China: భారత్‌పై చైనా కొత్త కుట్రలు

తాజా వార్తలు

Updated : 20/07/2021 19:06 IST

China: భారత్‌పై చైనా కొత్త కుట్రలు

నూతన వైమానిక స్థావరాన్ని నిర్మిస్తున్న డ్రాగన్‌

దిల్లీ: భారత్‌తో లద్దాఖ్‌లో ప్రతిష్ఠంభన అనంతరం చైనా కొత్త కుయుక్తులు పన్నుతోంది. హిమాలయ శ్రేణుల్లో తనకున్న పోరాట పరిమితులను అధిగమించేందుకు కొత్త వైమానిక స్థావరాన్ని నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఖష్గర్, హోగాన్ స్థావరాల నుంచే పోరాట కసరత్తులు చేసిన చైనా.. తాజాగా షాక్సేలో మరో స్థావరాన్ని వేగంగా నిర్మిస్తోంది. తద్వారా భారత్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు డ్రాగన్ ప్రణాళికలు రచిస్తోందని సైనిక వర్గాలు తెలిపాయి.

వాస్తవాధీనరేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌తో పోరాడేందుకు తనకున్న పరిమితులను అధిగమించేందుకు చైనా పావులు కదుపుతోంది. గ్జీజియాంగ్‌ ప్రావిన్స్‌లోని షాక్సేలో ఉన్న ఓ వైమానిక స్థావరాన్ని యుద్ధ విమానాల కోసం అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ప్రస్తుతమున్న ఖష్గర్‌, హోగాన్‌ ఎయిర్‌ బేస్‌ల మధ్య దీన్ని నిర్మిస్తున్నట్లు సైనిక వర్గాలు గుర్తించాయి. షాక్సే ప్రాంతాన్ని యుద్ధ స్థావరంగా మార్చుకుంది. దీని ద్వారా లద్దాఖ్‌ వంటి ప్రాంతాల్లో ఉన్న పరిమితులను అధిగమించేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

నిశితంగా పరిశీలిస్తున్నామన్న భారత్‌..

ప్రస్తుతమున్న వైమానిక స్థావరాల ద్వారా వాస్తవాధీనరేఖ వెంబడి దాదాపు 400 కిలోమీటర్ల పరిధిలో సైనిక ఆపరేషన్‌ను నిర్వహించే సామర్థ్యం చైనాకు ఉంది. అయితే షాక్సే ఎయిర్‌బేస్‌ నిర్మాణంతో ఆ పరిధి మరింత విస్తరించనుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో డ్రాగన్‌ పెద్దఎత్తున డ్రోన్లను మోహరించింది. ఈ నేపథ్యంలో ఎల్‌ఏసీ వెంబడి చైనా కదలికల్ని భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. భారత సరిహద్దులకు సమీపంలో ఉన్న హోగాన్‌ ఖష్గర్‌, గార్‌ గున్సా స్థావరాల్లో ఇటీవల చైనా సైన్యం యుద్ధ విన్యాసాలు చేపట్టింది. కాగా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి వచ్చే ఎలాంటి చర్యనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి.

యుద్ధ విమానాలు సిద్ధం

ఒకవిధంగా చూస్తే.. వాస్తవాధీనరేఖ వెంబడి చైనా కంటే భారత్‌ బలంగా ఉంది. ఎల్‌ఏసీ వెంట ఎక్కువ సంఖ్యలో  వైమానిక స్థావరాలు కలిగిఉండటంతోపాటు అవి కూడా సరిహద్దులకు చాలా తక్కువ దూరంలో ఉండటం భారత్‌కు కలిసి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఈ ప్రాంతంలో చైనా తన గగనతలానికి రక్షణగా.. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను మోహరించింది. భారత్‌ సైతం చైనా, పాకిస్థాన్ దుశ్చర్యలను ఏకకాలంలో తిప్పికొట్టేందుకు లేహ్‌ సహా లద్దాఖ్‌లోని అనేక ఎయిర్‌ బేస్‌లలో యుద్ధ విమానాలను సిద్ధం చేసింది.దూరంగా ఉన్న అంబాలా, హాసిమ్‌మారా వైమానిక స్థావరాల్లోనూ అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలను మోహరించింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని