లద్దాఖ్‌లో గడ్డకట్టిన ఉత్కంఠ..!

తాజా వార్తలు

Updated : 05/01/2021 17:39 IST

లద్దాఖ్‌లో గడ్డకట్టిన ఉత్కంఠ..!

 హిమఫలకం వలే పాంగాంగ్‌ సరస్సు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

లద్దాఖ్‌ మంచు ముద్దగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లోకి పడిపోయాయి. ఈ చలిలో ఎటువంటి లోహాలను పట్టుకొన్నా శరీరం తీవ్రంగా గాయపడుతుంది. ఒక్కసారి అతిశీతల పరిస్థితుల్లో శరీరం గాయపడితే అది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో  భారత సైనికులు ఆయుధాలతో లద్దాఖ్‌‌లో చైనా మూకలకు ఎదురొడ్డి నిలిచారు. ఏకపక్షంగా భూభాగాలను ఆక్రమించాలనే చైనా కక్కుర్తి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని తాజాగా రక్షణశాఖ సమీక్ష నివేదిక వెల్లడించింది. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని దీనిలో పేర్కొంది.

10టన్నుల ట్రక్కు ఒక్క ట్రిప్పుకు రూ.లక్ష ఖర్చు ..!

భారత్‌-చైనా వివాదానికి ప్రధాన కారణమైన పాంగాంగ్‌ సరస్సు గడ్డకట్టింది. ఇక్కడ పరిస్థితిని పలు ఓపెన్‌ సోర్స్ ఇంటెలిజెన్స్‌ ఉపగ్రహాల ఛాయా చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ ఒక దశలో దాదాపు మైనస్‌ 20 డిగ్రీలకు పైగా చలి నమోదవుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా భారత్‌ తమ దళాలను పూర్తిగా మోహరించింది. ఇక్కడ సైనికులకు శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిపోతుంది. ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ (14కోర్‌) రవాణా విభాగం అధిపతిగా పనిచేసిన మాజీ మేజర్‌ జనరల్‌ ఏపీ సింగ్‌ లెక్క ప్రకారం ఒక్కో సైనికుడిపై జీతం కాకుండా అదనంగా తక్కువలో తక్కువ రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. సైనికుడి పరికరాలు, ఆహారం, ఇతర కనీస అవసరాల కోసం ఖర్చులు ఉంటాయి. ఒక్క ట్రక్‌ 10 టన్నుల సరుకుతో శ్రీనగర్‌ నుంచి లేహ్‌కు వెళితే రూ.లక్ష ఖర్చవుతుంది. అదే సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌  50 టన్నుల సామగ్రితో గంటసేపు ప్రయాణిస్తే రూ.24 లక్షలు ఖర్చవుతుంది. ఒక్కో విమానం సాధారణంగా 200-250 టన్నులు తరలించగలదు. శీతాకాలంలో విమానాలను ఉపయోగించాల్సిందే.  లేహ్‌ నుంచి మారుమూల స్థావరాలకు తరలించాలంటే అయ్యే ఖర్చు దీనికి అదనం. సాధారణ సమయంలో 2లక్షల టన్నుల సరుకులు సరిపోతాయి.. ఇప్పుడు దాదాపు 3లక్షల టన్నులకు పైగా అవసరం అవుతాయి.

ఇంత ఖర్చు చేసినా.. అత్యంత ఎత్తులో అతిశీతల ప్రాంతంలో సైనికులకు వీటిని సిద్ధంగా ఉంచడం చాలా కీలకం. లద్దాఖ్‌‌లో చైనాతో ఘర్షణలు చోటు చేసుకొన్న ప్రాంతాలు 14,000 అడుగుల నుంచి 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ ఎస్‌సీఎంఈ అనే ప్రత్యేకమైన దుస్తులు, పరికరాలు వాడాల్సి ఉంటుంది. ఒక్కో సైనికుడికి వీటిని కొనుగోలు చేయాలంటే రూ.2లక్షలు వెచ్చించాలి. ప్రస్తుతం భారత్‌  అక్కడ మోహరించిన దళాల సంఖ్య 30 వేల నుంచి 50 వేల మధ్యలో ఉంటుంది.

ఆరోగ్యంపై పెను ప్రభావం..

అతి శీతల పరిస్థితుల్లో పనిచేయడం సైనికులకు పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో గాయాలు కాకూడదు. పొరబాటున లోహాలను చేతులతో పట్టుకంటే గాయపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అక్యూట్‌ మౌంటేన్‌ సిక్‌నెస్‌, హైఆల్టిట్యూడ్‌ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు వారాల కొద్దీ బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో మానసిక సమస్యలు కూడా తెలెత్తుతాయి.

ప్రతి 300 మీటర్ల ఎత్తుకు ఒక రాత్రి బస తప్పుదు..!

చైనా సైనికులు ఆక్సిజన్‌ అందించే ప్రత్యేక గదుల్లో ఉన్నట్లు కొన్నాళ్ల కిందట గ్లోబల్‌ టైమ్స్‌ ఘనంగా చెప్పుకొంది. వాస్తవానికి ఇది గొప్పగా చెపుకోవాల్సిన అంశం కాదు. చైనా తమ సైనికులను ఫారమ్‌ కోళ్ల వలే చూసుకుంటోంది. వారిని చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు.  2,500 నుంచి 3,000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రదేశాల్లో అడుగుపెట్టే కొద్దీ గాలి ఒత్తిడి తగ్గి వాటిల్లో ఆక్సిజన్‌ 30శాతం వరకు పడిపోతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందదు. వేగంగా ఎత్తయిన  ప్రదేశాలకు వెళ్లేకొద్దీ శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనిని తట్టుకోవడానికి హపోబ్యాగ్‌ను వాడుతుంటారు. అక్కడి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడ ఉండి వాతావరణానికి అలావాటు పడాలి. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. చైనా సైన్యంలో చాలా మంది కాలేజీ విద్యార్థుల వయస్సు వారు ఉండటం.. ఈ వాతవరణానికి తగిన శిక్షణ లేకపోవడం.. అలవాటు పడే లోపే వారిని మార్చేయడం.. ఇలాంటి కారణాలతో కుదురుకోలేకపోతున్నారు. భారత్‌ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఉంది. తమ సైనికులు పూర్తిగా ఆ వాతవరణానికి అలవాటు పడేలా శిక్షణ ఇచ్చింది. 

భారీ ఆయుధాలతో చైనా..

చైనా భారీ ఆయుధాలతో తూర్పు లద్దాఖ్‌‌లో చొరబడింది. ట్యాంక్‌లు, భారీ తుపాకులు ఇతర అసాధారణ ఆయుధాలు ఆ దేశ సైనికుల వద్ద ఉన్నాయి. వాస్తవాధీన రేఖ వెంట చాలా ప్రదేశాల్లో చైనా సైనికులు ఇలానే చేశారని తాజాగా రక్షణ శాఖ సమీక్ష నివేదికలో వెల్లడించింది. దీంతో భారత సైనికులు గట్టిగా జవాబిచ్చారని వెల్లడించింది. గల్వాన్‌ ఘటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా కుట్రలను ముందే పసిగట్టి ఆగస్టు 28-29 తేదీల్లో ముందుజాగ్రత్త చర్యగా పాంగాంగ్‌ సరస్సు దక్షిణ భాగంలో కొత్తశిఖరాలపై గస్తీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కైలాష్‌ రేంజి భారత్‌ ఆధీనంలోకి రావడంతో చర్చల్లో ఆధిపత్యం వచ్చింది.  లద్దాఖ్‌ చలిలో సాధారణ స్థాయిలోనే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ప్రమాదకర సంకేతాలు లేవని పేర్కొంది. దీంతో భారత్‌ సైన్యం హిమశిఖరాలను తలపించేలా చైనా మూకలకు అడ్డుగా ఉంది. 8 విడతల చర్చలు జరిగినా.. ఇప్పటి వరకు ఫలితం తేలలేదు. నవంబర్‌ 6వ తేదీ చర్చల్లో ఓ ప్రణాళిక ఇరుపక్షాల ముందుకు వచ్చినా.. ఆ తర్వాత ఎటువంటి చర్చలు చోటు చేసుకోలేదు. 

ఇదీ చదవండీ

చైనాతో ‘గస్తీ’మే సవాల్‌!

మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని