటున్నారు. మరోపక్క ఉద్యోగులు విన్నపాలు చేయగా.. చేయగా.. పాత జీతాన్నే కొన్ని జిల్లాల్లో ఏప్రిల్‌ మాసానికి ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఏప్రిల్‌, మే నెలలకు కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జూన్‌ నుంచి జీతాలివ్వడం లేదు.  ముఖ్యమంత్రి చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, కొవిడ్‌తో పోరాడుతున్న తమకు 30 శాతం కాకుండా 100 శాతం పెంపును అమలు చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంటనే వేతనాలు విడుదల చేయండి

పెంచిన 30 శాతం వేతనం జూన్‌ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకూ 17 జిల్లాల నుంచి మాత్రమే ఒప్పంద ఉద్యోగుల సమాచారం వచ్చింది. మిగిలిన జిల్లాల్లో ఉద్యోగులే ముందుకు రావడం లేదు. వారు 30 శాతం కాకుండా... 100 శాతం పెంచాలని కోరుతున్నారు. పెంచిన వేతనంతో సంబంధం లేకుండా పాత జీతాలను వెంటనే అన్ని జిల్లాల వైద్యాధికారులు చెల్లించాలి.  ఒప్పంద ఉద్యోగుల సమాచారాన్ని వెంటనే పంపించాలి. ఈ విషయాల్లో జాప్యం చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. 2 రోజుల్లో మిగిలిన జిల్లాల ఉద్యోగుల సమాచారాన్ని పొందుపర్చి, 30 శాతం వేతన పెంపు అమలుకు చర్యలు తీసుకుంటాం.

-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని