పీవోకేలో చైనా వ్యతిరేక నిరసనలు!
close

తాజా వార్తలు

Published : 07/07/2020 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీవోకేలో చైనా వ్యతిరేక నిరసనలు!

శ్రీగనర్‌: పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో పాకిస్థాన్‌, చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌ నగరంలో అనేక మంది సోమవారం ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ రివర్స్‌ సేవ్‌ జమ్మూకశ్మీర్‌’ పేరిట సామాజిక మాధ్యమాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన పాకిస్థాన్‌-చైనా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటాయంటూ నిరసనకారులు నిలదీశారు. ఈ విషయంలో ఇరు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. కోహాలా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపే వరకు ఆ ప్రాంతానికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామని తేల్చి చెప్పారు. 

పీవోకేలో 1.5కోట్ల డాలర్ల విలువైన ఆజాద్ పత్తాన్ జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాకిస్థాన్‌లు సోమవారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో పీవోకేలో నిరసనలు వ్యక్తమవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీ-పెక్‌)లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పాక్‌ పేర్కొంది. జీలం నదిపై నిర్మించనున్న 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల చౌకైన సురక్షితమైన విద్యుత్తు లభిస్తుందని చెప్పుకొచ్చింది. 2026 నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని