షాపుల బయట గుమిగూడితే మేమేం చేస్తాం?

తాజా వార్తలు

Published : 23/06/2021 00:03 IST

షాపుల బయట గుమిగూడితే మేమేం చేస్తాం?

దిల్లీ: రాజధాని నగరంలోని మార్కెట్లలో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ అక్కడి హైకోర్టు వ్యాఖ్యానించడంపై దిల్లీ వ్యాపారుల సంఘం స్పందించింది.  దుకాణాల బయట జనం గుమిగూడితే తామేం చేయగలమని కోర్టుకు తెలిపింది. మార్కెట్‌ పరిసరాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, దానికి వ్యాపారులేం చేయలేరని వివరించింది. దుకాణాల బయట ఉన్న వ్యక్తులను నియంత్రించడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం సమాజ శ్రేయస్సు కోసం వ్యాపారులు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని  పేర్కొంది. లేదంటే కరోనా మూడోదశ వ్యాప్తి సంభవించే ప్రమాదముందని హెచ్చరించింది.  

రద్దీ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  ఈ విషయంపై చర్చించేందుకు అధికారులు, వ్యాపారులు సమావేశమవ్వాలని తెలిపింది. ఇటీవల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో దుకాణాలు, వ్యాపార సమూహాలు తెరచుకునేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.  దిల్లీ వ్యాపారుల సమాఖ్య ఛైర్మన్‌ బ్రిజేష్‌ గోయల్‌ ఈ విషయంపై మాట్లాడుతూ.. దుకాణాల్లో జనం గుమిగూడకుండా చూసే బాధ్యత ఆ యజమానికి ఉంటుంది కానీ, బయటి ప్రజలను ఆయనెలా నియంత్రించగలడని అన్నారు. మార్కెట్‌ పరిసరాల్లో జనాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులే తీసుకోవాలని అన్నారు. అధికారులకు వ్యాపారస్తులు కూడా సహకరిస్తారన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని