కరోనా రెండో దశ..మరణాలు పైపైకి

తాజా వార్తలు

Published : 29/03/2021 14:02 IST

కరోనా రెండో దశ..మరణాలు పైపైకి

84 శాతం కేసులు..8 రాష్ట్రాల్లోనే

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో 68,020 మందికి వైరస్ సోకింది. ఈ కొవిడ్ కేసుల్లో 84 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే బయటపడ్డాయని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ జాబితాలో మహారాష్ట్ర (40,414) ముందుండగా..కర్ణాటక (3,082), పంజాబ్‌(2,870), మధ్యప్రదేశ్‌ (2,276), గుజరాత్ (2,270), కేరళ (2,216), తమిళనాడు (2,194), చత్తీస్‌గఢ్‌ (2,153) తరవాత వరసలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు ఐదు లక్షల మార్కును దాటాయి. ప్రస్తుతమున్న 5,21,808 క్రియాశీల కేసుల్లో..80 శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లోనే బయటపడ్డాయని పేర్కొంది.

రెండో దశ..మరణాల్లో పైపైకి..

కరోనా రెండో దశలో.. కొత్త కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఈ మహమ్మారికి 291 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. వాటిలో 81.79 శాతం మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోనే నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, ఒడిశా, అసోం, ఉత్తరాఖండ్‌, పుదుచ్చేరి, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్, లద్దాఖ్, సిక్కిం, అండమాన్ నికోబార్, మిజోరాం, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్‌లో తాజాగా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.

ఆరు కోట్ల మార్కు దాటిన టీకా డోసుల పంపిణీ..

మార్చి 28 నాటికి 6,05,30,435 మందికి కేంద్రం టీకా డోసులు పంపిణీ చేసింది. ఆ మొత్తం డోసుల్లో కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర వాటా 60 శాతంగా ఉందని మంత్రిత్వశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రజల కదలికలపై రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రాత్రి కర్ఫ్యూతో పాటు కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నాయి. మహారాష్ట్ర అయితే లాక్‌డౌన్ విధింపుపై కసరత్తు చేస్తోంది. దానికి సంబంధించి సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని