75 శాతం విజయాలే లక్ష్యం

ప్రధానాంశాలు

75 శాతం విజయాలే లక్ష్యం

9,757 పెండింగ్‌ కేసులు
సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

ఈనాడు, దిల్లీ: ‘‘మీ విజయాల శాతం ఎంత?’’ అన్న సుప్రీంకోర్టుకు ప్రశ్నకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమాధానం ఇచ్చింది. ఇంతవరకు విజయాల రేటు 65-70 శాతం మధ్య ఉందని, దీన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 75 శాతం మేరకు తీసుకువెళ్తామని పేర్కొంటూ ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.కె.జైస్వాల్‌ ప్రమాణ పత్రం సమర్పించారు. కోర్టు తీర్పులపై 30 రోజుల్లోగా అప్పీలు చేయడంపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వివిధ కేంద్ర సంస్థల అనుమతులు కూడా అవసరం కావడంతో వాటితో సమన్వయం చేసుకుంటామని వివరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీబీఐకి ఎనిమిది రాష్ట్రాలు అనుమతులు నిరాకరించాయని చెప్పారు. ఏదైనా కేసులో దర్యాప్తు అవసరం అనుకుంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటున్నామని వివరించారు. అనుమతులు రావడంలో జాప్యం జరిగితే ఆధారాలు మాయమవుతున్నాయని తెలిపింది. 2018-21 మధ్య ఈ రాష్ట్రాలకు 150 విజ్ఞప్తులు పంపిస్తే కేవలం 18 శాతం కేసులకే (27 కేసులు) అనుమతులు లభించాయని పేర్కొంది.

స్టేలు ఉన్న కేసులు....
దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కలిపి 367 కేసులపై స్టేలు ఉన్నాయి. ఇందులో ఏసీబీ హైదరాబాద్‌ నమోదు చేసిన 18, ఏసీబీ వైజాగ్‌ నమోదు చేసిన 15 కేసులున్నాయి. అప్పీళ్లు చేసే విషయంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తుండడంతో విజయాల శాతం ఎంతని సెప్టెంబరు మూడో తేదీన సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రమాణ పత్రం సమర్పించాలని ఆదేశించడంతో ఈ వివరాలు ఇచ్చింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని