దిల్లీ పాజిటివ్‌: 36శాతం నుంచి 6శాతానికి!

తాజా వార్తలు

Published : 19/05/2021 20:21 IST

దిల్లీ పాజిటివ్‌: 36శాతం నుంచి 6శాతానికి!

మూడో ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధం - దిల్లీ సీఎం

దిల్లీ: కరోనా ఉద్ధృతికి అల్లాడిపోయిన దేశ రాజధానిలో మహమ్మారి వ్యాప్తి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలలో 36శాతానికి పెరిగిన కొవిడ్‌ పాజిటివిటీ రేటు తాజాగా 5.7శాతానికి తగ్గింది. గడిచిన 24గంటల్లో అక్కడ 3800పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్‌ 5 తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం, పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉంటే కొవిడ్‌ ఆంక్షలను సడలించుకోవచ్చు.

దేశంలో రెండు నెలల క్రితం మహారాష్ట్ర తర్వాత అత్యధిక పాజిటివ్‌ కేసులు దిల్లీలో నమోదైన విషయం తెలిసిందే. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య 30వేలు దాటింది. దీంతో వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలుచేయడంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 14లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ప్రస్తుతం 45వేల క్రియాశీల కేసులు ఉన్నాయి.

మూడో ముప్పుపై అప్రమత్తం..

ప్రస్తుతం వైరస్‌ తీవ్రత కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ మూడు ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో ముప్పు బారినపడకుండా చిన్నారులను రక్షించుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఒకవేళ థర్డ్‌ వేవ్‌ వస్తే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గతంలో కంటే మెరుగుగా వైద్య పడకలు, ఆక్సిజన్‌, ఔషధాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

పెరుగుతున్న ఖాళీ పడకలు..

కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దిల్లీ నగరం, ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ముఖ్యంగా ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులు అల్లాడిపోయారు. న్యాయస్థానాల ఆదేశాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతో తాజాగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడం, ఆసుపత్రుల నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడంతో పలు కొవిడ్‌ ఆసుపత్రులు ఖాళీ అవుతున్నాయి. దిల్లీ ప్రభుత్వ ప్రత్యేక యాప్‌ ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తం 27వేల పడకలు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం వాటిలో 13వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 11వేల ఆక్సిజన్‌ పడకలు కాగా మరో 1200లకు పైగా ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయి.

మరణాలు కాస్త తగ్గుముఖం..

కరోనా పాజిటివ్‌ కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ కొవిడ్‌ మరణాలు మాత్రం దిల్లీని వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం నిత్యం 400లకు పైగా నమోదైన కొవిడ్‌ మరణాలు ప్రస్తుతం 200లకు తగ్గాయి. నిన్న ఒక్కరోజే 235 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ మృతుల సంఖ్య 22వేలు దాటింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని