PAK: పట్టాలు తప్పిన బోగీలు సడెన్‌గా కనబడ్డాయి.. ఆ లోపే! 

తాజా వార్తలు

Published : 07/06/2021 16:36 IST

PAK: పట్టాలు తప్పిన బోగీలు సడెన్‌గా కనబడ్డాయి.. ఆ లోపే! 

పాక్‌ రైలు దుర్ఘటనపై లోకో పైలట్‌

50కి చేరిన మృతుల సంఖ్య

కరాచీ‌: పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరింది. దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌లో ఈ రోజు ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో 70మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్‌  ఎక్స్‌ప్రెస్‌ రైలు.. పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడింది. ఈ క్రమంలో రావాల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న రైలు ఎదురుగా వచ్చి పట్టాలపై పడిఉన్న బోగీలను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకున్నట్టు పాకిస్థాన్‌ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులకు వైద్య సేవలందించేందుకు వీలుగా ఘోట్కి, ఢార్కి, ఒబారో, మిర్‌పూర్‌ మాట్‌హెలోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.  మృతుల్లో మహిళలతో పాటు కొందరు రైల్వే అధికారులు కూడా ఉన్నట్టు ఘోట్కి డిప్యూటీ కమిషనర్‌ ఉస్మాన్‌ అబ్దుల్లా వెల్లడించారు. 

ఈ ఘటనపై సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ ఐజాజ్‌ షా మాట్లాడుతూ.. తనను స్థానికులే కాపాడారని తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి తనను బయటకు తీశారన్నారు. తమ రైలు సాధారణ వేగంతోనే వెళ్తోందని, అకస్మాత్తుగా తనకు పట్టాలు తప్పిన మిల్లత్‌ రైలు బోగీలు ట్రాక్‌పై కనబడ్డాయనితెలిపారు. తక్కువ దూరమే ఉండటం వల్లే ఆ బోగీలను ఢీకొట్టడం ఈ విషాదానికి దారితీసిందని వివరించారు.

ఈ ఘటనపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రిని ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే భద్రతపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు, ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీయడం సవాల్‌గా మారిందని అధికారులు చెబుతున్నారు. పెద్ద యంత్రాలను ఉపయోగించి మృతదేహాలను బయటకు తీయాలంటే ఇంకా సమయం పడుతుందని పేర్కొన్నారు. వైద్యం అందించేందుకు వీలుగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఘోత్కి డిప్యూటీ కమిషనర్‌ జియో న్యూస్‌తో చెప్పారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, పాక్‌ సైన్యం, పారామిలటరీ రేంజర్లు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో!

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అధికారులు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.15లక్షల చొప్పున అందజేయనున్నారు. అలాగే, గాయపడిన వారికి కనీసం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు ప్రకటించారని జియో న్యూస్‌ పేర్కొంది. పాకిస్థాన్‌లో రైలు ప్రమాదాలు ఏటా సర్వసాధారణంగా జరగడంతో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని రైల్వే శాఖ మాజీ అధికారులు పేర్కొంటున్నారు. రైల్వే నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని చెబుతున్నారు. దేశంలో చాలాచోట్ల ఇంకా దేశ విభజన కన్నా ముందున్న ట్రాక్‌లు, నెట్‌వర్కులే పనిచేస్తున్నాయని, అందువల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని