close

తాజా వార్తలు

Published : 21/10/2020 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫలించిన నాసా పదేళ్ల కృషి!

బెన్నును ముద్దాడిన ఒసైరిస్‌-రెక్స్‌

కేప్‌ కెనావెరాల్‌: అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక ‘బెన్ను’ అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగినట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లారేటా తెలిపారు. గ్రహశకలంపై దిగగానే ఒసైరిస్‌ నాసా కేంద్రానికి సంకేతాలు పంపినట్లు వెల్లడించారు. అయితే, ఆ గ్రహశకలపు నమూనాలను సేకరించే అసలు లక్ష్యాన్ని అది ఎంత వరకు పూర్తి చేసిందన్నది తెలియరాలేదు. ఇది తెలుసుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందన్నారు. ఒకవేళ నమూనాల్ని సేకరించలేదని తేలితే మరోసారి ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.. ఈ మేరకు ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శకలంపై చిన్న రేణువులతో పాటు భారీ శిలలూ ఉన్నాయి. పైగా అక్కడ గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ల్యాండింగ్‌ ప్రక్రియపై ఇప్పటి వరకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తిరిగి గాల్లోకి దూసుకెళ్లేలా ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఒసైరిస్‌కు ఆ అవసరం రాలేదు. అన్ని అడ్డంకుల్ని దాటుకొని‌ బెన్నుని తాకింది.  

బెన్ను చుట్టూ ఒక నిర్దేశిత కక్ష్యలో పరిభ్రమించిన ఒసైరిస్‌.. నాలుగున్నర గంటలు శ్రమించి గ్రహశకలంపై ల్యాండ్‌ అయినట్లు వెల్లడించారు. గ్రహశకల ఉపరితలంపై అది 5-10 సెకన్లు మాత్రమే ఉంటుంది. పైగా వ్యోమనౌక మొత్తం కిందకు దిగకుండా కేవలం చేతిలాంటి ఒక పరికరం మాత్రమే గ్రహశకలాన్ని తాకుతుంది. అందుకే, ఈ ప్రక్రియను బెన్నును ముద్దాడడంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. బెన్నుపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడంతో ల్యాండింగ్‌ ప్రక్రియ అతిక్లిష్టంగా కొనసాగినట్లు తెలిపారు. బెన్నును చేరడానికి నాసా దాదాపు దశాబ్ద కాలంగా కృషి చేస్తోంది. నేడు వారి కృషి ఫలించడంతో ఈ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ జపాన్‌ మాత్రమే ఈ ఘనతను సాధించింది. 

గ్రహశకలం నుంచి దాదాపు 60 గ్రాముల నమూనాలను సేకరిస్తుంది. ఇందుకోసం బెన్నుపై టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఉన్న ఒక ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. దానికి నైటింగేల్‌ అని పేరు పెట్టారు. ఒసైరిస్‌-రెక్స్‌ ప్రస్తుతం బెన్నుకు 0.75 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అక్కడి నుంచి కిందకి దిగి, నమూనాలను సేకరించడానికి ఈ వ్యోమనౌకకు నాలుగు గంటలు పడుతుంది. గ్రహశకల ఉపరితలంపై అది 5-10 సెకన్లు మాత్రమే ఉంటుంది. నమూనాల సేకరణ కోసం అది.. పీడనంతో కూడిన నైట్రోజన్‌ గ్యాస్‌ను తొలుత బయటకు విడుదల చేస్తుంది. ఫలితంగా పైకి లేచే ధూళి, గ్రావెల్‌ను తనలోకి లాగేసుకొని, వేగంగా పైకి లేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తాన్నీ వ్యోమనౌక సొంతంగానే నిర్వహిస్తుంది. భూమి నుంచి దాన్ని నియంత్రించడం సాధ్యంకాదు. భూమిపై నుంచి వెళ్లే సంకేతం.. ఆ వ్యోమనౌకను చేరుకోవడానికి 18 నిమిషాలు పట్టడమే ఇందుకు కారణం. ఒకవేళ తొలి ప్రయత్నంలో విఫలమైతే.. మరోసారి నమూనాల సేకరణకు ఒసైరిస్‌ రెక్స్‌ ప్రయత్నిస్తుంది. ఈ నమూనాలు 2023లో భూమికి చేరుకుంటాయి. ఒసైరిస్‌-రెక్స్‌ పొడవు 2.3 మీటర్లు. ఇది చిన్న వ్యాన్‌ పరిమాణంలో ఉంటుంది. 80 కోట్ల డాలర్ల విలువైన ఈ వ్యోమనౌకను 2016లో నాసా ప్రయోగించింది. బెన్నుపై ఇసుక ఉంటుందని తొలుత ఆ సంస్థ అంచనావేసింది. ఈ మేరకు 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే చిన్నపాటి రాళ్లను మాత్రమే సేకరించేలా ఒసైరిస్‌-రెక్స్‌ను రూపొందించారు. అయితే 2018లో ఆ ఖగోళ వస్తువు వద్దకు వ్యోమనౌక చేరాక అసలు విషయం బయటపడింది. అక్కడ భారీ శిలలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రహశకలంపై తీవ్రంగా గాలించి, ‘నైటింగేల్‌ బిలాన్ని’ నాసా శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. అక్కడ చిన్నపాటి రేణువులు ఎక్కువగా ఉన్నాయి. భారీ శిలలూ ఉన్నాయి.Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.