close

తాజా వార్తలు

Updated : 11/04/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో కొవిడ్‌ ఉద్ధృతికి కారణాలివే 

వైరస్‌లో మార్పులు.. వ్యాక్సినేషన్‌లో మందగమనం 

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌-19 కేసులు భారీగా పెరగడానికి అనేక కారణాలను ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా.. కరోనాలో కొత్త రకాలు, ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం, ఎన్నికలు, ఇతర బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం మందకొడిగా సాగడం ఇందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. టీకా పొందినప్పటికీ జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ప్రజలకు సరిగా తెలియజేయకపోవడం కూడా ఈ విజృంభణకు దారితీసి ఉండొచ్చని చెప్పారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లోని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్‌ జమీల్, టి.జాకొబ్‌ జాన్‌లు దీనిపై ఆసక్తికరమైన విశ్లేషణలు చేశారు. రాబోయే కొద్ది నెలల్లో వైరస్‌ కొత్త ఉత్పరివర్తనలపై టీకాలు ఎలా పనిచేస్తాయన్నదానిపైనే భవిష్యత్‌లో కొవిడ్‌ తీరుతెన్నులు ఉంటాయని చెప్పారు. 

అలసత్వం..

మొదటి ఉద్ధృతి తర్వాత కూడా.. కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నవారు భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారని జమీల్‌ తెలిపారు. మొదటి ఉద్ధృతి తర్వాత అనేక మందిలో అలసత్వం పెరిగిందని చెప్పారు. తాజా విజృంభణకు ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈ అభిప్రాయంతో జాన్‌ ఏకీభవించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తొలుత ఈ అలసత్వానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజల్లో ఉదాసీనత పెరిగిపోయింది. సిబ్బంది మొత్తానికీ టీకాలు ఇవ్వకుండానే పాఠశాలలు, కళాశాలలను తెరిచారు’’ అని పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్ల తీవ్రతకు అనుగుణంగా కఠిన నిబంధనలను విధించాల్సిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఆ సాహసం చేయలేదని చెప్పారు. మహమ్మారి దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు జాగ్రత్తగా ప్రణాళిక రచించాల్సిందన్నారు.

టీకాల్లో జాప్యం..

భారత్‌లో ఆలస్యంగా జనవరి మూడో వారంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని జాన్‌ పేర్కొన్నారు. పైగా దానికి నిర్దిష్టంగా ఎలాంటి లక్ష్యాలను విధించలేదని చెప్పారు. ‘‘తొలుత ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇచ్చారు. కొన్నిచోట్ల అవసరం లేనప్పటికీ వాటిని వేశారు. ఫలితంగా చాలా టీకాలు వృథా అయ్యాయి. వ్యాక్సిన్లకు అనుమతి రావడానికి ముందే వాటి ఉత్పత్తిని పెంచేలా సదరు కంపెనీలకు ముందస్తు ఆర్డర్లు ఇవ్వాల్సింది’’ అని పేర్కొన్నారు. టీకా పొందాక కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అధికారులు సరిగా ప్రచారం చేయలేదన్నారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని జమీల్‌ పేర్కొన్నారు. జనవరి మధ్యలో టీకాలు మొదలుపెట్టిన సమయంలో రోజువారీ ఇన్‌ఫెక్షన్లు తక్కువగా ఉన్నాయన్నారు. ‘‘కొన్ని కారణాల రీత్యా.. ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు సహా అర్హులైన కొందరు టీకాలపై విముఖత చూపారు. మార్చి మొదటినుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టినప్పటికీ 60ఏళ్లు పైబడినవారిలోనూ పలువురు వ్యాక్సిన్లపై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. మరోపక్క దేశంలో 0.7 శాతం మంది మాత్రమే టీకాకు సంబంధించిన రెండు డోసులను తీసుకున్నారు. 5 శాతం మందికి ఒక డోసు అందింది. అందువల్లే వ్యాక్సినేషన్‌ ఫలితాలు పెద్దగా కనిపించడంలేదు’’ అని వివరించారు.

కొత్త రకాలు..

కరోనా కొత్త రకాలు కూడా తాజా ఉద్ధృతికి దోహదపడి ఉంటాయని జమీల్, జాన్‌లు చెప్పారు. ‘‘ప్రజల్లో అలసత్వం పెరిగిన సమయంలోనే వైరస్‌లో కొత్త రకాలు వచ్చి పడ్డాయి. ఫలితంగా మొదటి ఉద్ధృతితో పోలిస్తే రెండో విజృంభణలో వైరస్‌ వ్యాప్తి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ అంశంలో మనకు దిశానిర్దేశం కొరవడింది’’ అని జాన్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌ల వాటా 80 శాతం ఉందన్నారు. దీనికితోడు రెండు ఉత్పరివర్తనలు కలిగిన ఒక కొత్త రకం వైరస్‌.. భారత్‌లో ఆవిర్భవించిందని చెప్పారు. మహారాష్ట్రలో జన్యుక్రమాలను పరిశీలించిన కొత్త కేసుల్లో 15-20 శాతం వాటాను ఇదే ఆక్రమించిందని తెలిపారు. ఈ రెండు కాక.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ రకాలు కూడా ఉన్నాయన్నారు. బ్రిటన్‌ రకం.. 50 శాతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. 

ఇలా చేస్తే మేలు..

ఉద్ధృతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలను ఇస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వాలని జమీల్‌ కోరారు. వ్యాక్సిన్ల సరఫరాకు అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని సమతౌల్యం చేసుకోవాలన్నారు. నెలకు కోటి డోసుల మేర కొవిషీల్డ్, 30 లక్షల డోసుల మేర కొవాగ్జిన్‌ టీకాలను పంపిణీ చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని చెప్పారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్, స్పుత్నిక్‌ వి టీకాలకూ అత్యవసర వినియోగ అనుమతినిస్తే వ్యాక్సిన్ల లభ్యత పెరుగుతుందన్నారు. 



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని