close

తాజా వార్తలు

Published : 28/11/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిడిగుద్దులతో దద్ధరిల్లిన తైవాన్‌ పార్లమెంట్‌!

తైపీ: పార్లమెంట్‌ సభ్యులు మాంసం, పిడిగుద్దులతో దాడి చేసుకున్న ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై అక్కడి పార్లమెంటులో జరిగిన చర్చ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఫలితంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో కొంతసమయం పాటు చట్టసభ రణరంగాన్ని తలపించింది. 

అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత, ఆ దేశం నుంచి పంది మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రీమియర్‌ సు సెంగ్‌-చాంగ్‌ పార్లమెంట్‌ సభ్యులకు వివరించడం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు పంది మాంసంతో కూడిన బ్యాగులను సభలోనికి తీసుకురావడంతో పాటు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీన్ని అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు పంది మాంసంతో పరస్పరం దాడి చేసుకున్నారు. అంతేకాకుండా నేలపైన పడి కొట్టుకున్నారు.

ఇదిలా ఉంటే, పంది, గొడ్డు మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ మధ్యే దీన్ని నిరసిస్తూ తైపీలో వేల మంది రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టారు. అయితే, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తైవాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం నిషేధం కొనసాగుతుండగా జనవరి నుంచి అమెరికా నుంచి మాంసం దిగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయనున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని